Share News

‘సోనా’ సొరంగం..!

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:24 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొన్న సోమవారం జమ్మూకశ్మీర్‌లో సోనామార్గ్‌ సొరంగాన్ని ఆరంభించారు. ఆరున్నర కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగమార్గం వల్ల ఈ కేంద్రపాలిత ప్రాంతానికి ఆర్థికంగానూ, దేశానికి రక్షణపరంగానూ...

‘సోనా’ సొరంగం..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొన్న సోమవారం జమ్మూకశ్మీర్‌లో సోనామార్గ్‌ సొరంగాన్ని ఆరంభించారు. ఆరున్నర కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగమార్గం వల్ల ఈ కేంద్రపాలిత ప్రాంతానికి ఆర్థికంగానూ, దేశానికి రక్షణపరంగానూ ఎంతోమేలు జరుగుతుందని విశ్లేషణలు వెలువడ్డాయి. సముద్రమట్టానికి ఎనిమిదిన్నరవేల అడుగులో దీనిని నిర్మాణానికి ఎవరు ఎంతగా శ్రమించారో ఆరంభానికి బాగా ముందునుంచే వ్యాఖ్యానాలు వినబడ్డాయి. మంచుపెళ్ళలు విరిగిపడుతూ రాకపోకలకు ఏమాత్రం వీలులేని పరిస్థితులు ఈ సొరంగం ఏర్పాటుతో పూర్తిగా మారినమాట వాస్తవం. శ్రీనగర్‌నుంచి సోనామార్గ్‌కు దట్టమైన మంచున్నకాలంలో కూడా సులువుగా పోవచ్చును. ప్రజల రాకపోకలకు వీలుకల్పిస్తూ, వ్యాపారావకాశాలను పెంచుతున్న ఈ సొరంగం ఏర్పాటుతో కశ్మీర్‌కు ఎంత లబ్ధిచేకూరగలదో ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కశ్మీర్‌ను గతంలో భూతలస్వర్గం అనేవారనీ, సోనామార్గ్‌ సొరంగం ఆరంభంతో ఇకపై మళ్ళీ అలా పిలవడం మొదలవుతుందనీ అన్నారాయన. తమ పదేళ్ళ ఏలుబడిలోనే దేశం ప్రగతిమెట్లు ఎక్కినట్టుగానూ, ప్రత్యేకప్రతిపత్తి పోవడంతోనే కశ్మీర్‌ కళకళలాడుతున్నట్టుగానూ వ్యాఖ్యలు చేయడం బీజేపీ పెద్దలకు అలవాటే. అతిశయోక్తులను అటుంచితే, ఏడాది అంతా శ్రీనగర్‌ను లద్దాఖ్‌తో అనుసంధానించే ఈ టన్నెల్‌ ఆరంభం కశ్మీర్‌ ఆర్థిక పురోగతికి తోడ్పడేమాట నిజం.


మోదీ ప్రధాని కావడానికి రెండేళ్ళకు ముందే ఈ సొరంగ నిర్మాణానికి పునాదులు పడినవిషయాన్ని గుర్తుచేస్తూ, ఈ కీర్తిలో తమకూ వాటా దక్కాలని కాంగ్రెస్‌ వాదిస్తోంది. మొత్తం కీర్తి మోదీకి పోతుందేమోనన్న భయంతో కాబోలు అప్పుడు తాము చూపిన చొరవనూ, పడిన శ్రమనూ ఆ పార్టీ గుర్తుచేస్తోంది. ఎవరి పాత్ర ఎంత అన్నది అటుంచితే, ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్న ప్రతీ ఒక్కరి పట్టుదలవల్లనే ఈ మూడువేలకోట్ల రూపాయల నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మాట నిజం. అత్యంత సంక్లిష్టమైన ప్రాంతంలో, ప్రకృతి బీభత్సాలకు ఎదురొడ్డి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి పన్నెండేళ్ళు పట్టడంలో తప్పేమీ లేదు. 1999లో కార్గిల్‌లో ఓ చిన్నయుద్ధం చేయాల్సివచ్చిన తరువాత, సర్వకాల సర్వావస్థల్లోనూ సైన్యం ఎల్‌వోసీ, ఎల్‌ఏసీలకు సులువుగా చేరగలిగే మార్గాలు ఉండాలన్న విషయం మనకు స్పష్టంగా తెలిసొచ్చింది. చైనా దురాక్రమణల తరువాత లద్దాఖ్‌ మీద మరింత పట్టుబిగించాల్సిన ఆవశ్యకత కనిపించింది. కార్గిల్‌, లద్దాఖ్‌ సెక్టార్లను సైనికపరంగా మనకు చేరువచేయడానికి ఈ టన్నెల్‌ ఉపకరిస్తుంది.


అప్పట్లో అబ్దుల్లాలు అధికారంలో ఉండగానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం, ఇప్పుడు మళ్ళీ వారి ఏలుబడిలోనే ఆరంభోత్సవం జరగడం కొందరు గుర్తుచేస్తున్నారు. ఆ అనుబంధం వల్లనో, మరేకారణంచేతనో, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా మాత్రం ఈ టన్నెల్‌ ఆరంభోత్సవ కార్యక్రమంలో మోదీని అధికంగా కీర్తించారని కొందరికి ఆగ్రహం కలిగింది. మోదీ మూడోసారి ప్రధానిగా అధికారం చేపట్టి్న తర్వాత శ్రీనగర్‌లో అంతర్జాతీయ యోగాదినోత్సవంలో పాల్గొన్నారని, ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు ఆయన అప్పుడుచేసిన వాగ్దానాన్ని నాలుగునెలల్లోనే నెరవేర్చారని ఒమర్‌ చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రి కావడానికి వీలుగా ఎన్నికలు జరిపినందుకు ఆయన ఎన్నికల సంఘానికీ, ప్రధానికీ కృతజ్ఞతలు తెలియచేశారు. అయితే, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వం మెడమీద కత్తిపెట్టిన కారణంగా, అప్పట్లో కేంద్రప్రభుత్వం నిర్దిష్టమైన గడువుకు హామీపడిన విషయాన్ని ఒమర్‌ మరిచిపోయినట్టు ఉన్నారు. అలాగే, ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగాయని ఉద్ఘాటించడం ద్వారా తాను భాగస్వామిగా ఉన్న ఇండియాబ్లాక్‌ను కూడా ఆయన ఇరకాటంలో పడేశారు. కశ్మీర్‌లో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని ఆయన ఏ ప్రాతిపదికన వ్యాఖ్యానించారో తెలియదు. సోన్‌మార్గ్‌ సొరంగం నిర్మాణంలో ఉండగానే ఏడుగురు కార్మికులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రతిపత్తికోసమే ఒమర్‌ అబ్దుల్లా ఈ మోదీ కీర్తిగానానికి ఉపక్రమించి ఉండవచ్చు. ఆ కాలం ఎప్పుడు కలిసొస్తుందో మోదీ తెలివిగా చెప్పలేదు కానీ, ఇచ్చినమాట ప్రకారం త్వరలోనే అది నెరవేరితే జమ్మూకశ్మీర్‌ ప్రజలకు మేలు జరుగుతుంది.

Updated Date - Jan 16 , 2025 | 04:25 AM