‘బ్రహ్మ’ ప్రళయం..!
ABN , Publish Date - Jan 03 , 2025 | 04:56 AM
వీసమెత్తు ప్రమాదం లేదని చైనా దబాయిస్తోంది కానీ, టిబెట్‌లోని యార్లుంగ్ జాంగ్‌బో (బ్రహ్మపుత్ర)నదిమీద అది నిర్మించబోయే భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు మన పర్యావరణాన్ని, నీటినీ, ఇంధన అవసరాలను తీవ్రంగా...
వీసమెత్తు ప్రమాదం లేదని చైనా దబాయిస్తోంది కానీ, టిబెట్‌లోని యార్లుంగ్ జాంగ్‌బో (బ్రహ్మపుత్ర)నదిమీద అది నిర్మించబోయే భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు మన పర్యావరణాన్ని, నీటినీ, ఇంధన అవసరాలను తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయం. దిగువ పరీవాహక దేశాలైన భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌ను కూడా అమితంగా నష్టపరిచే నిర్మాణం ఇది. డ్యామ్ నిర్మాణానికి చైనా 137 బిలియన్ డాలర్లు ఖర్చుచేయబోతోంది. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే చోట ఈ ప్రాజెక్టు నిర్మిస్తారని, హిమాలయాల్లోని ఒక భారీ అగాధాన్ని చైనా ఇందుకు ఎంచుకుందని వార్తలు వస్తున్నాయి. త్రీ గోర్జెస్ డ్యామ్‌ను కూడా వెలవెలబోయేట్టు చేసే ఈ ప్రాజెక్టు సాయంతో జలప్రవాహాన్ని చైనా నియంత్రించడమే కాదు, భారీస్థాయిలో వరదనీటిని భారత భూభాగంపైకి వదిలి విధ్వంసం కూడా సృష్టించగలుగుతుందని కొందరి వాదన.
ఈ ప్రాజెక్టు భారత్–చైనా సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం చైనా నియంత్రణలోకిపోతుంది కనుక, ఎండాకాలంలో ప్రధానంగా అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి రావచ్చు. వర్షాకాలంలో పూర్తిభిన్నమైన స్థితి. బ్రహ్మపుత్రకు భారీ వరదలు వస్తాయి కనుక, ఒక్కసారిగా నీరు విడుదలైతే దిగువ ప్రాంతాలు మునిగిపోతాయి. చైనాతో గతంలో ఉన్న ఆ కాస్త సయోధ్య కూడా ఇటీవలి కాలంలో అడుగంటిపోయింది. అమెరికాతో మన ఆత్మీయత ఆలింగనాల స్థాయికి చేరిపోవడంతో, ఒక్క బుల్లెట్ కూడా పేలని సరిహద్దు కాస్తా కుమ్ములాటలకూ, ఉద్రిక్తతలకు నిలయమైంది. దశాబ్దాలుగా రెండుదేశాల సరిహద్దుల్లోనూ నెలకొని ఉన్న శాంతి నశించి, పరస్పర అపనమ్మకంతో మెలగలవలసిన దుస్థితి ఏర్పడింది. సరిహద్దుల్లో ప్రస్తుతానికి ఉభయ దేశాల బలగాలూ వెనకడుగువేసి ఉండవచ్చు. కానీ, అమెరికా పక్షాన చైనాను హద్దుల్లో ఉంచే బాధ్యత మనం నిర్వరిస్తున్నంతకాలం ఆ వేడి కొనసాగుతూనే ఉంటుంది. బ్రహ్మపుత్ర జలాలపై 2002లో తొలిసారిగా ఇరుదేశాల మధ్యా అవగాహన కుదిరింది. ఆ తరువాత మూడుసార్లు అప్పటిపరిస్థితులకు అనుగుణంగా మార్పుచేర్పులు జరిగాయి. చివరి ఒప్పందం 2023లో ముగిసిందనీ, ఆ తరువాత ఆ ఊసే లేకపోయిందని అంటారు. ప్రాజెక్టు నిర్మాణానికి మన అభిప్రాయాన్ని కూడా తీసుకొనేంత సయోధ్య రెండుదేశాల మధ్యా ఎలాగూ లేదు.
ఈ జలవిద్యుత్ ప్రాజెక్టు అరుణాచల్‌ప్రదేశ్‌కు 22కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రక్షణపరంగా మనకు పక్కలో బల్లెమే. డ్యామ్ నిర్మాణంలో భాగంగా జరిగే పర్యావరణ విధ్వంసం, భూకంపాలకు అధిక అవకాశం ఉన్న ప్రాంతంలో దీనిని నిర్మించబోవడం ఆందోళన కలిగిస్తున్న అంశాలు. నీటి సహజ ప్రవాహ వేగంలోనూ, దిశలోనూ మార్పుచేర్పులు జరగడం అత్యంత అరుదైన జీవజాలాన్ని ప్రభావితం చేస్తుంది. బ్రహ్మపుత్ర ఆధారంగా భారత్, బంగ్లాదేశ్‌లో సాగే వ్యవసాయం కూడా ప్రభావితం అవుతుంది. తాగునీటి సమస్య కూడా తలెత్తవచ్చును. అరుణాచల్ ప్రదేశ్‌లో తలపెట్టిన జలవిద్యుత్ ప్రాజెక్టులను కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుంది.
ఈ భారీప్రాజెక్టుతో దిగువ ప్రాంతాలకు ఎలాంటి సమస్యలు రానివ్వబోనని, అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తానని చైనా హామీ ఇస్తోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో కూడా మనకు నదీజలాల వివాదాలున్నాయి కానీ, నిర్దిష్టమైన ఒప్పందాలు, కార్యాచరణ విధానాలు కూడా ఉన్నందున సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కరించుకోగలిగే అవకాశాలు అధికం. కానీ, చైనాతో బ్రహ్మపుత్ర విషయంలో మనకు ఉన్నది ఐదేళ్ళకోమారు సవరించుకోగలిగే ఎంవోయూ మాత్రమే. చైనా దీనిని కాదుపొమ్మంటే మనం చేయగలిగేది కూడా ఉండదు. ఈ ప్రాజెక్టు విషయంలో చైనా వెనకడగువేసే అవకాశాలు లేవు కనుక, దానికి మనం సంసిద్ధం కావడం ఉత్తమం. అధికసంఖ్యలో టెలీమెట్రీ స్టేషన్లను నెలకొల్పుకొని బ్రహ్మపుత్ర నీటి స్థితిగతులను నిత్యం గమనించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి పరిస్థితులు మారిపోవచ్చును కనుక, ప్రస్తుతానికి ఉభయదేశాల మధ్యా ఉన్న ఆ కాస్తంత సయోధ్యను ఉపయోగించుకొని ఇప్పుడే కొన్ని అవగాహనలకు, ఒప్పందాలకు మార్గం సుగమం చేసుకోవడం ఉత్తమం. భారతదేశం మీద కత్తికట్టినట్టుగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్ తనకు ఈ చైనా ప్రాజెక్టువల్ల అధిక ప్రమాదం ఉన్నదని గ్రహించి మనతో కలిసిరావాలి.