యమునా తీరాన...
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:38 AM
దేశరాజధాని ఢిల్లీకి వాయుకాలుష్యం కంటే ప్రచార కాలుష్యం ఎక్కువ హాని చేస్తోందని ఓ మేధావి వాపోయారు. బుధవారం ఎన్నికలు జరగబోతున్నందున రాజధానివాసులను ఇంతకాలమూ...
దేశరాజధాని ఢిల్లీకి వాయుకాలుష్యం కంటే ప్రచార కాలుష్యం ఎక్కువ హాని చేస్తోందని ఓ మేధావి వాపోయారు. బుధవారం ఎన్నికలు జరగబోతున్నందున రాజధానివాసులను ఇంతకాలమూ కుదిపేసిన ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. అన్ని పార్టీల నాయకులు ఆఖరునిముషం వరకూ ప్రచారాన్ని హోరెత్తించారు. యాభైఐదుస్థానాలతో మూడోసారి అధికారంలోకి వస్తానని చెప్పుకున్న ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ ఎన్నికల సంఘంమీద విరుచుకుపడ్డారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌కు రిటైర్‌మెంట్ అనంతరం బీజేపీ ఏదో పెద్దపదవి కట్టబెట్టబోతున్నదన్న రీతిలో ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. యమునానది కాలుష్యంతో ఢిల్లీ ప్రజల ప్రాణాలను పొరుగురాష్ట్రం హర్యానా ప్రమాదంలో పడవేస్తున్నదని విమర్శలు చేసినందుకు, ఎన్నికలసంఘం పెద్దలు పిలిచి వివరణ కోరడం కేజ్రీవాల్‌కు నచ్చలేదు మరి.
ఇంతకూ హర్యానా ముఖ్యమంత్రి యమున నీటిని తాగారా, తాగినట్టు నటించారా, తాగినట్టే తాగి తిరిగి ఉమ్మేశారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసేలోగా ఢిల్లీ ఎన్నికలు ముగుస్తాయి, యమున కాలుష్యం అంశం వెనక్కుపోతుంది, ఎప్పటిలాగానే ఆ నది విషపు నురగలు కక్కుతూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ వివాదం ఇప్పటిదేమీ కాదు కానీ, కేజ్రీవాల్‌కు యమున కాలుష్యం, తన ప్రజల ఆరోగ్యానికి ముంచుకొచ్చిన ప్రమాదం ఇలా ఎన్నికల ముందే గుర్తుకురావడం బాగోలేదు. హర్యానా నిర్లక్ష్యం కారణంగా మార్గమధ్యంలో కలుషితమై, దేశరాజధానిని చేరుతున్న యమున నీటిని తాము ఎంత అత్యాధునికమైన యంత్రాలు వినియోగించి శుభ్రపరిచినా ఫలితం లేకుండా పోతున్నదని కేజ్రీవాల్ పొరుగురాష్ట్రం మీద దాడిచేసి, పరోక్షంగా బీజేపీని ఆత్మరక్షణంలోకి నెట్టేశారు. యమున నీళ్ళు బాగానే ఉన్నాయని అన్నందుకు, దమ్ముంటే తాగిచూపించడంటూ నీళ్ళబాటిళ్ళు ముందుపెట్టుకొని మరీ సవాలు చేశారు. నేరుగా నదిలోనే తాగుతానంటూ సవాలు చేసిన హర్యానా ముఖ్యమంత్రి సైనీ నిజానికి ఆ నీటిని తాగలేదని, కేవలం నటించారని ఆ తరువాత విమర్శలు చేశారు. యమున నీటినాణ్యత మీద ఇంత పట్టింపు ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల వరకూ ఆగకుండా నీటినాణ్యతమీద ఎప్పుడో చర్చకు దిగాల్సింది. ఢిల్లీని కుదిపేస్తున్న వాయుకాలుష్యానికి కేంద్రాన్నీ, పొరుగురాష్ట్రాలనూ ఆయన ఎలాగూ తప్పుబడుతూనే ఉన్నారు. ఉద్యమాలకు, పోరాటాలకు కేజ్రీవాల్ పెట్టింది పేరు కనుక, యమున కాలుష్యంమీద హర్యానా నిర్లక్ష్యాన్ని ఎండగట్టి, దానినీ, కేంద్రాన్నీ దారికి తెచ్చి అమీతుమీ తేల్చుకోవాల్సింది. ఇదేమీ చేయకుండా, తాము ఇంతకాలమూ తాగుతున్న యమున నీటిని తమ పాలకుడే ఎన్నికల ముందు విషం అన్నందుకు ఢిల్లీ వాసులకు ఆగ్రహం కలుగుతుందో, నిజం చెప్పినందుకు బీజేపీ పెద్దలతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆయన వేధిస్తున్నదని జాలి కలుగుతుందో చూడాలి.
రాజధానిని చేజిక్కించుకోవడమే అంతిమలక్ష్యంగా అన్ని పార్టీలూ ఢిల్లీవాసులను వరాలజల్లులో తడిపేశాయి. గ్యారంటీల పేరిట ఉచితాలను అనుచితస్థాయికి తీసుకుపోయాయి. ఖజానా సొమ్మును పందేరం చేయడంలో పార్టీలన్నీ పోటీపడ్డాయి, హద్దులన్నీ చెరిపేశాయి. యోజన, సమ్మాన్, జీవన్‌రక్ష ఇత్యాది చక్కని పేర్లతో పోటాపోటీగా గుదిగుచ్చిన పథకాలన్నింటి లక్ష్యమూ ఒక్కటే. ఉచితాలను వెటకరించే, విమర్శించే నరేంద్రమోదీ కూడా ఢిల్లీలో మట్టుకు వెనక్కుతగ్గదల్చుకోలేదు. ఆయన పార్టీ ఒకపక్క వరాలు కురిపిస్తుండగా, తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన ప్రజలకు స్వయంగా హామీ ఇస్తున్నారు.
పదిహేనేళ్ళపాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌కు మళ్ళీ అధికారంలోకి రాగలిగేంత శక్తి లేకపోవచ్చును కానీ, ఆప్–బీజేపీ హోరాహోరీ పోరులో అది ఎవరికి ఎక్కువగా నష్టం చేయబోతున్నదన్నది ప్రశ్న. ఆప్ వరుసపాలనమీద విరక్తిచెందినవారు, కేజ్రీవాల్‌ను అవినీతిపరుడిగా నమ్మినవారు, డబుల్ ఇంజన్ సర్కారుకు మొగ్గవచ్చు. పదేళ్ళుగా కఠినంగా ఉన్న ఆర్థికమంత్రి ఢిల్లీ ఎన్నికల దృష్టితోనే ఇంత ఉదారంగా వ్యవహరించారని అనలేం కానీ, శనివారం నాటి కేంద్రబడ్జెట్‌లో ఆదాయం పన్నుమినహాయింపు పరిమితిని 12లక్షలకు పెంచడం మధ్యతరగతి జనాభా అత్యధికంగా ఉన్న దేశరాజధాని నగరాన్ని ప్రభావితం చేయకమానదు. ఆప్ కోటను బద్దలు కొట్టలేకపోయినా, కనీసం ముప్పైస్థానాల్లో బీజేపీ గెలవగలదన్న అంచనాల వల్ల కాబోలు, కేజ్రీవాల్ ఈమారు ఎంతో వినయంగా తన లెక్క తక్కువ చెప్పుకున్నట్టుంది.