మొరటు దౌత్యం
ABN , Publish Date - Mar 04 , 2025 | 02:55 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరు అదుపులో పెట్టుకొనే వ్యక్తి కాదు కనుక, అదే లక్షణం ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జరిగిన భేటీ చివరకు అలా ముగిసింది. బలమైన శత్రువుతో...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరు అదుపులో పెట్టుకొనే వ్యక్తి కాదు కనుక, అదే లక్షణం ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జరిగిన భేటీ చివరకు అలా ముగిసింది. బలమైన శత్రువుతో పోరాడుతున్న ఒక చిన్న దేశాధ్యక్షుడు, యుద్ధం మధ్యలో ఉంటూ, మూడేళ్ళుగా తనకు అందుతున్న సాయం ప్రమాదంలో పడిన స్థితిలో కూడా ఇంతటి గుండెధైర్యంతో అమెరికా అధ్యక్షుడిని ఎదిరించడం అందరికీ నచ్చింది. నీ విలువైన వనరులన్నీ ఇస్తే తప్ప నా సాయం కొనసాగదని బ్లాక్‌మెయిల్ చేసిన అమెరికా అధ్యక్షుడు ఆ పనేదో చూసుకోకుండా, తనను తప్పుబడుతూ, తన ప్రత్యర్థిని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఉక్రోషం ఆగలేదు. తనను తన దేశాన్ని అవమానిస్తున్నవారి ఎదుట తలవంచుకొని ఉండాల్సిన అవసరం లేదనుకున్నాడేమో ఆయన. మూడేళ్ళుగా అండగా ఉంటూ వచ్చిన అమెరికా అర్ధంతరంగా ఆయుధసాయం నిలిపివేస్తే, బలమైన శత్రువు చేతుల్లో మరింత నలిగిపోవాల్సివస్తుందని జెలెన్‌స్కీకి తెలుసు. దీనితో పాటే, అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు కట్టకట్టుకొని ఇలా ఎందుకు విరుచుకుపడుతున్నారో, హితవు ముసుగులో ఎందుకు తనను విలన్ చేస్తున్నారో కూడా ఆయనకు తెలుసు. ఐదువందల బిలియన్ డాలర్ల ఆస్తులు అప్పగిస్తూ కూడా కుట్రలు సహించాల్సిన, శత్రు సంకీర్తనలను భరించాల్సిన అవసరం లేదనుకున్నాడు ఆయన.
ఒక దేశాధ్యక్షుడిని పిలిచి మరీ ఇలా అవమానించడంతో అమెరికా పరువు దిగజారిందని అక్కడి మీడియా వ్యాఖ్యానిస్తోంది. గతనెలలో జెలెన్‌స్కీని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నవారికి ఇప్పటి వాగ్వాదం ఒక కొనసాగింపుగా కనిపించవచ్చు. జెలెన్‌స్కీని నియంతగా, యుద్ధానికి ఆద్యుడిగా, దేశాన్ని ముంచేసిన దుందుడుకు నాయకుడిగా ట్రంప్ ఆదిలోనే జెలెన్‌స్కీని అభివర్ణించారు. పూర్తిగా పుతిన్ పరిభాషలోనే ఆ విమర్శలు సాగాయి. తద్వారా ఉక్రెయిన్‌లోని అరుదైన, విలువైన వనరులను అమెరికన్ కంపెనీలకు అప్పగించే ఒప్పందానికి ఆయన జెలెన్‌స్కీ మెడలు వంచి, అమెరికా ఆయుధసాయానికి ప్రతిఫలంగా అనేకరెట్లు దోచుకొనే అవకాశం ఏర్పడింది. ట్రంప్ చేసిన ఒక వ్యాఖ్యను అందిపుచ్చుకొని, రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం తన దేశంలోనూ విలువైన ఖనిజాలను తవ్వుకోవచ్చుననీ, ఉక్రెయిన్ నుంచి తాను ఆక్రమించుకున్న భూభాగాలను కూడా అందుకు ఇస్తానని ఓ చవుక బేరాన్ని ప్రతిపాదించారు. ఇది జెలెన్‌స్కీమీద మరింత ఒత్తిడిపెంచింది. ఉక్రెయిన్ కులీనులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కేవలం వనరుల దోపిడీతప్ప, భవిష్యత్ భద్రత, సహకారంమీద అమెరికా నుంచి ఏ హామీ లేని ఈ ఒప్పందాన్ని జెలెన్‌స్కీ బలవంతంగా అంగీకరించాల్సివచ్చిందని అందరికీ తెలుసు. నాటో సభ్యత్వానికి తావేలేదనడం, భద్రత ఊసెత్తకపోవడంతో పాటు, మాటకు కట్టుబడని తన ప్రత్యర్థిని వెనకేసుకురావడంతో పాటు, నీ దేశం సర్వనాశనమైందనీ, నీ సైన్యం పారిపోతోందని తననూ ఉక్రెయిన్‌నూ అవమానించడం ఆయన సహించలేకపోయారు.
టెలివిజన్ స్క్రీన్‌మీద ఈ ఘట్టాన్ని చూసిన సామాన్యులకు జెలెన్‌స్కీ తెగనచ్చేశాడు. ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య ఈ తరహా ఘర్షణ చోటుచేసుకోవడం, అది ప్రత్యక్షంగా చూడగలగటం, అందునా అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓ నాయకుడు ఘాటుగా మాట్లాడటం వారికి ఆశ్చర్యం కలిగించింది. తన చర్యలూ చేష్టలతో ప్రపంచాన్ని భయపెడుతున్న ఓ నాయకుడు కెమెరాల సాక్షిగా ఆత్మరక్షణలో పడటం వారికి నచ్చింది. దేశాధ్యక్షులు ఎంతో ఉన్నతంగా, గంభీరంగా, పరస్పరగౌరవంతో మాట్లాడుకుంటారనే భ్రమలను ఈ ఘట్టం పటాపంచలు చేసింది. వినయంగా తలూపకుండా మా దేశానికి వచ్చి మమ్మల్నే అవమానిస్తావా అన్న రీతిలో అధ్యక్ష, ఉపాధ్యక్షులు రగిలిపోయారనడానికి అనంతర పరిణామాలే సాక్ష్యం. అందరినీ చూడనివ్వండి అంటూనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశాధినేత ఎదుటివ్యక్తిని నోరువిప్పనివ్వకుండా ఎంత అవమానకరంగా మాట్లాడారో ప్రపంచం చూసింది. మధ్యవర్తిగా ఉంటానని చెప్పిన పెద్దమనిషి పూర్తిగా ఒకవైపు మొగ్గడం మరోమారు గమనించింది. ఆప్తులను సైతం అర్థంతరంగా వదిలేసే అమెరికాతో అంటకాగేవారికి ఈ ఘట్టం మరో గుణపాఠం.