Share News

చారిత్రక చీకటి వెలుగుల్లో లాహోర్‌

ABN , Publish Date - Feb 08 , 2025 | 06:24 AM

చాలా సంవత్సరాల క్రితం నా పరిశోధనా వ్యాసంగంలో, యాదృచ్ఛికంగా ఒక టెస్ట్‌ మ్యాచ్‌కు సంబంధించిన వార్తా కథనాలను చూడడం, చదవడం తటస్థించింది. 1955లో లాహోర్‌లో భారత్‌–పాకిస్థాన్‌ల మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ అది. ఆ టెస్ట్‌ మ్యాచ్‌ జరిగిన సామాజిక సందర్భం చాలా ఆసక్తికరమైనది. తన బహుళ–సంస్కృతీమయ గతాన్ని

చారిత్రక చీకటి వెలుగుల్లో లాహోర్‌

చాలా సంవత్సరాల క్రితం నా పరిశోధనా వ్యాసంగంలో, యాదృచ్ఛికంగా ఒక టెస్ట్‌ మ్యాచ్‌కు సంబంధించిన వార్తా కథనాలను చూడడం, చదవడం తటస్థించింది. 1955లో లాహోర్‌లో భారత్‌–పాకిస్థాన్‌ల మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ అది. ఆ టెస్ట్‌ మ్యాచ్‌ జరిగిన సామాజిక సందర్భం చాలా ఆసక్తికరమైనది. తన బహుళ–సంస్కృతీమయ గతాన్ని పునర్దర్శించడానికి, ఆ స్ఫూర్తిదాయక చరిత్రను ఆవాహన చేసుకోవడానికి లాహోర్‌ను 1947 తరువాత ప్రప్రథమంగా అనుమతించిన సందర్భమది. టెస్ట్‌ మ్యాచ్‌ను చూసేందుకు వాఘా సరిహద్దుకు ఈవల ఉన్న అమృత్‌సర్‌ నుంచి రోజూ ఉదయం వచ్చి రాత్రికి తిరిగి వెళ్లిపోయే భారతీయ పౌరులకు పదివేల టిక్కెట్లు ప్రత్యేకంగా విక్రయించారు. ‘దేశ విభజన అనంతరం భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు జరిగిన అతిపెద్ద సామూహిక వలస’ అని భారతీయ క్రికెట్‌ అభిమానుల వెల్లువను ప్రత్యక్ష సాక్షి ఒకరు అభివర్ణించారు.

29 జనవరి 1955న ఆ టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమయింది. మరుసటి రోజు ‘డాన్‌’లో వెలువడిన ఒక వార్తా కథనం టిక్కెట్ల కొనుగోలుకు వాఘా ఆవల నుంచి వచ్చినవారు ఎలా బారులు తీరిందీ పేర్కొంది. ‘స్టేడియం వద్ద కోలాహలం షాలిమార్‌ మేలాను జ్ఞప్తికి తెచ్చింది. కాకపోతే ఈ గుంపుల్లో ఉన్న వారందరూ కులీన వర్గాలకు చెందినవారు. భారతీయ సందర్శకులలో ముఖ్యంగా సిక్కులు అందరినీ ఆకర్షించారు. వారు ఎక్కడకు వెళ్లినా సాదర స్వాగతం లభించింది. పాకిస్థానీయులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు అనుకోకుండా తమ పాత స్నేహితులను చూసినప్పుడు ఆనంద బాష్పాలు రాల్చారు’ అని ‘డాన్‌’ వార్తా కథనం పేర్కొంది. ఈ వార్త రాసిన విలేఖరి లాహోర్‌లోని పాకిస్థానీ ముస్లిం అయి ఉంటాడనేది స్పష్టం. సరిగ్గా ఇటువంటి మనోభావాలనే సుదూర మద్రాసులోని హిందూ పాత్రికేయుడు ఒకరు వ్యక్తం చేశారు. ‘ఈ టెస్ట్‌ మ్యాచ్‌ రోజుల్లో పాకిస్థానీయులు, భారతీయుల మధ్య సౌభ్రాతృత్వం వెల్లివిరిసింది’ అని ఆ పాత్రికేయుడు రాశారు.

