Development : అభివృద్ధిబాటలో వడివడిగా...!
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:34 AM
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అరవై నెలల చీకటి పాలన నుంచి విముక్తి పొంది కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని ఇచ్చారు. కూటమి నేతలపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ప్రజల ఆశయాలకు తగ్గట్టుగా ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అరవై నెలల చీకటి పాలన నుంచి విముక్తి పొంది కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని ఇచ్చారు. కూటమి నేతలపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ప్రజల ఆశయాలకు తగ్గట్టుగా ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు, మరోవైపు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఒడుపుగా నిధులు సాధించుకోవడంలో సఫలీకృతం అవుతోంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన అమరావతి, పోలవరం పనులు తిరిగి మొదలవ్వడం శుభ పరిణామం. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు, పోలవరం తొలి దశ పనులకు రూ.12,157కోట్లు దక్కడంతో కూటమి ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. రాజధాని అమరావతిలో రూ.11,467.27 కోట్ల వ్యయంతో పనులు మొదలైనాయి. ఎప్పుడో ఏడేళ్ల క్రితం పోలవరం నిర్వాసితులకు అప్పటి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ, ఇతర నిధులు చెల్లించింది. జగన్ రెడ్డి హయాంలో ఆ ఊసే లేదు. తాజాగా వివిధ కేటగిరీల కింద రూ.996.47 కోట్లను పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందజేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించబోమని, గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు – 1980 ప్రకారం జలాశయ పూర్తి స్థాయి మట్టాన్ని 45.72 మీటర్ల మేర నిలిపేలా నిర్మాణాన్ని చేపడుతున్నామని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో వైసీపీ నాయకుల నోళ్లు మూతబడ్డాయి.
ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక, ఇంధన రంగాల్లో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 2,63,411 మందికి ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని యువత నైపుణ్యాలను వెలికి తీసి వారే స్వయంగా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలోని రోడ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రూ.860.81 కోట్ల ఖర్చుతో 19,911 కి.మీ. మేర రోడ్ల గోతులు పూడ్చివేత కార్యక్రమాలు చేపట్టింది.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ల్యాండ్ టైట్లింగ్ ఏక్ట్‌ను రద్దు చేయడమే కాకుండా ప్రజల భూ రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ చట్టం -2024ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. తొలి సంతకం డీఎస్సీ ఫైలుపై పెట్టడమే కాకుండా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో పేదలకు ఐదు రూపాయలకే కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మూయించేయడం అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఇప్పుడు తిరిగి 198 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల ఆకలి తీర్చడమే కాకుండా మరికొన్ని కొత్తవి కూడా ప్రారంభించే దిశగా ఆలోచిస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పేదలకు పెంచిన ఫించన్లను నెల మొదటి రోజునే లబ్ధిదారుల ఇంటి వద్దే ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నది. రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఇప్పటికే 4,15,066 రైతుల నుండి సేకరించిన 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను రూ.6,083.69కోట్లు ఖాతాల్లో వేసి రైతుల కళ్ళల్లో వెలుగులు నిండేలా చేసింది.
చేనేత రంగం రోజురోజుకూ కునారిల్లుతున్న దశలో మేమున్నామంటూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చేనేత కార్మికులకు అవసరమైన పరికరాలు అందచేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 32 క్లస్టర్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే రాష్ట్రానికి కొత్తగా ప్రకటించిన 10 చేనేత క్లస్టర్లను వినియోగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదేవిధంగా గంజాయి సాగు, రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఒకవైపు ఇలా అభివృద్ధి, సంక్షేమంపై సమదృష్టి పెట్టిన ప్రభుత్వం మరోవైపు గత ప్రభుత్వ తాలూకు మలినాలను తొలగించే విధంగా వ్యవస్థల ప్రక్షాళనపై దృష్టి సారించింది. అవినీతి, అక్రమార్కులను చట్టబద్ధంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టి వారికి కఠిన శిక్షలు పడేలా చేస్తోంది.
వైసీపీ హయాంలో పాఠశాల విద్యలో అల్లకల్లోలం సృష్టించిన జీఓ- 117ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ లాంటి వాటిని అమలు చేసేందుకు తీసుకొచ్చిన ఈ జీఓతో పాఠశాల విద్య సర్వనాశనమైంది. అందుకే ప్రస్తుతం ఉన్న ఆరు రకాల బడుల స్థానంలో నాలుగు రకాల పాఠశాల వ్యవస్థను వచ్చే విద్యాసంవత్సరం నుండి అమలయ్యేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మత్స్యకారులకు ఉరితాడుగా నిలిచిన జీవో 217ను రద్దు చేసింది. మత్స్యకారుల వేట నిషేధ భృతిని రెట్టింపు చేస్తూ రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అర్చకుల వేతనాన్ని రూ.15 వేలకు పెంచింది. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. దేవాలయాల్లో నాయీబ్రాహ్మణులకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు వేతనాన్ని పెంచింది.
ప్రజలకు మంచి చేయాలనే తపన, చిత్తశుద్ధి కలిగిన నాయకులు అధికారంలో ఉంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధించగలదో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తున్నది. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో కూటమి ప్రభుత్వం అద్భుతమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. అధినాయకుల ఆలోచనలకు, నిర్ణయాలకు, లక్ష్యానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తే 2029 నాటికి ఏపీ దేశంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రజలకు మంచి చేయాలనే తపన, చిత్తశుద్ధి కలిగిన నాయకులు అధికారంలో ఉంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధించగలదో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోంది.
కూసంపూడి శ్రీనివాస్
(జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి)