Share News

Parliament Productivity Versus Democratic Substance: చర్చ రచ్చ

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:26 AM

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు దిగ్విజయంగా జరిగాయట. లోక్‌సభ 111శాతం, రాజ్యసభ 121శాతం ఉత్పాదకతతో అద్భుతంగా పనిచేశాయని ఆయా సభల అధిపతులు ప్రకటించారు....

Parliament Productivity Versus Democratic Substance: చర్చ రచ్చ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు దిగ్విజయంగా జరిగాయట. లోక్‌సభ 111శాతం, రాజ్యసభ 121శాతం ఉత్పాదకతతో అద్భుతంగా పనిచేశాయని ఆయా సభల అధిపతులు ప్రకటించారు. డిసెంబరు 1న సమావేశాలు ఆరంభమైనప్పుడు, ఎప్పటిలాగానే ఇవి కూడా విమర్శలు, ప్రతివిమర్శలతో ముగియకూడదని, రాద్ధాంతాలకు దూరంగా, చక్కని చర్చలతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రజాస్వామ్య ప్రియులు ఆశించారు, మీడియా ఉద్బోధించింది. ఈ పందొమ్మిది రోజుల్లో పదిహేను సెషన్స్‌ జరిగాయని, విపక్షనేతలు సహకరించడంతో ప్రజాస్వామ్యం బలోపేతమైందని సభాధిపతులు అంటున్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత సభకు అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి కనుక ఆయన మరింత సంతోషంగా ఉన్నారు. ఉభయసభలూ అత్యధిక మార్కులు దాటినందుకు మెచ్చవలసిందే కానీ, ఆ చర్చలు అర్థవంతమైనవీ, ఫలప్రదమైనవీ అని ప్రజలు కూడా అనుకోవాలి. ఠాగూర్‌ అవమానంతో ప్రారంభించి, గాంధీతో ముగించారని కాంగ్రెస్‌ ఈ సమావేశాలను నిర్వచించింది.

ఉభయసభలూ ఆఖరులో గంటలతరబడి కూర్చోవడంతో ఇంతటి స్కోరు సాధ్యమైనమాట నిజం. తొలివారంలో అధికార, విపక్షాల మధ్య ఉన్న వ్యతిరేకతలు అనంతరకాలంలో తగ్గి, ఉభయులూ ఇచ్చిపుచ్చుకోవడానికీ అంగీకరించినట్టుగా అర్థమవుతుంది. సభాధిపతుల్లోనూ కాఠిన్యం తగ్గింది. గత సమావేశంలో విపక్షం ఎంత పట్టుబట్టినా, బిహార్‌ ‘సర్‌’ మీద చర్చను కాదన్న అధికారపక్షం ఈమారు ‘ఎన్నికల సంస్కరణ’ల పేరిట దానిని అనుమతించింది, విపక్షం కూడా సరేనని తాను చెప్పదల్చుకున్నది చెప్పుకుంది. దీనికి ముందే నూటయాభైయేళ్ళ వందేమాతరం చర్చ జరగాలని అధికారపక్షం పట్టుబడితే విపక్షం ఒప్పుకుంది. అధిక సభాసమయాన్ని వెచ్చించిన ఈ రెండు చర్చలూ కూడా ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సాగి, ఎదుటివారిపై నిందలు వేయడానికి మరొకమారు ఉపకరించాయన్నది నిర్వివాదాంశం. వందేమాతరం మీద లోక్‌సభలో ౧1గంటలు, రాజ్యసభలో 13గంటలు చర్చజరిపి, గతాన్ని తవ్విపోసుకొనే బదులు, ఏకమాటగా ఒక తీర్మానాన్ని చేసివుంటే నూటయాభైయేళ్ళ ఈ ఘట్టం చరిత్రలో చక్కగా నిలిచిపోయేది. ఎన్నికల సంస్కరణల చర్చ కూడా ఆత్మస్తుతి, పరనిందకు పరిమితమై ప్రజాస్వామ్య పటిష్ఠతకు ఉపకరించకుండాపోయింది.


ఈ సమావేశాల్లో ఉభయసభలు ఎనిమిది బిల్లులను ఆమోదించాయి. రెండుదశాబ్దాలుగా గ్రామీణపేదలకు ఉపాధిని ఒక హక్కుగా అందిస్తున్న ఒక చట్టాన్ని తిరగదోడి, దాని స్థానంలో ఏ గ్యారంటీలూ ఇవ్వని ఒక కొత్తచట్టాన్ని తెస్తున్నప్పుడు విస్తృత చర్చకు తావులేకపోవడం ఆశ్చర్యం. కొత్త మార్పుచేర్పులతో రాష్ట్రాల మీద అదనపు ఆర్థికభారాన్ని రుద్దుతున్న కేంద్రప్రభుత్వం బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపేందుకు కూడా సిద్ధపడలేదు. కోట్లాది గ్రామీణ కుటుంబాల బతుకుతెరువును నిర్దేశించే ఒక కీలకమైన పథకం విషయంలో అంత అమితవేగం ఎందుకో అర్థంకాదు. మరో రెండు బిల్లులను స్టాండింగ్‌ కమిటీకి పంపిన ప్రభుత్వం జీరామ్‌జీ విషయంలో పట్టుదలగా ఉండటానికి అది కాంగ్రెస్‌ పథకం కావడం, దానికి గాంధీ పేరు ఉండటం ప్రధాన కారణాలన్న విమర్శలను కాదనలేం. సమావేశాలు ముగుస్తున్న తరుణంలో, లోక్‌సభ ఆమోదించిన కొద్దిగంటల్లోనే రాజ్యసభ దానిని స్వీకరించి అక్కడకూడా చర్చకు అవకాశం ఇవ్వకుండా చేయడం కనిపిస్తూనే ఉంది. అలాగే, అత్యంత కీలకమైన పౌర అణురంగంలోకి ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే విషయంలోనూ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతకాలపు చట్టాలను తిరగరాసి, ప్రాణనష్టాలు, పరిహారాల విషయంలో సరఫరాదారులకు పలు మినహాయింపులు ప్రసాదిస్తున్న అంశంమీద లోతైన చర్చ లేకపోవడం పెను ప్రమాదం. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిమితిని నూరుశాతానికి పెంచే బీమా సవరణ బిల్లు కూడా చర్చలేకుండానే గట్టెక్కేసింది. గత శీతాకాల సమావేశాలు రాబోయే రాష్ట్రాల ఎన్నికలవల్లనో, ఇతరత్రా కారణాలవల్లనో పూర్తిగా కొట్టుకుపోయిన నేపథ్యంలో, ఈ సమావేశాలు కొద్దిగా, కాస్తంత బుద్ధిగా జరిగినందుకు సంతోషించాల్సిందే. గతంతో పోల్చితే ఈ మారు ఘర్షణ తగ్గినందున, సమావేశాల ఆఖరున సభాధిపతుల తేనీటివిందుకు కాంగ్రెస్‌ ప్రతినిధులు హాజరుకావడం చూడముచ్చటగా కూడా ఉంది.

ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇస్రో నుంచి మరో రాకెట్ ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 01:26 AM