Share News

విషాదం

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:51 AM

కోట్లాదిమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ఆధ్యాత్మిక వేడుకలో తొక్కిసలాట జరిగి, ముప్పైమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధకలిగిస్తున్నది. ఇటువంటి భారీఉత్సవాల నిర్వహణలో చిన్న తప్పిదం జరిగినా...

విషాదం

కోట్లాదిమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ఆధ్యాత్మిక వేడుకలో తొక్కిసలాట జరిగి, ముప్పైమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధకలిగిస్తున్నది. ఇటువంటి భారీఉత్సవాల నిర్వహణలో చిన్న తప్పిదం జరిగినా వందలమంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఊహకు అందని ఉపద్రవాలను, ప్రమాదాల సంభావ్యతను అంచనావేసుకొని సంసిద్ధంగా ఉండాల్సిన సందర్భాలు ఇవి.

ఇప్పటికే కొనసాగుతున్న రద్దీకి తోడు, మౌని అమావాస్య నాడు కోట్లాదిమంది అదనంగా వచ్చిచేరతారని సదరు మంచిరోజులకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్న నిర్వాహకులకు తెలియనిదేమీకాదు. తొక్కిసలాటకు పురిగొల్పిన పరిస్థితులమీద విభిన్నమైన కథనాలు వినబడుతున్నాయి. ఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన చెత్తడబ్బాలు చీకట్లో కనబడక కొందరు తన్నుకొనిపడిపోయారనీ, వెనక ఉన్నవారు నెత్తిమీద పెద్దపెద్దబ్యాగులతో సహా వీరిమీద పడ్డారని, పవిత్రస్నానాలకు సమయం ఆసన్నమైందన్న ప్రకటనలు మరోపక్క వినబడుతున్న హడావుడిలో ఈ మరణాలు సంభవించాయని కొన్ని కథనాలు చెబుతున్నాయి.


బ్రహ్మముహూర్తానికి ముందు భక్తులు పెద్దసంఖ్యలో ఒక్కసారిగా వచ్చిపడి, కట్టుతప్పి, బారికేడ్లు ధ్వంసం చేసి, మరోదారిపట్టడంతో ఈ దారుణం జరిగిపోయిందని యూపీ పోలీసు ఉన్నతాధికారి చెబుతున్నారు. రెండునెలలకాలంలో 40కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని, ఆరు పవిత్రదినాల్లో పదికోట్లమందితో ఘాట్లు కిటకిటలాడతాయని ముందుగానే అంచనాలు ఉండగా, పెద్దపెద్ద ఘోరాలకు ఇలా చిన్నచిన్న కారణాలు చెబుతూంటే ఆశ్చర్యం కలుగుతుంది. భక్తజనం ఇంత భారీగా ఉన్నప్పుడు వారిని నియంత్రించడం, నిలువరించడం సులభమేమీ కాదు. కానీ, తగిన సదుపాయాలు, ఏర్పాట్లు చేశామంటూ విస్తృత ప్రచారంతో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేట్టుగా ప్రభుత్వాలే కృషి చేస్తున్నప్పుడు, ఆ పవిత్ర కార్యం క్షేమంగా పూర్తిచేయాల్సిన బాధ్యత మరింత ఉంది.


రాష్ట్రపతి, ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి ఈ సంఘటనకు తీవ్రంగా చలించిపోయారు. ఘటన జరిగిన అనేకగంటలపాటు ఫోన్‌ సిగ్నల్స్‌ అందుబాటులో లేకుండాపోయాయని, వదంతులవ్యాప్తిని నిరోధించడానికి ఇది జరిగివుంటుందని వార్తలు వచ్చాయి. కానీ, వాస్తవంగా జరిగిందేమిటో తెలియకపోవడం కూడా ఇటువంటి సందర్భాల్లో మరింత గందరగోళానికి, భయాలకు అవకాశం ఇస్తుంది. జరిగిన ఘటనమీద బాధను వ్యక్తపరుస్తూనే విపక్షాలు పలురకాల విమర్శలు చేస్తున్నాయి. అందులో రాజకీయం లేకపోలేదు కానీ, సామాన్యభక్త జనానికి అందుబాటులో ఉండాల్సిన ఘాట్ల సంఖ్యను కుదించడం, వీఐపీలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి విమర్శలు పూర్తిగా కొట్టిపారేయలేనివి. మౌని అమావాస్యనాడు సంగమఘాట్‌లో అమృత స్నానాలకు సామాన్య భక్తులు పోటెత్తడం సహజం. భక్తులు సంగమ ముఖద్వారం వద్దకు రావద్దనీ, సమీపంలో ఉన్న ఘాట్లలోనే స్నానాలు చేసి వెనక్కుపోవాలని సీఎంతో సహా అందరూ ఘటన అనంతరం చేస్తున్న సూచన ముందుగానే ప్రజలకు విస్తృతంగా చేరివుంటే ఈ ప్రమాదం జరిగివుండేది కాదేమో. వీఐపీలను అనుమతించలేదని పోలీసు అధికారి చెబుతున్నప్పటికీ, అధిక పాంటూన్‌ బ్రిడ్జీలను, మార్గాలను ముందుగానే మూసివేసి, సామాన్యజనానికి దారీతెన్నూ లేకుండా చేశారన్న విమర్శలున్నాయి.


ఘటన నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే మార్గాలన్నీ మూసివేయడంతో అంతిమంగా అత్యధికసంఖ్యలో భక్తులు రోడ్లమీదే గంటలతరబడి నిలిచిపోవాల్సివచ్చింది. తొక్కిసలాట బీభత్స దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయి. ఆప్తులను కోల్పోయినవారు, అవయవాలు ఛిద్రమై ఆస్పత్రులపాలైనవారి వేదన తీర్చలేనిది. లక్షల్లోనూ, కోట్లలోనూ జనం చేరినప్పుడు తొక్కిసలాటలు సహజమేనని, స్వాతంత్ర్యానంతర తొలికుంభమేళా సహా పలు సందర్భాల్లో ఇంతకంటే ఎక్కువసంఖ్యలో జనం మరణించారని కొందరు వాదిస్తున్నారు. గతకాలపు విషాదాలను ఎవరు ఎందుకు ఇప్పుడు గుర్తుచేస్తారో తెలియనిదేమీకాదు. కానీ, ఈ మారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రపంచస్థాయి నిర్వహణ పద్ధతులను అమలుచేశామని చెబుతున్నందున ఇటువంటివి జరగవన్న నమ్మకం, నిర్వహణా వ్యవస్థలపట్ల విశ్వాసం ప్రజల్లో హెచ్చుతుంది. మరో మూడు పవిత్రస్నానాలతో సహా మహాకుంభమేళా అత్యంత భద్రంగా, సవ్యంగా పూర్తికావాలని కోరుకుందాం.

Updated Date - Jan 30 , 2025 | 03:51 AM