మిత్రప్రేమలో వాణిజ్య రక్తి
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:08 AM
ఇద్దరు గొప్ప మిత్రులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఆ దృశ్యాన్ని ఎంతోకాలం తరువాత మళ్ళీ చూశాం. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారతప్రధాని నరేంద్రమోదీ చేయీచేయీ కలిపారు, ఈ మారు అదనంగా థంబ్స్‌ప్‌తో

ఇద్దరు గొప్ప మిత్రులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఆ దృశ్యాన్ని ఎంతోకాలం తరువాత మళ్ళీ చూశాం. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారతప్రధాని నరేంద్రమోదీ చేయీచేయీ కలిపారు, ఈ మారు అదనంగా థంబ్స్‌ప్‌తో స్నేహగాఢతను తెలియచేశారు. శ్వేతసౌధంలో మిమ్మల్ని మళ్ళీ చూడటం నాకు ఆనందంగా ఉంది అన్న మోదీ వ్యాఖ్యలో ట్రంప్‌కు కచ్చితంగా నిజాయితీ కనిపించి ఉంటుంది. నమస్తే ట్రంప్, హౌడీమోడీ కార్యక్రమాలను తామిద్దరూ ఒకరికోసం ఒకరు జరుపుకున్న ఘనమైన గతాన్ని మోదీ గుర్తుచేశారు కూడా. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారనీ, అందరూ అదే అంటున్నారని, నిజంగానే గొప్పనాయకుడనీ ట్రంప్ ఈమారు కూడా మనప్రధాని మనసు ఉప్పొంగేట్టు చేశారు. నిత్యం దేశం గురించి ఆలోచించడమనే అద్భుతమైన నాయకత్వం లక్షణం ట్రంప్‌లో ఉన్నదనీ, తాను కూడా అదే స్ఫూర్తితో వ్యవహరిస్తానని మోదీ గుర్తుచేశారు. పొగడ్తంటేనే ఓ వల, మాయ అని కొందరు మేధావులకు ఏవగింపు ఉంటుంది కానీ, దేశాధినేతల ఈ కీర్తిగానాల మధ్యనే అమ్మకాలు, వ్యాపార లావాదేవీలు జరుగుతాయి.
మేం కలసికట్టుగా ఎవరినైనా జయిస్తాం, ఒకరినొకరు జయించాలని మాత్రం అనుకోవడం లేదని ట్రంప్ చక్కని మాటన్నారు. కలసి జయించాలని ఆయన కోరుకుంటున్నది చైనాని. తన ప్రబలశత్రువుతో పోరాటంలో మిత్రదేశం మరింత కలసిరావాలని కోరుకుంటున్నప్పుడు ఇతరత్రా విషయాల్లో భారత్ పట్ల కాస్తంత ఆదరణపూర్వకంగా అమెరికా అధ్యక్షుడు వ్యవహరించివుంటే ఎంతో బాగుండేది. యుద్ధంలోనే ప్రేమ, వాణిజ్యంలో కలహమేనని ట్రంప్ తేల్చేశారు. ఒకరినొకరు జయించుకోబోమని ఇచ్చిన హామీ వ్యాపారవాణిజ్యాలకు, టారిఫ్ యుద్ధాలకు వర్తించబోదని మోదీతో భేటీకి కాస్తంత ముందే రుజువుచేశారు. ప్రతి సుంకాలని ఓ మర్యాదమాట వాడుతున్నప్పటికీ ప్రతీకార సుంకాలతో మిగతాదేశాలతో మననూ కలగలపి మోదేశారు. ఈ నిర్ణయం ఆఖరునిముషంలో మనపై మరింత ఒత్తిడిపెంచి, దారికితేవడానికి ఉద్దేశించింది కానప్పుడు, ఆ భేటీ ఏదో ముగిసేవరకూ ఆగితే మరింత గౌరవంగా ఉండేది. భారతప్రధానితో భేటీలో ట్రంప్ ఓ నాలుగు మర్యాదమాటల తరువాత పూర్తిగా బిజినెస్‌లో పడ్డారు. సుంకాల విషయంలో ఆయనకు ఉన్న ఆగ్రహాన్ని కాస్తంత చల్లార్చేందుకు మోదీ అమెరికా యాత్రకు ముందే విశేషమైన ప్రయత్నం జరిగింది. హార్లీడేవిడ్సన్ బైకులూ, ఎలాన్ మస్క్ కార్లూ ఖరీదు తగ్గేట్టు చేసినా భారత్ సుంకాలమీద ట్రంప్ మోదీ సమక్షంలోనే గట్టిగా మాట్లాడారు, హెచ్చరికలు చేశారు. రెండుదేశాల మధ్య వాణిజ్యంలో అమెరికాకు వంద బిలియన్ డాలర్ల లోటు ఉన్నదని అంటున్న ట్రంప్ ఈ విషయంలో అమెరికన్లకు న్యాయం జరిగేలా చేస్తానని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోగా ఆచరణలోకి వస్తుందంటున్న వాణిజ్య ఒప్పందంలో ఎవరిది పైచేయి అవుతుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.
మగా, మిగా, మెగా అంటూ భారతప్రధాని చేసిన సూత్రీకరణ ఇరుదేశాల సంబంధాలకు మంచి ఉత్తేజాన్నిస్తుంది. ట్రంప్‌తో వ్యవహారం అంత సులభం కాదనీ, ప్రపంచదేశాల నాయకులు సైతం బోల్తాపడుతున్న తరుణంలో మోదీ నెగ్గుకొచ్చారని అమెరికన్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. రక్షణ, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో హెచ్చిన భాగస్వామ్యం దశాబ్దాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దశాబ్దకాలంలో అమెరికాతో సాన్నిహిత్యం ఆలింగనాలస్థాయికి చేరి, చైనాతో శత్రుత్వం మరింత పెరిగిన తరువాత ఆత్యాధునిక యుద్ధవిమానాల అవసరం కూడా హెచ్చింది. ఎఫ్–35 యుద్ధ విమానాల కొనుగోలు మన అమ్ములపొదిని బలోపేతం చేస్తుంది. ఈ ప్రతిపాదన ఏ దశలో ఉన్నదో తెలియదుకానీ, భారతదేశం అందుకు సిద్ధంగా ఉన్నదన్నట్టుగా ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం. అక్రమవలసదారులను వెనక్కుతెచ్చుకోవడం, సుంకాల విషయంలో రాజీపడటం, యుద్ధవిమానాలతో సహా అతిఖరీదైన ఆయుధసామగ్రిని కొనుగోలు చేయడం, డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ చమురు తోడిపోస్తున్న అమెరికానుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలుచేయడానికి సిద్ధపడటం ఇత్యాదివి కచ్చితంగా ట్రంప్‌ను సంతృప్తిపరుస్తాయి. ఈ ఇచ్చిపుచ్చుకోవడాల్లో అంతిమ లబ్ధి ఎవరిదన్నది అటుంచితే, నాకంటే నరేంద్రమోదీయే బహుచక్కగా బేరమాడగలరు అని ట్రంప్ చేసిన ప్రశంస ఒక అతితెలివైన వ్యాపారిని గుర్తుచేస్తోంది.