Johannan : మలయాళీ బానిసల న్యాయ ఉద్ఘోష
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:18 AM
కేరళకు చెందిన పోయ్‌కయిల్ యోహనన్ గొప్ప సంఘ సంస్కర్త. సామాజిక విప్లవకారుడిగా ఆయన అక్కడి బానిస జాతుల అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాడాడు. వివిధ సంస్థలను స్థాపించి తన పాటలు, ప్రసంగాల ద్వారా దళిత జన ఐక్యతకు పాటుపడ్డాడు.

కేరళకు చెందిన పోయ్‌కయిల్ యోహనన్ గొప్ప సంఘ సంస్కర్త. సామాజిక విప్లవకారుడిగా ఆయన అక్కడి బానిస జాతుల అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాడాడు. వివిధ సంస్థలను స్థాపించి తన పాటలు, ప్రసంగాల ద్వారా దళిత జన ఐక్యతకు పాటుపడ్డాడు. ఆనాటి బానిస జాతుల వేదనలను తన పాటల ద్వారా వినిపించాడు. ఆయన రాసిన ‘నా గురించి ఒక్క అక్షరమూ లేదు’ అనే గీతం ఇప్పటికీ అక్కడి జనం గొంతెత్తి పాడుకుంటారు. ‘‘ఎన్నో జాతుల గురించి చరిత్రలున్నాయి/ మా గురించి ఎక్కడా ఓ అక్షరం లేదు/ నా జాతి చరిత్ర రాసేందుకు భూమ్మీద ఎవరూ లేరు/ నేల నుంచి ఆకాశం దాకా మమ్మల్ని ద్వేషించేవారే!’’ అనే పంక్తులు అప్పటి మలయాళీ బానిస జాతుల వేదనను స్పష్టం చేస్తాయి. దేశంలో నేటికీ మారని అణగారిన వర్గాల పరిస్థితులకు అవి అద్దం పడతాయి.
బానిస వ్యవస్థ అంటే అమెరికాలో నీగ్రోలే గుర్తుకొస్తుంటారు. అయితే అదే పరిస్థితి కేరళలోని సంస్థానాల్లో ఎంతోకాలం కొనసాగింది. దళిత, గిరిజనులను దొరకబుచ్చుకొని వారిని బానిసలుగా అమ్ముకున్న చరిత్ర కేరళకు ఉంది. అయితే, బ్రిటిష్ పాలనా కాలంలో వివిధ సంస్థానాలు 1850–60 దశకాల్లో ఈ దురాచారాన్ని రద్దు చేశాయి. అయితే చట్టాలు సామాజిక ఆచరణలోకి ఊరికే రావు. వాటి కోసం సామాజిక ఉద్యమాలు కావాలి. దళితజాతులపై వివక్షను సమాజం లోంచి పెకిలించేందుకు పాటుపడిన కేరళ ఉద్యమకర్తల్లో పోయ్‌కయిల్ యోహనన్ ముందుంటారు. కేరళలోని ఎరవిపేరూరులో యోహనన్ 17 ఫిబ్రవరి 1879న జన్మించాడు. ఆయనది పరయ బానిస కుటుంబం. దళిత క్రైస్తవులపై వివక్షకు నిరసనగా 1909లో ఆయన ప్రత్యక్ష రక్ష దైవసభను స్థాపించాడు. ఈ సభ ద్వారా దిగువజాతులపై జరుగుతున్న మతపర వైపరీత్యాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. మతాతీతంగా మనుషులందరిలో దేవుడున్నాడని, మనుషులందరి హితం కోరే మనిషి రూపంలోనే ఉద్భవిస్తాడని ఆయన అనుచరులకు బోధించాడు.
