Share News

Trumps Strategic Pressure: ఫలించిన వ్యూహం

ABN , Publish Date - Oct 31 , 2025 | 04:58 AM

భారతప్రధాని నరేంద్రమోదీ రష్యానుంచి ముడి చమురు కొనడం ఆపివేయబోతున్నారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించినప్పుడు అధికులు ఆయనమాట నమ్మలేదు...

Trumps Strategic Pressure: ఫలించిన వ్యూహం

భారతప్రధాని నరేంద్రమోదీ రష్యానుంచి ముడి చమురు కొనడం ఆపివేయబోతున్నారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించినప్పుడు అధికులు ఆయనమాట నమ్మలేదు. భారత్‌–పాక్‌ యుద్ధాన్ని తానే ఆపాననీ, వాణిజ్యాస్త్రాన్ని ప్రయోగించి రెండు దేశాలను దారికితెచ్చానని ట్రంప్‌ యాభైఐదుసార్లు చెప్పుకున్నా, భారత పాలకులు, అధికారులు అత్యధిక సందర్భాల్లో మౌనాన్నే ఆశ్రయించారు. అటు ఆమోదించకుండా, ఇటు పూర్తిగా కాదనకుండా మొదట్లో జాగ్రత్తపడినవారు, ఆ తరువాత, పాక్‌ సైనికాధికారులు దాడులు ఆపండి మహాప్రభో అని వేడుకోవడంతో ఆపరేషన్‌ సిందూర్‌ను తామే నిలిపివేశామన్నారు. భారత్‌ ఇకపై రష్యా చమురు కొనబోదని అదేపనిగా ఐదారుసార్లు చెప్పిన ట్రంప్‌, దిగుమతులు పూర్తిగా ఆపివేయడానికి కొంతసమయం పడుతుందని ఉదారంగా అన్నప్పటికీ, ఆయన కోరిక అతివేగంగా నెరవేరుతోంది. ఆయిల్‌ కంపెనీలు దిగుమతులు నిలిపివేయడమే కాదు, ఏకంగా సముద్రం మధ్యలో ఉన్న ముడిచమురు నౌకలు ప్రయాణం ఆపి, తిరిగి రష్యాకు మళ్ళిపోతున్న వార్తలు సైతం వింటున్నాం. అయినా ట్రంప్‌కు అక్కసుతీరడం లేదు. దక్షిణకొరియాలో ఆసియా పసిఫిక్‌ ఎకనామిక్‌ కోపరేషన్‌ (ఎపెక్‌) సదస్సులో ఆపరేషన్‌ సిందూర్‌ గురించీ మోదీ గురించీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపరితలంలో ప్రశంసలుగా కనిపించే ఒత్తిడి వ్యూహం.

వ్యాపారవేత్త అయిన ట్రంప్‌కు ఎవరిని ఎలా బుజ్జగించాలో, ఏ విధంగా లొంగదీసుకోవాలో తెలుసు. అర్థంపర్థంలేకుండా మాట్లాడుతూనే ఎదుటివారిని ఇరకాటంలో పడేయగలదిట్ట. ఆపరేషన్‌ సిందూర్‌ని అదేపనిగా ప్రస్తావిస్తూ భారతపాలకులమీద ఒత్తిడి పెంచే వ్యూహానికి ఆయన మరింత పదునుపెడుతున్నారు. యుద్ధాన్ని ఆపిన శాంతిదూతగా ట్రంప్‌ను దేశ విదేశీ వేదికలమీద పాకిస్థాన్‌ ప్రధాని, సైన్యాధ్యక్షుడు ఆకాశానికి ఎత్తేస్తూ, ఏకంగా నోబెల్‌ శాంతి కోసం నామినేట్‌ చేస్తూంటే, అవును నిజమేనని భారత పాలకులు ఒక్కమాట కూడా అననందుకు ఆయన అలిగాడు, ఆగ్రహించాడు. నేరుగా కాకున్నా, పరోక్షంగానైనా ప్రశంసించనందుకు నొచ్చుకున్నాడు. సుంకాల యుద్ధాన్ని ఇంత తీవ్రతరం చేయడం వెనుక దెబ్బతిన్న ఆయన అహం ఉన్నదని అందరికీ తెలుసు. గతంలో యుద్ధంలో కూలిన విమానాల ప్రస్తావన చేసిన ట్రంప్‌ ఇప్పుడు ఏకంగా నిగనిగలాడే అందమైన ఏడు సరికొత్త విమానాలంటూ మరో అడుగుముందుకు వేశారు. గతంలో, ఆపరేషన్‌ సిందూర్‌లో విమానాల కూల్చివేత విషయాన్ని అప్పటివరకూ ప్రకటించని భారతప్రభుత్వం, ట్రంప్‌ చెప్పిన సంఖ్య గురించి మాట్లాడకుండానే కూలినమాట వాస్తవమేనని ఆ తరువాత ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విమానాలు ఎవరివో, ఏ కంపెనీవో నేరుగా నిర్వచించకుండా భారత్‌మీద పరోక్షంగా ఒత్తిడిపెంచే వ్యూహంలో ఉన్నారాయన.