ఇటీవల ప్రచురితమైన మనాన్‌ అహ్మద్‌ అసిఫ్‌ పుస్తకం ‘Disrupted City : Walking the Pathways of Memory and History in Lahore’ను చదువుతున్నప్పుడు ఎనభై ఏళ్లనాటి ఆ క్రికెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు సంబంధించిన వార్తాకథనాలు జ్ఞప్తికి వచ్చాయి. అసిఫ్‌ లాహోర్‌లో పెరిగాడు. ముప్పై ఏళ్ల క్రితం ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లిపోయాడు. తరచు కన్న ఊరుకు వస్తుంటాడు. లాహోర్‌ కథను పాకిస్థాన్‌కే పరిమితం చేయకుండా ఆ నగర విశాల చరిత్రను చెప్పడమే తన ధ్యేయమని అసిఫ్‌ తన పుస్తకంలో పేర్కొన్నాడు. నగరానికి సంబంధించి తన వ్యక్తిగత స్మృతులను పర్షియన్‌, ఉర్దూ, పంజాబీ, అరబిక్‌ భాషా గ్రంథాలలో విద్వత్‌ శోధనలతో మేళవించి ఆ పురానవ నగర చరిత్రను అసిఫ్‌ వెలయించాడు. ‘1947కు పూర్వం లాహోర్‌ జన జీవనంలోని భిన్నత్వం, బహుళత్వం, హిందూ, సిక్కు మతస్థుల సామూహిక నిష్క్రమణ, ముస్లిం శరణార్థుల రాకతో అంతరించి పోయాయని’అసిఫ్‌ పేర్కొన్నాడు. ‘దేశ విభజనతో సంభవించిన ఆ విచ్ఛిన్నంతో లాహోర్‌ తన సొంత గతం నుంచి బలవంతంగా బహిష్కృతమయింది’ అని అసిఫ్‌ నిట్టూర్చాడు.

అసిఫ్‌ పుస్తకంలో క్రికెట్‌ గురించి సందర్భవశాత్తు ప్రస్తావనలు మినహా ఏమీలేదు. 1955 టెస్ట్‌ మ్యాచ్‌ గురించి అసలు ఏమీ లేదు. అయినప్పటికీ ఆ టెస్ట్‌ మ్యాచ్‌ జరిగిన రోజుల్లో క్రికెట్‌ అభిమానుల కోలాహలం గురించి ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. వారి సందడి షాలిమార్‌ మేలాను గుర్తుకు తెచ్చిందని ఆయన అభివర్ణించాడు. షాలిమార్‌ మేలా (మేలా చిరాఘన్‌గా కూడా సుప్రసిద్ధం) ఒకప్పుడు లాహోర్‌ నగర ప్రధాన పండుగలలో ముఖ్యమైనది. 16వ శతాబ్ది సూఫీ సాధువు షా హుస్సేన్‌ జీవితం, వారసత్వానికి సంబంధించిన ఉత్సవమది. అసిఫ్‌ ఇలా రాశాడు: ‘ఆచారాలకు ప్రాధాన్యమిచ్చే వారిని ఆయన తీవ్రంగా విమర్శించేవాడు. మద్యపాన ప్రియుడు. మత్తు పదార్థాలను సేవించేవాడు. ఆనంద తాండవం చేసేవాడు, తరచు నగ్నంగా’. షా హుస్సేన్‌ సన్నిహితుడు, ఆంతరంగికుడు ఒక హిందూ యువకుడు. బహుశా అతడి లైంగిక భాగస్వామి కావచ్చు. ఆ ఇరువురిని ఖననం చేసిన స్థలం హిందువులు, ముస్లింలు, సిక్కులకు పుణ్యక్షేత్రం. ఏటా అక్కడ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. దేశ విభజన అనంతరం లాహోర్‌ జన జీవనంలో ఈ బహుళత్వం అంతరించింది. 1955లో టెస్ట్‌ మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన జనసందోహాన్ని చూసి చాలా మంది ఆ సంప్రదాయ ఉత్సవాన్ని గుర్తు చేసుకున్నారు. లాహోర్‌ బహుళ స్తరిత, బహుళ మత, బహుళ భాషా గతాన్ని అర్థం చేసుకునేందుకు అసిఫ్ పుస్తకం మనకు విశేషంగా తోడ్పడుతుంది. షా హుస్సేన్‌ గురించే కాకుండా నర్తకి అనార్కలి, మార్మిక సాధువు గంజ్‌ బక్ష్‌, మహారాజా రంజిత్‌ సింగ్‌ మొదలైన నగర ప్రముఖుల చరిత్రనుకూడా క్లుప్తంగానే అయినప్పటికీ ఆసక్తికరంగా వివరించాడు. రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ను సామ్రాజ్యవాది అని ఆక్షేపించాడు. అది నిజమేకాని కిప్లింగ్‌ తన ‘కిమ్‌’ నవలలో లాహోర్‌ నగర సామాన్యుల జీవితాలను ఎంతో సహానుభూతితో వర్ణించాడు.


