Share News

శతప్రయోగాల ‘కోట’

ABN , Publish Date - Jan 31 , 2025 | 02:12 AM

ఎడ్లబండి మీద ఉపగ్రహాన్నీ, సైకిల్‌మీద రాకెట్‌ విడిభాగాలను తీసుకుపోయిన కాలంనుంచి అంతరిక్షకేంద్రం నిర్మాణానికి అరంగేట్రం చేయడం వరకూ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ‘ఇస్రో’...

శతప్రయోగాల ‘కోట’

ఎడ్లబండి మీద ఉపగ్రహాన్నీ, సైకిల్‌మీద రాకెట్‌ విడిభాగాలను తీసుకుపోయిన కాలంనుంచి అంతరిక్షకేంద్రం నిర్మాణానికి అరంగేట్రం చేయడం వరకూ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ‘ఇస్రో’ ప్రస్థానాన్ని ఒకమారు తలచుకొని పులకించిపోయేందుకు బుధవారం నాటి వందో రాకెట్‌ ప్రయోగం ఉపకరిస్తుంది. దేశంతో పాటుగానే ఇదీ ఎదిగింది, అంతేకదా అని ఎంత సర్దిచెప్పుకుందామనుకున్నా, బడ్జెట్‌ కేటాయింపుల్లో పాలకులు ప్రదర్శించే కాఠిన్యాన్నీ, కాపీనాన్నీ కూడా తట్టుకొని నిలిచి, దక్కినదానితోనే అనేకానేక సాహసోపేతమైన ప్రయోగాలతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసిన హీరో మన ఇస్రో.


శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌లోని రెండోలాంచ్‌ప్యాడ్‌ నుండి మొన్న చేసిన సెంచరీతో ఇస్రో కీర్తిపతాకం గగనవీధుల్లో రెపరెపలాడింది. ఈ శతప్రయోగాల వేదిక శ్రీహరికోటను భారత అంతరిక్ష పరిశోధనావ్యవస్థ పితామహుడు విక్రమ్‌సారాభాయ్‌ రాకెట్‌ ప్రయోగ కేంద్రంగా ఎంచుకోవడం మీద చాలా కథనాలు ఉన్నాయి. ప్రయోగకేంద్రం భూమధ్యరేఖకు ఎంత దగ్గరగా ఉంటే అంత తక్కువ ఇంధనంతో రాకెట్‌ భూమ్యాకర్షణశక్తిని అధిగమించగలుగుతుంది. ఆ లెక్కన శ్రీహరికోట ప్రపంచంలో రెండోస్థానంలో ఉందట. రాకెట్‌ ప్రయోగకేంద్రం దేశం తూర్పుతీరంలో ఉండటం వల్ల అనేక అదనపు సాంకేతిక, భద్రతా ప్రయోజనాలు ఉన్నాయి. శ్రీహరికోట దీవిని ఎంపిక చేయడానికి ముందు, కన్యాకుమారి తీరంలో కేంద్రాన్ని నెలకొల్పే ప్రతిపాదన మీద చర్చించడానికి విక్రమ్‌సారాభాయ్‌ కొంతమంది శాస్త్రవేత్తలతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురైతో సమావేశమయ్యేందుకు వెళ్ళారట. ఆ రోజు అన్నాదురైకి ఒంట్లోబాగోలేక తన బదులు ఓ మంత్రిని వెళ్ళమన్నారట. ఆ మంత్రి ఎంతకూ రాకుండా చాలాసమయం విక్రమ్‌సారాభాయ్‌ని నిరీక్షించేట్టు చేశారు, చివరకు ఒంటిమీద ఏ మాత్రం స్పృహలేని స్థితిలో ఉన్న ఆయనను కొందరు అక్కడకు మోసుకొచ్చి కూచోబెట్టారు. మంత్రిగారి అర్థంపర్థంలేని మాటలను భరించలేకపోయిన సారాభాయ్‌ పూర్తిగా విసుగుచెంది తమిళనాడు వద్దేవద్దని అనుకున్నారట. సరిగ్గా అదే సమయంలో 26వేల ఎకరాల శ్రీహరికోటదీవిని ఇచ్చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవచూపడంతో సారాభాయ్‌ సంతోషంగా దానిని స్వీకరించారని సుప్రసిద్ధ శాస్త్రవేత్త నంబినారాయణ్‌ తన ఆత్మకథలో రాశారు. సారాభాయ్‌ ఆదేశం మేరకు ఇస్రో శాస్త్రవేత్త ఆర్‌ఎం వసగమ్‌ తమిళనాడులోనే రెండుప్రాంతాలను రాకెట్‌ ప్రయోగకేంద్రం కోసం గుర్తిస్తే, అప్పటి డీఎంకె మంత్రి అనుచిత ప్రవర్తనతో అది ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయి పులికాట్‌ సరస్సు సరసన వెలసింది. గత ఏడాది డీఎంకె మంత్రి ఒకరు కులశేఖరపట్నం లాంచ్‌ప్యాడ్‌ శంకుస్థాపన సందర్భంలో విడుదల చేసిన పత్రికాప్రకటనలో ఇస్రో రాకెట్‌ బదులు చైనా రాకెట్‌ బొమ్మ వాడటంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు విమర్శలు చేసిన సందర్భంలో, ఆరుదశాబ్దాలనాటి ఈ గతం తిరిగి తెరమీదకు వచ్చింది.


