Share News

మరో జయపతాక

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:14 AM

ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న టీమిండియా మరో చరిత్ర సృష్టించింది. గత మధురస్మృతులను మరిపిస్తూ వన్డే క్రికెట్‌లో మినీ విశ్వకప్పుగా ఖ్యాతిగాంచిన చాంపియన్స్‌ ట్రోఫీని దక్కించుకుంది. తుది సమరంలో న్యూజిలాండ్‌ను...

మరో జయపతాక

ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న టీమిండియా మరో చరిత్ర సృష్టించింది. గత మధురస్మృతులను మరిపిస్తూ వన్డే క్రికెట్‌లో మినీ విశ్వకప్పుగా ఖ్యాతిగాంచిన చాంపియన్స్‌ ట్రోఫీని దక్కించుకుంది. తుది సమరంలో న్యూజిలాండ్‌ను ఓడించి మూడో పర్యాయం చాంపియన్స్‌ ట్రోఫీని ఒడిసిపట్టుకుంది. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ను గెలిచి ఏడాది కూడా తిరగకముందే మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో విజేతగా నిలిచి భారత జట్టు అద్భుతమే చేసింది.


పాకిస్థాన్‌ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌ తటస్థ వేదిక దుబాయ్‌లో తమ మ్యాచ్‌లను ఆడింది. అపజయమన్నదే ఎరుగకుండా అజేయంగా మ్యాచ్‌లను ముగించింది. అశేష క్రీడాభిమానులు గర్వించేలా పోరాటపటిమను ప్రదర్శించింది. టోర్నమెంట్‌ ఆరంభంలో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి, డిఫెండింగ్‌ చాంపియన్‌ పాకిస్థాన్‌ను మట్టికరిపించి, ఆనక న్యూజిలాండ్‌పై ఆధిపత్యాన్ని చాటుకొన్న భారత్‌ గ్రూప్‌ దశ పోరాటాన్ని ఓటమన్నదే లేకుండా ముగించింది. తమకు ఎదురే లేదనుకున్న ఆస్ట్రేలియన్లను సెమీఫైనల్లో కంగుతినిపించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. అదే జోరులో న్యూజిలాండ్‌పై మరోసారి పైచేయి సాధించి అంతిమంగా ఫలితాన్ని రాబట్టింది. ఈ గెలుపుతో కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌కు తొలి ఐసీసీ ట్రోఫీని అందించింది. చివరిగా 2013లో ధోనీ సారథ్యంలో టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టు.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆ మధురఘట్టాన్ని ఆవిష్కృతం చేసింది. ఫార్మాట్‌ ఏదైనా ఐసీసీ టోర్నీల్లో చాంపియన్‌గా నిలవడమన్నది ఎప్పుడూ ప్రత్యేకమే.


ఈమారు టోర్నమెంట్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శనతో అలరిస్తే, ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్‌ ఆట పరంగా పూర్తిగా విఫలమైంది. టోర్నీలో ఒక్క గెలుపును కూడా నమోదు చేయకుండా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్స్‌లో వెనుదిరిగాయి. కొన్నాళ్లుగా ప్రపంచ క్రికెట్‌లో సంచలన ఆటతీరుతో అలరిస్తున్న అఫ్ఘానిస్థాన్‌ జట్టు సెమీఫైనల్‌కు చేరకున్నా, ఇంగ్లండ్‌లాంటి మేటిజట్టును ఓడించి మరోసారి తమ సత్తాను చాటుకోవడం ఈ టోర్నీలో విశేషం.

సమర్ధమైన నాయకుడు లభించడం జట్టుకు ఎప్పుడూ వరమే. తొలుత వన్డే విశ్వకప్‌, తదుపరి టీ20 ప్రపంచకప్‌, ఇప్పుడు చాంపియన్స్‌ ట్రోఫీ.. ఇలా వరుసగా మూడు మెగా టోర్నమెంట్లలో జట్టును ఫైనల్‌ చేర్చడం.. రెండింటిలో విజయకేతనం ఎగురవేయడం.. రోహిత్‌ శర్మ అమోఘమైన కెప్టెన్సీ ప్రతిభకు తార్కాణం. వ్యూహాల అమలులో మిగతా జట్ల నాయకులకు అందనంత దూరంలో ఉండే అతను, సారథిగా నాటి మహేంద్రసింగ్‌ ధోనీని మరిపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రత్యర్థి జట్ల లోపాలు, బలహీనతల ఆధారంగా తన వ్యూహరచనకు పదును పెడుతుంటాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌, బౌలింగ్‌ దళంలో ఎవరి పాత్ర ఏమిటన్నదానిపై స్పష్టతతో ఉంటూ సహచరులకు దిశానిర్దేశం చేస్తుంటాడు. మైదానంలో ఒత్తిడిని దరిచేరనీయకుండా కడదాకా విజయానికి ప్రయత్నించడం రోహిత్‌ నైజం. వ్యక్తిగత గణాంకాలు పట్టించుకోకుండా జట్టును అగ్రపీఠాన నిలిపే లక్ష్యంతో ఆడతాడు.


ఈ చాంపియన్స్‌ ట్రోఫీలో కొన్ని మ్యాచుల్లో ఆటగాడిగా అంతగా రాణించకపోయినా, న్యూజిలాండ్‌తో అంతిమ సమరంలో అసలైన ఆటతీరుతో విజృంభించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్‌, బలమైన ఆరంభాన్ని అందించి తన తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించాడు. రోహిత్‌తో పాటు పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా చక్కని బ్యాటింగ్‌తో జట్టు విజయంలో తమ కర్తవ్యాన్ని చాటుకున్నారు. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా లోటును భర్తీ చేస్తూ భారత బౌలింగ్‌ దళం టోర్నీలో దీటైన ప్రదర్శనతో మెప్పించింది. ప్రధానంగా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ జట్టుకు అండగా నిలిచిన తీరు ప్రశంసనీయం. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించి ఆల్‌రౌండర్లుగా భళా అనిపించారు. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన ఆటతీరుతో కలిసికట్టుగా కదం తొక్కడం భారత్‌ విజేతగా ఆవిర్భవించడానికి విశేషంగా దోహదపడింది. ఇంతటి మహత్తర ప్రదర్శన భారత జట్టులోని యువ ఆటగాళ్లలో నూతనోత్తేజాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే నవతరం ఆటగాళ్లు మున్ముందు ప్రతిష్ఠాత్మక సిరీస్‌లకు సన్నద్ధం కావాలి.

ఈ వార్తలు కూడా చదవండి:

IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు.. నిర్ఘాంతపోయిన అధికారులు..

AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..

Updated Date - Mar 11 , 2025 | 12:14 AM