లాహోర్‌ వాస్తుకళా వైభవాన్ని కూడా అసిఫ్‌ విపులంగా అభివర్ణించాడు సుప్రసిద్ధ చారిత్రక కట్టడాలనే కాకుండా అనామక మసీదుల గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు మసీదులతో పాటు శిథిలమైన దేవాలయాలు, గురుద్వారాలు ఎన్నో కనిపిస్తుంటాయి. సుదూర గతంలో లాహోర్‌ దిగ్మండలంలో హిందూ, సిక్కు పూజా మందిరాలు ప్రముఖంగా కనిపించేవని ఆయన విపులంగా వివరించాడు. 1947కు పూర్వం లాహోర్‌ నగర ఆర్థిక జీవనంలో హిందువుల, సిక్కుల కీలక పాత్ర గురించి కూడా అసిఫ్‌ ప్రముఖంగా వర్ణించాడు. 1970లు, 1980లలో లాహోర్‌లో తన బాల్య, కౌమార దశల గురించి గూడా ఆయన రాశారు. రోజూ సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళుతూ ఒక పాత భవనం ద్వార ఫలకంపై దేవనాగరి లిపిలో రాసి ఉన్న పదాలను చూస్తుండేవాడినని పేర్కొన్నాడు. తాను ఆ అక్షరాలను అలా చూసి ఇలా వెళ్లిపోతుండేవాడినని. ఎప్పుడూ ఆ భవనం ముందు అట్టే తచ్చాడలేదని అసిఫ్‌ గుర్తుచేసుకున్నాడు. ఆ దేవనాగరి లిపిలోని మాటలను చదవలేకపోయేవాడినని, ఆ లిపి నేర్చుకునే ప్రయత్నం కూడా తాను చేయలేదని అసిఫ్‌ తెలిపాడు. ఇంకా ఇలా వ్యాఖ్యానించాడు: ‘దేవనాగరి లిపి ‘హిందూ మతానికి సంబంధించినది అని నాకు తెలుసు. మా సాంఘికశాస్త్ర పాఠ్య పుస్తకాల ప్రకారం హిందువు అంటే ముస్లింను వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించేవాడు మరి’. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు హిందుత్వ వాదుల పాలనలో హిందూ బాలలు వక్రీకరించిన చరిత్రను చదువుతున్న విషయమై ఆలోచనా మగ్నుడినయ్యాను. ఉర్దూ పూర్తిగా ముస్లింల భాష అని దశాబ్దాలుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఎంతో మంది గొప్ప గొప్ప హిందూ, సిక్కు రచయితలు ఉర్దూ భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సాధించినప్పటికీ ఆ భాష పూర్తిగా ముస్లింలదేనని ప్రచారం చేయడమేమిటి?

ఇండియా ప్రధానంగా ‘హిందూ’ దేశం అనే వివరణను, బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న చరిత్ర, సాంఘిక శాస్త్ర పాఠ్యగ్రంథాలు మరింతగా బలపరుస్తున్నాయి. ఈ మెజారిటీవాద ప్రపంచ దృక్పథాన్ని హిందుత్వ సామాజిక మాధ్యమ శ్రేణులు విఫులీకరిస్తున్నాయి. సమస్త హిందువులు, ముస్లింలు అందరినీ ఎటువంటి మినహాయింపు లేకుండా అనుమానించాలని ఆ శ్రేణులు నిత్యం పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రజలు అందరూ ఎటువంటి తరతమ భేదాలు లేకుండా పాల్గొన్న మేలా చిరాఘన్‌, బసంత్ మొదలైన పండుగులు లాహోరీల ఉమ్మడి స్మృతిపథం నుంచి ఎలా బహిష్కృతమయిందీ అసిఫ్‌ పేర్కొన్నారు. సైనిక పాలకుడు జియా ఉల్‌ హఖ్‌ ప్రోత్సహించిన వహాబీ ఇస్లాం సిద్ధాంతాలకు ఆ వేడుకలు విరుద్ధమైనవి కావడంతో లాహోర్ నగర జీవితంలో వాటికి స్థానం లేకుండా పోయిందని అసిఫ్‌ వివరించారు.