మరో రెండేళ్ళలో కులశేఖరపట్నం అంతరిక్ష ప్రయోగకేంద్రం కూడా అందుబాటులోకి రాబోతున్నందున ఇస్రో ప్రయోగ సామర్థ్యం ద్విగుళం బహుళం అవుతుంది. తొలి వంద రాకెట్‌ ప్రయోగాలకు నలభైఐదేళ్ళుపడితే మరో ఐదేళ్ళలోనే మరో వంద ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ సగర్వంగా చెబుతున్నారు. చంద్రయాన్‌ 4, చంద్రయాన్‌ 5, మార్స్‌ లాండర్‌, వీనస్‌ ఆర్బిటర్‌, పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీని మించిన కొత్తతరం వాహకనౌక గురించి ఆయన ఆలోచనలు చేస్తున్నారు. ఇదంతా ఆత్మవిశ్వాసమే తప్ప అతిశయం కాదు. నేడు అగ్రరాజ్యాల సరసన ఇలా తలెత్తుకొని నిలబడటంలో సోవియట్‌ యూనియన్‌ సహకారం విస్మరించలేనిది. ఆ తరువాత సదరు సహకారానికీ, పరిజ్ఞానం బదలాయింపుకీ అడ్డుపడుతూ అమెరికా మనను పెట్టిన కష్టాలు స్వదేశీపరిశోధనలకు ఊతమిచ్చాయి. అదిలింపులు, బెదిరింపులు, అవమానాలు అధిగమించి సొంతకాళ్ళమీద ఎదిగిన ఇస్రో గగనయానాలు, చంద్రయానాలు, సూర్యనమస్కారాలు, అంగారక అధ్యయనాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆంగ్లచిత్రాలకంటే తక్కువ ఖర్చుతో అంతరిక్షయాత్రలు చేసివస్తోంది. ఒకేమారు వంద ఉపగ్రహాలను విభిన్నమైన కక్ష్యల్లోకి వెదజల్లగలిగే సమర్థతను పెంచుకొని, ఐదువందల యాభై ఉపగ్రహాలను నింగికి చేర్చింది. విదేశీ ఉపగ్రహప్రయోగ వ్యాపారం చేస్తూ దేశానికి సంపాదించిపెడుతోంది. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించి, మళ్ళీ విడదీసిన ఇటీవలి ‘స్పేడెక్స్‌’ విన్యాసం ఇస్రో సాధించిన మరో సాంకేతిక అద్భుతం. ఇలా నిరంతరం సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ విక్రమ్‌సారాభాయ్‌, సతీష్‌ధావన్‌ ఇత్యాది మహామహుల కలలను నిజం చేస్తూ, దేశాన్ని స్పేస్‌ సూపర్‌పవర్‌గా తీర్చిదిద్దుతున్న ఇస్రోను అభినందించాలి.


పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 02:12 AM