మోదీని ప్రశంసిస్తూనే భారత్‌ను మోదే పనిలో ట్రంప్‌ నిపుణుడు. నాకు మంచి మిత్రుడు అంటూనే సుంకాలు, ప్రతీకార సుంకాలు, చమురు సుంకాలతో ఆయన కక్షతీర్చుకున్నాడు. ఉక్రెయిన్‌ యుద్ధంతో రష్యానుంచి ఒక్కసారిగా నలభైశాతానికి చేరిన ముడిచమురు దిగుమతులను ఆపించేందుకు ఆయన సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించాడు, అంతిమంగా తాను అనుకున్నది సాధించాడు, మరోపక్క పైకి మాత్రం మోదీని మొండిమనిషని అంటున్నారు. తాను కోరుకున్న రీతిలో రష్యానుంచి పూర్తిగా ముడిచమురు దిగుమతులు నిలిచిపోతున్న తరుణంలో, మరిన్ని సరికొత్త రీతుల్లో భారత్‌ను వాణిజ్యఒప్పందంలో లొంగదీసే ప్రయత్నంలో ట్రంప్‌ ఉన్నారు. ట్రంప్‌ ఏవో వ్యాఖ్యలు చేసినంతమాత్రాన పట్టించుకోనక్కరలేదని, చమురు విషయంలో మోదీ దిగిరారనీ, ఆప్తమిత్ర రష్యాను వదులుకోబోరనీ కొందరు విశ్లేషించినప్పటికీ, అంతిమంగా ట్రంప్‌ కోరినట్టుగానే జరుగుతోంది. ట్రంప్‌ ఆంక్షల దెబ్బకు భారత్‌ అసంఘటిత రంగం బాగా దెబ్బతిని ఉన్నందున గత్యంతరం లేదన్న మాట కూడా నిజం. కానీ, దేశ ఇంధనభద్రతను పరిరక్షించుకోవడానికే ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నామని, ఒక ఏడాది భారత్‌ కొనే ఇంధనం యూరప్‌ ఒక పూట కొనుగోలు చేసేదానికి సమానమని గతంలో అంతర్జాతీయ వేదికలమీద గర్జించిన మన నేతలు ఇప్పుడు మాట్లాడటం లేదు. భారతీయుల ప్రయోజనాల పరిరక్షణే తమ లక్ష్యమని, ఉపన్యాసాలు దంచిన పాలకులు ఇప్పుడు కాలువెనక్కుతీసుకొనే కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇన్సురెన్స్ డబ్బుల కోసం తల్లి దారుణం.. లవర్‌తో కలిసి కొడుకు మర్డర్..

ఈ బ్రదర్ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఫోన్‌ను ఎలా సెట్ చేశాడో చూడండి..

Updated Date - Oct 31 , 2025 | 04:58 AM