బిరుదులన్నీ వ్యక్తి పూజలే!
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:11 AM
ఏటా రిపబ్లిక్ దినానికి, ‘పద్మ ఎవార్డు’ల పేరుతో, నాలుగు రకాల బిరుదుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. ఈ నాలుగు బిరుదుల వరసా చూస్తే, ప్రాచీన కాలంలో ఉండిన నాలుగు వర్ణాల వ్యవస్థ

ఏటా రిపబ్లిక్ దినానికి, ‘పద్మ ఎవార్డు’ల పేరుతో, నాలుగు రకాల బిరుదుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. ఈ నాలుగు బిరుదుల వరసా చూస్తే, ప్రాచీన కాలంలో ఉండిన నాలుగు వర్ణాల వ్యవస్థ గుర్తుకు వస్తుంది. కానీ, భారత పాలకవర్గాలు రాసుకున్న 1950 నాటి రాజ్యాంగంలో, ప్రభుత్వం బిరుదులు ఇవ్వకూడదనే ఉంది. కానీ, 1954లో, ఈ బిరుదుల్ని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిరుదులు రాజ్యాంగంలో రాసుకున్నదానికి విరుద్ధమైనవి కాబట్టి, వీటిని రద్దు చెయ్యాలని అప్పట్లో కొందరు కొన్ని రాష్ట్రాల హైకోర్టులకి వెళ్ళారు. చివరికి, ఐదుగురు జడ్జీల సుప్రీం కోర్టు ధర్మాసనం, ‘‘అవి బిరుదులు కావు, ‘గౌరవ పురస్కారాలు’ (‘ఆనరరీ ఎవార్డ్స్’). కాబట్టి అవి రాజ్యాంగానికి విరుద్ధమైనవి కావు’’ అని తేల్చింది. బిరుదులు కాకపోతే, ఈ ఎవార్డులను పొందినవారిని, ‘‘భారత రత్న, ఫలానా’’, ‘‘పద్మ విభూషణ్, ఫలానా’’, ‘‘పద్మశ్రీ, ఫలానా’’ అని సభల్లోనూ, పత్రికల్లోనూ, సంబోధించడం ఎందుకు? ఆ పురస్కారాలు పొందిన కొందరు తమ లెటర్ హెడ్స్ లోనూ, తమ జీవిత విశేషాల్లోనూ (‘బయోడేటా’) ఆ ఎవార్డుల్ని చెప్పుకోవడం ఎందుకు? ఇతరులు చెబుతూ ఉంటే ఆనందిస్తూ కూచోడం ఎందుకు? కాబట్టి, గౌరవ పురస్కారాలైనా, బిరుదులైనా, రెండూ సారాంశంలో ఒకటే. ఒక రకంగా అవి పర్యాయపదాలే!
దేశంలో మనుషులందరూ సమానులే అని ఒక పక్క చెప్పుకుంటూనే, ఆ దేశంలోనే కొంతమందిని ఎక్కువ సమానులుగా బిరుదులు ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వం ప్రకటించినా, తీసుకోవడం ఏమిటి? ‘‘అవును, మేము అందరితో సమానం కాము. మేము ప్రత్యేకం! మేము ‘పద్మ’ బిరుదాంకితులం! అల్లాటప్పాగాళ్ళం కాదు!’’ అని చెప్పుకోవడం కాదూ? ఏం? ‘‘ఎందుకీ గౌరవ పురస్కారాలూ? ఏముందీ? మాకు ఆయా రంగాల్లో పరిస్థితులూ, అవకాశాలూ కుదిరాయి. మాకు చేతనైన పనులు మేము చేశాము. అంతమాత్రాన, తోటి మనుషులనించీ, మమ్మల్ని విడగొట్టి గొప్ప చెయ్యడం ఏమిటి?’’ అనవద్దా? ‘‘నేను ఫలానా రంగంలో కృషి చేసినందుకు గుర్తింపుగా నాకు ఈ పురస్కారం లభించింది. ఇది నా రంగంలో కృషి చేస్తున్నవారందరికీ లభించిన పురస్కారంగా భావిస్తాను’’ అని ఒకరంటే, ‘‘ఇది నా జాతి (కులం) ప్రజలందరికీ దక్కిన గౌరవం’’ అని ఇంకొకరు అంటారు. అసలీ బిరుదులన్నీ, ఆ సమయానికి ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగానో, వ్యతిరేకత లేకుండానో ఉండేవారికే వస్తాయి. పైగా ఆ బిరుదుల కోసం స్వయంగా గానీ, మిత్రుల ద్వారా గానీ, సిఫార్సులూ, పైరవీలూ జరుగుతాయని ఎన్నో వింటాం!