1980ల నాటి నుంచీ పాకిస్థాన్‌లో ‘సంతోషం, సద్యోజనిత ప్రేరణలు, సాముదాయికతను అనుమానాస్పద కార్యకలాపాలుగా శంకించడం ఆరంభమయింది. అదే సమయంలో న్యాయమైన, ధర్మబద్ధమైన ఆగ్రహం, మనస్తాపం, విద్వేషం సంస్మరణ కార్యకలాపాలకు ఆధారాలుగా మారాయి’.. హైందవీకరణ అయిన భారత్‌ పాకిస్థాన్‌ పోకడలను అనుసరిస్తున్నట్టుగా కనిపించడం లేదూ? సమష్టి సంతోషాలు, సద్యోజనిత ప్రేరణల స్థానంలో మత విద్వేషాలు, ప్రతీకారాత్మక ఆగ్రహావేశాలు విజృంభిస్తున్నాయి.

లాహోర్‌ చారిత్రక గతం నుంచి హిందూ, సిక్కు ప్రభావాలు, ఆనవాళ్లను పూర్తిగా చెరిపివేసేందుకు ఇస్లామిక్‌ పాకిస్థాన్‌ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. పాకిస్థాన్‌ను ద్వేషించమని బాహాటంగా ప్రకటిస్తున్న హిందుత్వ వాదులు చారిత్రక ఆనవాళ్లను రూపుమాపే తమ ఎడతెగని ప్రయత్నాలలో బద్ధశత్రువులనే అనుకరిస్తున్నారు! గత యుగాలలో ఉత్తర భారతావనిలోని ముస్లిమేతరుల రాజకీయ పరాధీనతనే కాకుండా మత విశ్వాసాల రీత్యా ముస్లింలు అయిన రచయితలు, కళాకారులు, సంగీతవేత్తలు భారతీయ సమాజం, సంస్కృతి సమున్నతికి అందించిన అజరామర సేవలను కూడా మనం మరచిపోవాలని కోరుతున్నారు. అయితే అవి మన ఉమ్మడి, సమ్మిళిత, బహుళత్వ భారతీయ సంస్కృతిలో అపరిహార్యమైన భాగం కదా. హిందుత్వను వ్యతిరేకించే వారందరూ ఆ సమున్నత సమ్మిళిత సంస్కృతిని స్వీకరించి, స్థిరపరచాలి. మనాన్‌ అహ్మద్‌ అసిఫ్‌ పుస్తకాన్ని పాకిస్థాన్‌లో విస్తృతంగా చదువుతారని, ఉర్దూ, పంజాబీ భాషలలో దాని అనువాదాలు వెలువడగలవని ఆశిస్తున్నాను. ఒక గొప్ప, అయితే వ్యాకులతకు గురిచేస్తున్న నగర ప్రశస్త చరిత్ర అది. వాఘాకు ఆవలే కాదు, ఈవల సైతం ఉన్న వారికి కూడా అసిఫ్‌ పుస్తకంలో విలువైన పాఠాలు ఉన్నాయి.

పాకిస్థాన్‌ చరిత్రకారుడు మనాన్‌ అహ్మద్‌ అసిఫ్‌ కొత్త పుస్తకం ‘Disrupted City : Walking the Pathways of Memory and History in Lahore’ లాహోర్‌ కథను పాకిస్థాన్‌కే పరిమితం చేయకుండా దేశ విభజనకు పూర్వం ఆ నగర విశిష్ట చరిత్రను విశాల దృక్పథంతో వివరించింది. వాఘా ఆవలే కాకుండా, ఈవల ఉన్న వారికి సైతం ఆ పుస్తకంలో విలువైన పాఠాలు ఉన్నాయి.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Feb 08 , 2025 | 06:24 AM