Bangladesh Violence Attacks On Hindus: బంగ్లా బడబాగ్ని
ABN , Publish Date - Dec 24 , 2025 | 02:07 AM
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఢిల్లీ, కోల్‌కతాల్లో మంగళవారం భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు...
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఢిల్లీ, కోల్‌కతాల్లో మంగళవారం భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు వందలాది నిరసనకారులు తమ ఆగ్రహాన్ని ప్రకటిస్తూ, ప్రతీ హిందూ రక్తపుబొట్టునూ లెక్కిస్తామని నినదించారు. కోల్‌కతాలో బీజేపీ అగ్రనాయకుడు సువేందు అధికారి సారథ్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పరివార్ సంఘాల కార్యకర్తలు బంగ్లా దౌత్యకార్యాలయంవైపు వెళ్ళకుండా నిరోధించడానికి పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది. విజ్ఞాపనపత్రం సమర్పించిపోతామని హామీ ఇచ్చినా పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని బీజేపీ నాయకుల ఆరోపణ. మూకదాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చంద్రదాస్ కుటుంబానికి ప్రతీ నెలా ఆర్థికసాయం అందచేయబోతున్నట్టు కూడా సువేందు అధికారి ప్రకటించారు. ఎన్నికలు ముగిసేవరకూ బంగ్లాదేశ్‌లో హింస తగ్గదని అక్కడి విశ్లేషకులు అంటుంటే, ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమబెంగాల్‌నూ సరిహద్దు ఆవలి పరిణామాలు ప్రభావితం చేయడం సహజం.
బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయిందని, ఇక శస్త్రచికిత్స చేయాల్సిందేనని అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ అంటున్నారు. జాతీయ మీడియాతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో అంతరార్థం పొరుగుదేశంవారికి అర్థంకాకపోదు. భారత్ వ్యతిరేకతమీదే ఆధారపడిన బంగ్లాదేశ్ రాజకీయజీవులకు ఇక్కడి మాటలు, చర్యలు ఆక్సిజన్‌లాగా ఉపకరిస్తాయి. మరో రెండునెలల్లో ఎన్నికలు జరగబోతున్న ఆ దేశంలో పరిస్థితులు అతివేగంగా దిగజారిపోతున్నాయి. హసీనా వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో ఇటీవల రేగిన హింస పలురీతులుగా విస్తరించింది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హిందూ యువకుడు దీపు చంద్రదాస్‌ను హత్యచేసి, తగలబెట్టేశారు. భారత్‌కు భజన చేస్తున్నాయనీ, హసీనా అనుకూల సంస్థలన్న ఆరోపణతో కొన్ని పత్రికలమీద దాడులు జరిగాయి. ప్రతీ క్షణం ప్రాణభయంతో, ఆత్మరక్షణలో బతుకుతున్నామని మీడియా ప్రముఖులు వాపోతున్నారు. చంద్రదాస్ మతదూషణకు పాల్పడ్డాడన్న వాదనలో వీసమెత్తు నిజం లేదని నిర్థారణ అయిపోయింది. అతడిని రక్షించే ప్రయత్నం చేయకుండా ఫ్యాక్టరీ బయటకు తోసివేసి భక్షకులకు అప్పగించడం వంటి పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి.
షేక్ హసీనా అత్యంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా దేశాన్ని ఏలినమాట నిజం. ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రభుత్వాన్ని కూల్చి, చివరకు ఆమె దేశం విడిచిపోయేవరకూ జూలై తిరుగుబాటుదారులు విశ్రమించలేదు. విదేశాల్లో ఉన్న యూనిస్‌ను తాత్కాలిక అధినేతగా తెచ్చిపెట్టుకున్న ఈ విద్యార్థిలోకం దేశాన్ని చక్కగా గాడినపెట్టుకొని, ప్రజాస్వామికంగా తీర్చిదిద్దుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, షేక్ ముజ్‌బూర్ రహ్మాన్ మూలాలను చెరిపివేయడం మీద ఉన్న శ్రద్ధ పరిస్థితులను చక్కదిద్దుకోవడం మీద లేకపోయింది. అవామీలీగ్‌ను ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించడంతోపాటు, ప్రత్యేకకోర్టు తీర్పుతో హసీనాను తిరిగి దేశంలోకి అడుగుపెట్టనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. మరోపక్క ఆమె ప్రత్యర్థి ఖలేదాజియాను స్వదేశానికి రప్పించి, రాబోయే ఎన్నికల్లో ఆమె పార్టీ విజయానికి ద్వారాలు తెరిచారు. జమాతే ఇస్లామీ సహా వివిధ మతసంస్థలమీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి, జైళ్ళలో ఉన్న ఆయా శక్తులను యూనిస్ ప్రభుత్వం వీధుల్లోకి వదిలేసిన ఫలితమే ప్రస్తుత అగ్గి. భారత్ వ్యతిరేకత ఆధారంగా ఎన్నికల్లో ఎక్కువస్థానాలు నెగ్గాలని కొన్ని పక్షాలు ప్రయత్నిస్తుంటే, మతవిద్వేషాలు రేపి పైచేయి సాధించాలని ఇస్లామిక్ శక్తులు చూస్తున్నాయి. పొరుగుదేశంలో అతివేగంగా మారుతున్న పరిణామాలకు జమాతే వంటి ఇస్లామిక్ సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం. యాభైమూడుశాతం ఓటర్లు వీటిపక్షాన ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆరునూరైనా ఫిబ్రవరి 12నే ఎన్నికలు నిర్వహిస్తామని యూనిస్ గట్టిగా చెబుతున్నారు. అనుకున్నట్టు జరుగుతాయా లేదా అన్నకంటే అప్పటివరకూ దేశం ఎంత హింస చవిచూడాల్సి వస్తుందన్నది ప్రశ్న. పొరుగుదేశం పరిణామాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. హసీనాకోసం ఆ దేశాన్నే వదులుకున్నామన్న విమర్శలను అటుంచితే, అక్కడి ప్రమాదకర పరిణామాలపై అదుపులేని వ్యాఖ్యలు చేయడం, వారిని అవమానించేట్టుగా, రెచ్చగొట్టేట్టుగా మాట్లాడటం మనకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.
ఇవి కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ విధానం మేరకు తక్షణ చర్యలు..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
Read Latest AP News And Telugu News