ప్రభుత్వాలు బిరుదులిచ్చినట్టే, కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా, ఒక వ్యక్తిని గొప్ప చెయ్యడానికి, కొన్ని బిరుదులిస్తూ ఉంటాయి. ఉదాహరణకి, సినిమా హీరోల విషయంలో: నట సామ్రాట్, నట రత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మెగాస్టార్, పవర్ స్టార్, రెబెల్ స్టార్... ఇలా రకరకాల బిరుదులున్నాయి. అవన్నీ, ఆ హీరోలతో తీసిన సినిమాలను బాగా అమ్ముడయ్యే సరుకులుగా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. అలాగే, కవులకి కూడా కొన్ని రకాల బిరుదులున్నాయి. ‘విశ్వ కవి’, ‘మహా కవి’, ‘ప్రజా కవి’, ‘కవి సామ్రాట్’, ‘కవి రత్న’, ‘కవి కోకిల’, ‘కవి రాజు’ వగైరాలు. గతంలో అయితే, ‘గండపెండేరాలు’ తొడిగి, ఏనుగు మీద ఊరేగించడం కూడా చేసేవారు!
ఈ బిరుదులూ, ప్రత్యేక గౌరవ పురస్కారాలూ, ఇవన్నీ మనుషుల మధ్య అసమానత్వానికి గుర్తులు. వీటిని ఇచ్చేవారూ, పులకించి పుచ్చుకునే వారూ, వారిని చూసి సమ్మోహితులయ్యేవారూ, ‘మాకు రాలేదే’ అని బెంగ పడేవారూ... అందరూ సమానత్వ భావనకి వ్యతిరేకులు, తెలిసిగానీ, తెలియక గానీ! ఇతర్లని పొగడ్డమూ, పొగిడించుకోవడమూ ఇష్టమైనవారు! అంటే, ‘వ్యక్తి పూజ’కి అనుకూలురు! ఈ కీర్తి దాహానికి (‘కీర్తి కండూతి’ అని ఒక పరుషపదం కూడా ఉంది) లొంగిపోయే వారూ, ప్రోత్సహించేవారూ, బానిస యజమానులే కాదు, ఫ్యూడల్ చక్రవర్తులే కాదు, బూర్జువా నాయకులే కాదు, విప్లవ కమ్యూనిస్టులు కూడా! ‘కామ్రేడ్ స్టాలిన్’, ‘కామ్రేడ్ మావో’ ఈ విషయంలో, అందరినీ అధిగమించారు ‘వ్యక్తి పూజ’ చరిత్రలో! నిజానికి, సమానత్వ సిద్ధాంతమైన కమ్యూనిజం పూర్తిగా వంటబట్టిన వారెవ్వరూ, వ్యక్తి పూజని అంగీకరించరు. దానికి, శాస్త్రీయ కమ్యూనిజం సిద్ధాంతకర్తలైన, మార్క్సూ, ఎంగెల్సుల్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును.
‘విల్ హెల్మ్ బ్లాస్’ అనే ఒక జర్మన్ పత్రికా సంపాదకుడికి రాసిన ఉత్తరంలో- ఎంగెల్స్ గురించీ, తన గురించీ మార్క్స్ ఇలా అంటాడు. (మార్క్స్, ఏంగెల్స్: సెలెక్టడ్ కరెస్పాండెన్స్- పే. 291) ‘‘మాలో ఎవ్వరం పాప్యులారిటీకి గడ్డిపరకంత విలువైనా ఇవ్వం. వ్యక్తి పూజ (‘పెర్సనాలిటీ కల్టు’) ఏ రకమైందైనా మాకు విముఖతే. అనేక దేశాల నించీ వచ్చే ఎన్నో రకాల పొగడ్తల ఉత్తరాలు బహిరంగం కావడానికి నేను ఎన్నడూ ఒప్పుకోలేదు. ఇంటర్నేషనల్ ఉన్నంత కాలం ఆ ఉత్తరాలు నన్ను మహా చికాకు పెట్టేవి. వాటికి నేను ఎన్నడూ జవాబే ఇవ్వలేదు- ఎప్పుడైనా ఓసారి తప్ప. అదైనా వాటిని వ్యతిరేకిస్తున్నానని గట్టిగా చెప్పడానికే. ‘‘ఎంగెల్సూ, నేనూ మొట్టమొదట రహస్య కమ్యూనిస్టు సంఘంలో చేరినప్పుడు, ‘అధికారం’ గురించి మూఢ విశ్వాసాన్ని ప్రోత్సహించే ప్రతీ అంశాన్నీ నిబంధనావళి నించి తీసెయ్యాలని షరతు పెట్టాం.’’
ఈ బిరుదులూ, ప్రత్యేక గౌరవ పురస్కారాలూ, ఇవన్నీ మనుషుల మధ్య అసమానత్వానికి గుర్తులు. వీటిని ఇచ్చేవారూ, పులకించి పుచ్చుకునే వారూ, వారిని చూసి సమ్మోహితులయ్యేవారూ, ‘మాకు రాలేదే’ అని బెంగ పడేవారూ... అందరూ సమానత్వ భావనకి వ్యతిరేకులు, తెలిసిగానీ, తెలియక గానీ! ఇతర్లని పొగడ్డమూ, పొగిడించుకోవడమూ ఇష్టమైనవారు అంటే, ‘వ్యక్తి పూజ’కి అనుకూలురు!
బిరుదులూ, ఎవార్డులూ, సన్మానాలూ ఆనందంగా అంగీకరించే మేధావులు, బిరుదులూ వగైరాల్లో ఉన్న అసమానత్వ కోణం గురించి ఆలోచించాలా, వద్దా?
బి.ఆర్. బాపూజీ