Share News

ముగిసిన మహావేడుక

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:57 AM

దేశాన్ని నలభైఐదురోజులపాటు మరో ఊసులేకుండా ముందుకు కదిలించిన మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. ఆద్యంతమూ అద్భుతంగా సాగిన ఈ ఆధ్యాత్మిక...

ముగిసిన మహావేడుక

దేశాన్ని నలభైఐదురోజులపాటు మరో ఊసులేకుండా ముందుకు కదిలించిన మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. ఆద్యంతమూ అద్భుతంగా సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఎవరైనా అసౌకర్యానికి గురి అయివుంటే క్షమించమని కోరారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కుంభమేళాను జాతి ఐక్యతకోసం జరిగిన మహాయజ్ఞంగా, దేశం కొత్తశక్తితో సాగుతోందనడానికి ప్రబల నిదర్శనంగా, నవశకానికి నాందిగా పలు రీతుల్లో, విశేషణాలతో ఆయన అభివర్ణించారు. ఇంతటి మహోన్నత కార్యం మోదీ కారణంగానే సుసాధ్యమైందని యోగి ఆదిత్యనాథ్‌ సవినయంగా ప్రశంసిస్తే, యోగి ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. పరస్పర సహకారంతో, సాధ్యమైనంత సవ్యంగా నిర్వహించిన బృహత్‌ కార్యం కనుక డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ను అభినందించవలసిందే.


సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా నలభై ఐదురోజుల పాటు పుణ్యస్నానాలు నిరంతరాయంగా కొనసాగాయి. సంక్రాంతినుంచి మహాశివరాత్రివరకూ గంగా తీరం నిత్య జన ప్రవాహంతో ధగధగలాడింది. సాధారణ రోజుల్లోనే జనం కిటకిటలాడుతూంటే, పర్వదినాల్లో ఆ సందోహం లెక్కకు అందనిది. మూడు అమృతస్నానాలతో వైభవంగా సాగిన మహాకుంభమేళాలో ఆఖరురోజున మహాశివరాత్రి కూడా తోడై ఘాట్లన్నీ మహదేవుని నామస్మరణతో మారుమోగిపోయాయి. వారూ వీరని లేదు, సామాన్యులనుంచి అసామాన్యులవరకూ అందరూ మూడునదుల్లో మునకలేసి తరించారు. దేశపాలకులు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, క్రీడాకారులు అందరినీ ఒకచోటకు చేర్చింది ఈ పుణ్యస్థలి.


డబుల్‌ ఇంజన్‌ సర్కారు కుంభమేళాను రాజకీయం చేసిందనీ, సొంత ప్రచారానికి వాడుకుందని విపక్షాలు విమర్శించడం, బీజేపీ నాయకులు ఎదురుదాడిచేయడం చూస్తున్నదే. మహాకుంభ్‌లో ఎవరు ఏది కోరుకుంటే అదే దక్కుతుందనీ, రాబందులకు కళేబరాలు, పందులకు చెత్త కనిపించాయని యోగి వ్యాఖ్యానించి కసితీర్చుకున్నారు. కుంభమేళాలో మునకలు వేయనందుకు రాహుల్‌గాంధీని, ఉద్ధవ్‌ఠాక్రేను హిందూ ఓటర్లు ముంచేయాలని కోరుతున్నారు కేంద్రమంత్రి రాందాస్‌ అఠవలే. ఈ వాదోపవాదాలను అటుంచితే, ప్రధాని వ్యాఖ్యానించినట్టుగా ఇంతటి మహాజాతరలను నిర్వహించడం అంత సులభం కాదు. లెక్కకు చిక్కనంతమంది ప్రవాహంలాగా వచ్చిపడుతున్నందున ఏర్పాట్లు ఎంత ఘనంగా ఉన్నప్పటికీ, తప్పటడుగులు పడ్డాయి, తప్పిదాలూ జరిగాయి. నిజానికి, ప్రజలు అసౌకర్యాలకు సిద్ధపడే పుణ్యస్నానాలకు తరలివచ్చారు. లేమి గురించి బాధపడకుండా ఉన్నదానికే సంతృప్తిపడ్డారు. ఈ మారు పుణ్యాన్నీ వ్యాపారాన్నీ కలగలిపి మాధ్యమాల్లో సాగించిన విపరీత ప్రచారం కోట్లాదిమందిని ప్రయాగ్‌రాజ్‌కు మళ్ళించిందన్న విమర్శలను అటుంచితే, మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఈ మహాకార్యంలో మరిచిపోలేని విషాదం. మృతులు, బాధితుల లెక్కలు రోజంతా విప్పకుండా దాచిపెట్టినందువల్ల, ఆ తరువాత చెప్పిన అధికారిక లెక్కలకు కూడా విశ్వసనీయత లేకుండా పోయింది. వందలాదిమంది మరణించారనో, మృతదేహాలను నీళ్ళలో పడేశారనో విపక్షనేతలు వ్యాఖ్యానించేందుకు అవకాశం ఏర్పడింది. తొక్కిసలాట ఘట్టానికి మీడియాలో ప్రచారం దక్కకుండా నియంత్రించడంవల్లనే యాత్రికుల ప్రవాహం నిరవధికంగా సాగిందని కొందరు నేతలు వాదించవచ్చు.


అవసరం తీరింది కనుక, ఇప్పటికైనా ఆ నిజం అది ఎంత చేదుగా ఉన్నప్పటికీ, విప్పితేనే విశ్వసనీయత అన్నది మిగులుతుంది. ఈనెల 15న న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదం కూడా ముందుచూపు ఉన్నపక్షంలో నివారించదగిందే. ఇక, నీటి నాణ్యతకు సంబంధించిన అధ్యయనాలు, నివేదికలమీద యూపీ ముఖ్యమంత్రి నిప్పులు చెరగడం సముచితంగా లేదు. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదికని పూర్తిగా కొట్టిపారేస్తూ, స్నానానికే కాదు, తాగడానికి కూడా ఆ నీళ్ళు పనికొస్తాయని యోగి వాదించారు. ఆ నివేదికను పూర్వపక్షం చేసేందుకు అనంతరం ఆయన చాలా కష్టపడ్డారు. పర్వదినాల్లో కోట్లాదిమంది మునకలేసినప్పుడు నీరు పరిశుభ్రంగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. అది సహజమనీ, తాత్కాలికమని సర్దిచెబితే సరిపోతుంది. కానీ, విమర్శలకు జవాబుచెప్పుకోవాల్సిన ప్రతీ సందర్భంలోనూ తమను ప్రశ్నిస్తున్నవారంతా విదేశీశక్తులతో చేయి కలిపి మన మతాన్ని, సంస్కృతినీ కించపరుస్తున్నారన్నంత స్థాయిలో పాలకపక్షం వ్యాఖ్యానించడం అవసరం లేనిది.


For Telangana News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 12:57 AM