సంస్కర్తగా యోహనన్ అణగారిన జాతుల క్షోభ అందరికీ చేరేందుకు కవిత్వాన్ని ఆయుధంగా వాడుకున్నాడు. ఆయన గేయాల్లో దళిత పేదల బాధలు కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో, జనభాషలో రాసిన ఆ పాటలు మౌఖికంగా వ్యాప్తి చెంది ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ‘‘నన్ను బానిస అంటే చర్చికి వెళ్ళాను/ అక్కడా అందరితో సమానంగా నన్ను చూడలేదు/ హిందుత్వపు నీడలో అస్తిత్వాన్ని వెదుకుతూ/ చివరి వరుసలో అనాథగా తిరుగుతున్నాను/ హిందువులు, క్రిస్టియన్లు మమ్మల్ని ఎవరూ తమవారిగా ఒప్పుకోరు/ నా జాతి గురించి చెప్పుకోవడానికి నేను సిగ్గు పడను/ గుండె నిండా వేదనతో నా గాథ ముందుంచుతాను/ జనంలోని క్రూరత్వాన్ని విప్పి చెబుతాను/ అందరి దృష్టిలో ఈ భూమ్మీద నేను శాపగ్రస్త జీవిని/ భూమ్యాకాశాల నడమ నన్నే నిందిస్తారు/ భూమ్మీద అన్నిటిని తీర్చిదిద్దిన దేవుడు/ ఈ వివక్షను ఎలా అనుమతించాడు’’ అని తన గీతాల్లో ఆయన ప్రశ్నించాడు.
‘‘దైవమా నన్ను విస్మరించకుము/ భూమ్మీద ఏ ఒక్కరు నన్ను దీవించ లేదు/ భవిష్యత్తులో కూడా జరుగుతుందని ఆశ లేదు/ ఈ భూమ్మీద నన్ను అంగీకరించేవారెవరూ లేరు/ మరెవరు రారు/ నీ భుజాలతో చుట్టేసి నా కన్నీరును తుడువు/ ఈ భూమ్మీద ఎవరికీ చెందని గూటి కోసం వెదుకుతూ తిరుగుతున్నాను/ నా బాధ్యత తీసుకొని చేరదీసి పక్కన కూచోబెట్టుకో/ మోక్షం ప్రసాదించి నా బాధల్ని తుడిచెయ్’’ అని ఆధ్యాత్మిక ధోరణిలో వేడుకున్నాడు. రత్నమాణికల్ అనే పేరిట యోహనన్ గీతాలు సంపుటిగా వచ్చాయి. ఎం.ఆర్. రేణుకుమార్ ‘పోయ్‌కయిల్ యోహనన్’ అనే పేరుతో ఆయన ఆత్మకథను రాశాడు. యోహనన్ జీవితాన్ని వి.వి. శాంత కుమార్ ‘మన్నిక్కలే మాణిక్యం’ పేరుతో నాటకంగా తీర్చిదిద్దాడు. ఆత్మగౌరవం కోసం వెదికిన యోహనన్ తొలుత మార్తోమా సిరియన్ చర్చి విధానాన్ని స్వీకరించాడు. అక్కడ కూడా క్రైస్తవుల మధ్య సమానత్వం దొరకకపోవడంతో దాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ఎవాంజెలికల్ అనే క్రిస్టియన్ బ్రెథ్రెన్ మిషన్‌లో చేరి నాలుగేళ్ళ తర్వాత అదీ నచ్చక బయటికొచ్చాడు. ఈ రెండు అనుభవాల తర్వాత భారత సమాజంలోని క్రిస్టియన్లలో కులతత్వం మూలాల్లోనే ఉందని, క్రీస్తు బోధనల వల్ల అది మరింత లోతుగా వెళ్లిందని గ్రహించిన ఆయన సొంత మార్గంలో దళిత విముక్తి ఉద్యమంగా ప్రత్యక్ష రక్ష దైవసభను స్థాపించాడు.
‘‘బైబిల్‌లో మా గురించి ఒక్క అక్షరం లేదు. అందులో ఉన్నదంతా బయటి ప్రాంతాల్లో జరిగిందే. మా బానిసత్వం గురించి ప్రస్తావన, సానుభూతి కనబడని పుస్తకాన్ని మేమెందుకు చదవాలి’’ అని ప్రశ్నించాడు. క్రైస్తవాన్ని నిరసిస్తూ తనను ద్రావిడ దళితుడిగా ప్రకటించుకున్నాడు. కేరళకు చెందిన ప్రసిద్ధ సంఘ సంస్కర్త అయ్యంకాళి స్థాపించిన సాధుజన పరిపాలన సంఘంలో సభ్యత్వం తీసుకున్నాడు. దళితజాతి ఉన్నతికి నిర్విరామంగా పాటుపడిన యోహనన్ 29 జూన్, 1939న మరణించాడు. నేటికీ కేరళలోని అణగారిన వర్గాల గుండెల్లో ఉద్యమకర్తగా, వాగ్గేయకారుడిగా ఆయన స్థానం పదిలంగా ఉంది.
l బి. నర్సన్
(ఫిబ్రవరి 17: పోయ్‌కయిల్ యోహనన్ జయంతి)