Share News

పరీక్షా ఫలితాలే జీవిత విజయమా?

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:15 AM

పరీక్షల సీజన్లలో దేశంలో ప్రతి ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా

పరీక్షా ఫలితాలే జీవిత విజయమా?

పరీక్షల సీజన్లలో దేశంలో ప్రతి ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2022లో మొత్తం 1,70,924 ఆత్మహత్యలు నమోదు కాగా, వాటిలో 7.6 శాతం ఆత్మహత్యలు విద్యార్థులవి. వీటిలో పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్న భయంతో చేసుకున్న ఆత్మహత్యలు 2,248. ఈ ఆందోళనకరమైన ధోరణి భారతీయ సమాజాన్ని ఆవరించిన విద్యా ఒత్తిడిని నొక్కి చెబుతుంది.

పెరుగుతున్న పరీక్షా ఒత్తిడి సంక్షోభానికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం 2018లో ‘పరీక్షా పే చర్చ’ (పీపీసీ)ను ప్రారంభించింది. ప్రతి సంవత్సరం జనవరి / ఫిబ్రవరి నెలల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపిక చేయబడ్డ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి, ఎంపిక చేయబడ్డ ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానాలిస్తూ ప్రసంగిస్తారు. పరీక్షలకు సంబంధించిన ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో సలహాలు అందిస్తారు. ఈ సంవత్సరం దాని ఎనిమిదవ ఎడిషన్ కార్యక్రమం ఇటీవలే ముగిసింది. పీపీసీ లక్ష్యం ప్రశంసనీయమైనప్పటికీ, దాని ప్రభావం, ప్రాధాన్యత ప్రశ్నార్థకంగానే ఉన్నాయి.

పీపీసీపై ఉన్న ప్రాథమిక విమర్శలలో ఒకటి దాని వనరుల కేటాయింపు. 2022 నుంచి 2024 వరకు మూడేళ్ళకు ఈ కార్యక్రమానికి రూ.62 కోట్ల ఖర్చు అయింది. 2022, 2023 సంవత్సరాలలో ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకొని ఆన్‌లైన్‌లో వీక్షించిన వారికి ప్రశంసాపత్రాలను పంపించారు. దీనికోసం నేషనల్ బుక్ ట్రస్ట్ రూ.28 కోట్లు ఖర్చు చేసింది. ఒక కేంద్రీయ విద్యాలయాన్నీ, ఒక నవోదయ విద్యాలయాన్నీ ఒక ఏడాది పాటు నిర్వహించడానికి అయ్యే ఖర్చు కంటే ఒక పీపీసీ కోసం ఒక ఏడాది పెట్టే ఖర్చు ఎక్కువ. మరొక వైపు నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ద్వారా పదవ తరగతి పిల్లలకు పీహెచ్‌డీ చదువు వరకు ఇవ్వబడే స్కాలర్‌షిప్ పథకాన్ని రద్దు చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిభ కలిగిన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకం 1963 నుండి కొనసాగుతున్నది. సంవత్సరానికి సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు అవుతాయి. ఒకపక్క ఇటువంటి ప్రభావవంతమైన కార్యక్రమాలకు బడ్జెట్లు రద్దు చేస్తూ, పీపీసీ లాంటి కార్యక్రమాలను మాత్రం నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.


ప్రేరణాత్మక ప్రసంగాలు, పరీక్షల ఒత్తిడి నిర్వహణ చిట్కాలు తాత్కాలిక ఉపశమనాన్ని అందించవచ్చు. కానీ అవి పరీక్షల ఒత్తిడికి ఉండే మూల కారణాలను పరిష్కరించవు. నిజానికి ఇలాంటి ప్రసంగాలు, నిర్వహణ చిట్కాలను టీచర్లు చాలా ప్రొఫెషనల్‌గా నిత్యం అందిస్తూనే ఉంటారు. వాటికంటే ముఖ్యంగా, ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడానికి, విధాన నిర్ణేతలు ఈ క్రింది అంశాలపై దృష్టి పెట్టాలి:

1) పరీక్షా ఫలితాలే జీవిత విజయం అనే ఇరుకైన నిర్వచనాన్ని సవాలు చేయాలి. వృత్తి శిక్షణ, కళలు, క్రీడలు వంటి ప్రత్యామ్నాయ కెరీర్ మార్గాలు సమానంగా చెల్లుబాటు అయ్యే విధానాలను పెంపొందించాలి, వాటి ఎంపికలను ప్రోత్సహించాలి. 2. అధిక పోటీతో ఉండే పరీక్షలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించాలి. తుది పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి ఏడాది పొడవునా విద్యార్థుల పురోగతిని అంచనా వేసే నిరంతర, సమగ్ర మూల్యాంకన (CCE) పద్ధతులను అమలు చేయాలి. లాభాపేక్షతో నడిచే కోచింగ్ సెంటర్లను చైనా నిషేధించింది. హోంవర్క్‌పై పరిమితులను విధించింది. మనం ఈ చర్యలను చేపట్టలేకపోతున్నాము, ‘ఒకే దేశం--–ఒకే పరీక్ష’ విధానాలను తెస్తూ ఇంకా ఒత్తిడి పెరిగేటట్లు చేస్తున్నాము. 3. శిక్షణ పొందిన కౌన్సిలర్లు, మనస్తత్వవేత్తల సేవల ద్వారా పాఠశాలలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగ శ్రేయస్సుపై అవగాహన కార్యక్రమాలను పాఠ్యాంశాల్లో విలీనం చేయాలి. 4.విద్యార్థుల విద్యా అనుభవాలను రూపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థి -కేంద్రీకృత అభ్యాసంపై మొక్కుబడి శిక్షణలు గాక సరైన శిక్షణ అందించడం వలన మరింత ఆకర్షణీయమైన తరగతి గది వాతావరణం ఏర్పడుతుంది. 5.మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఉపాధ్యాయ–-విద్యార్థి నిష్పత్తులను తగ్గించడానికి, వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించడానికి ప్రభుత్వం తగినంత నిధులను కేటాయించాలి. ప్రజా సంబంధాలను పెంచుకునే పనిలో భాగంగా పెద్దగా ప్రభావాన్ని కలిగించని కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తూ, ముఖ్యమైన కార్యక్రమాలకు బడ్జెట్‌ తగ్గిస్తున్నారు. ఇది ప్రతికూల ఫలితాన్నిస్తుంది.


పరీక్షల ఒత్తిడి కారణంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య వ్యవస్థాగత సంస్కరణల తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది. ‘పరీక్ష పే చర్చ’ వంటి కార్యక్రమాలు ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం పరిమితం. సామాజిక విలువలను పునర్నిర్వచించడం, మూల్యాంకన పద్ధతులను సంస్కరించడం, ఉపాధ్యాయ శిక్షణలో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే నిజమైన పరిష్కారాలు సాధ్యం.

‘పరీక్ష పే చర్చ’ వంటి కార్యక్రమాలు విద్యార్థి ఆత్మహత్యల సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం పరిమితంగా ఉంది. సామాజిక విలువలను పునర్నిర్వచించడం, మూల్యాంకన పద్ధతులను సంస్కరించడం, ఉపాధ్యాయ శిక్షణలో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే నిజమైన పరిష్కారాలు సాధ్యం.

ఎడమ శ్రీనివాస రెడ్డి

అధ్యాపకులు

Updated Date - Feb 15 , 2025 | 05:15 AM