Share News

CM Revanth Reddy : దళిత, బహుజన బంధువు రేవంత్

ABN , Publish Date - Feb 08 , 2025 | 06:20 AM

స్వతంత్ర భారతదేశంలో ఏ పాలకుడు చేయని సాహసం సీఎం రేవంత్‌రెడ్డి చేశారు. బ్రిటిష్‌ పాలనలో 1931లో చేసిన కుల గణన తర్వాత, 2025 వరకు మళ్లీ కులగణన జరగలేదు. ఒక రకంగా ఆలోచిస్తే ఆశ్చర్యం... అణగారిన వర్గాలు కోల్పోయిన హక్కుల పరంగా ఆలోచిస్తే పంటి బిగువున దాచిన సత్యాగ్రహం.

CM Revanth Reddy : దళిత, బహుజన బంధువు రేవంత్

స్వతంత్ర భారతదేశంలో ఏ పాలకుడు చేయని సాహసం సీఎం రేవంత్‌రెడ్డి చేశారు. బ్రిటిష్‌ పాలనలో 1931లో చేసిన కుల గణన తర్వాత, 2025 వరకు మళ్లీ కులగణన జరగలేదు. ఒక రకంగా ఆలోచిస్తే ఆశ్చర్యం... అణగారిన వర్గాలు కోల్పోయిన హక్కుల పరంగా ఆలోచిస్తే పంటి బిగువున దాచిన సత్యాగ్రహం.

కులగణనను రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చేసింది. మొదటగా 2024 నవంబర్ 6 నుంచి 8 వరకు తెలంగాణలోని ప్రతి ఇంటికీ స్టిక్కరింగ్ చేసింది. నవంబర్ 9న ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే గవర్నర్‌ ప్రారంభించారు. సర్వే పూర్తికి 50 రోజులు పట్టింది. 1,15,71,457 కుటుంబాలను లిస్ట్ చేస్తే, 1,12,15,134 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి, 3,56,323 కుటుంబాలు సర్వేకు దూరంగా ఉన్నాయి. జనాభా ప్రకారం సర్వేలో పాల్గొన్నవారు 3,54,77,554 మంది ఉంటే.. బీసీలు 1,64,09,179 (46.25 శాతం), ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనార్టీ బీసీలు 35,76,588 (10.08 శాతం), ముస్లిం మైనార్టీ ఓసీలు 8,80,424 (2.48 శాతం), ఓసీలు 47,21,115 (13.31 శాతం). ఇందులో బీసీలు, బీసీ మైనార్టీలు కేటగిరీల వారీగా A నుంచి E వరకు కలిసి 1,99,85,767 (56.33 శాతం) మంది ఉన్నారు. ఇక ఓసీలు, మైనార్టీ ఓసీలు కలిసి 56,01,539 (15.79 శాతం) మంది. ఒకసారి 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కూడా పరిశీలిస్తే.. బీసీలు 1,85,61,856 (51 శాతం) మంది, ఎస్సీలు 63,60,158 (18 శాతం) మంది, ఎస్టీలు 36,02,888 (10 శాతం) మంది, ఓసీలు 78,12,858 (21 శాతం) మంది ఉన్నారు. దీన్నిబట్టి, 2014లో ఓసీ జనాభాను పెంచి బీసీ జనాభాను కేసీఆర్ సర్కార్ తగ్గించే ప్రయత్నం చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్‌రెడ్డి పాలనలో పారదర్శకంగా కులగణన చేస్తే, గతంలో పెద్దపెద్ద మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసినవాళ్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం సిగ్గుచేటు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆశయంతో బీసీ కమిషన్, బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు వంటి పనులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనం.


ఇక, ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటిది కాదు. మూడు దశాబ్దాల పోరాటం. అనేక మంది దళితులు తమ హక్కుల కోసం అసువులుబాసిన సందర్భం. అందుకే న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు రేవంత్ సర్కార్ అనేక చర్యలు తీసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులతో కలిపి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఎస్సీ ఉపకులాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు పంజాబ్, హర్యానా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పర్యటించింది. అనేక సమావేశాల తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో భాగంగా జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్‌తో ఏక సభ్య కమిషన్ 2024 అక్టోబర్ 11న ఏర్పాటైంది. ఈ కమిషన్ రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించింది. మొత్తం 8,681 విజ్ఞప్తులు అందాయి. అన్నింటినీ కూలంకషంగా పరిశీలించి ఎస్సీలలోని 59 కులాలకు న్యాయం జరిగే విధంగా కమిషన్ గ్రూప్ 1, 2, 3 కేటగిరీలుగా విభజించి అనేక అంశాలను పొందుపరిచి సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. గ్రూప్–1 కింద సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చింది. ఎస్సీల్లో వీరు 3.288 శాతం, వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసింది. గ్రూప్–2లో మధ్యస్థంగా రిజర్వేషన్ల ఫలాలు పొందిన 18 కులాల్లోని 62.74 శాతం మందికి 9 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, గ్రూప్ 3లో రిజర్వేషన్ల ప్రయోజనం పొందిన 26 కులాలకు చెందిన 33.96 శాతం మందికి 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొంది. ఈ మూడు గ్రూపుల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులు లేకపోతే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కమిషన్ సూచించిన నాలుగు సిఫార్సుల్లో మూడింటికి పచ్చజెండా ఊపిన రేవంత్ సర్కార్.. క్రీమీలేయర్ విధానాన్ని అమలుచేయాలన్న సిఫార్సులను తిరస్కరించింది. మూడు దశాబ్దాలకు పైగా సాగిన పోరాటం.. తమ జాతి హక్కుల కోసం ఉద్యమించి, జీవితాలను పణంగా పెట్టిన త్యాగధనులకు సముచిత న్యాయం జరిగింది. అంతకు ముందు సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల అంశంపై వచ్చిన తీర్పులోను సీఎం రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రశంసలు అందుకున్నారు. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో కాస్మోటిక్ డైట్ చార్జీల పెంపుదల, 5000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, రైతు కమిషన్, విద్యా కమిషన్, మహిళా కమిషన్, నూతన ఉస్మానియా దవాఖానా, చేనేత రుణమాఫీ, రైతు రుణమాఫీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వంటి వాటితో పాటు ఉపకులపతుల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అవకాశాలు, 55వేల ఉద్యోగాల భర్తీ, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి రోడ్ల నిర్మాణాలు, ఫ్యూచర్ సిటీ పేరుతో మరో నూతన నగర నిర్మాణం... ఇలా తన దూరదృష్టితో తెలంగాణ దళిత బహుజన బతుకులు మారటానికి కృషి చేస్తున్నారు. పది తరాలు గుర్తుండేలా రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న దళిత బహుజన సంక్షేమాలు ముమ్మాటికీ మేలుమలుపు. అందుకే మా జాతులకు సీఎం రేవంత్‌రెడ్డి దళిత బహుజన బంధువే. ఫిబ్రవరి 4 సోషల్ జస్టిస్ డేగా పాటిస్తాం.

రేవంత్‌రెడ్డి పాలనలో పారదర్శకంగా కులగణన జరిగితే, గతంలో పెద్దపెద్ద మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసినవాళ్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం సిగ్గుచేటు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆశయంతో బీసీ కమిషన్, బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు వంటి నిర్ణయాలు సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధిని చాటాయి.

పున్న కైలాష్ నేత

టీపీసీసీ జనరల్ సెక్రటరీ

Updated Date - Feb 08 , 2025 | 06:20 AM