ప్రకృతి పరిమళం
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:21 AM
‘పువ్వు పూయును, పూసి వాడును/ వాడి రాలును, వాడి రాలిన పువ్వు వంతుకు/ పూసి మరియొక పువ్వు జేరును’ అని ప్రకృతి లీలను కవి కాళోజీ వర్ణించారు. ‘రాశి చక్రగతులలో/ రాత్రిం దివాల పరిణామాలలో...
‘పువ్వు పూయును, పూసి వాడును/ వాడి రాలును, వాడి రాలిన పువ్వు వంతుకు/ పూసి మరియొక పువ్వు జేరును’ అని ప్రకృతి లీలను కవి కాళోజీ వర్ణించారు. ‘రాశి చక్రగతులలో/ రాత్రిం దివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో’ ప్రభవించిన మానవుడు కాల దేవతను సంక్రాంతులతో పూజిస్తున్నాడు. తన జీవనాన్ని వినూత్న మార్పులతో మరింత శోభితం చేసుకునేందుకు సంక్రాంతి వేడుకలతో ఆవాహన చేసుకుంటున్నాడు.
సంక్రాంతి గగనంలో ప్రారంభమవుతుంది. మానవుని ఖగోళ జిజ్ఞాస నుంచి ‘సంక్రాంతి’ అనే పదం పుట్టింది. గ్రహ రాశులలో ఒక రాశి నుంచి మరొక రాశికి సూర్యుని కదలికను సంక్రాంతి సూచిస్తుంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి చేరడాన్ని సంక్రమణం లేక సంక్రాంతి అంటారు. సూర్యుడు మకర రాశికి చేరినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి నుంచి సూర్యుడి గమనం ఉత్తర దిశగా జరుగుతుంది. అదే ఉత్తరాయణం. సూర్యుని సంక్రమణల ప్రాతిపదికనే ఋతువుల మార్పు జరుగుతుంది. ఈ ప్రాకృతిక పరిణామం భువిపై మానవునితో సహా జీవకోటి వైవిధ్యపూరిత జీవన మనుగడ ఆధారపడి ఉంటుంది. మార్పు ఒక నిత్య సత్యమని, అది అనివార్యమని సూర్యుడి మకరరాశి ప్రవేశం స్పష్టం చేస్తుంది. గగనంలో సంక్రాంతి అందరిదీ. అది చాటే సత్యం సంక్రాంతి పండుగ ఖగోళ ప్రాధాన్యాన్ని దృష్టాంతపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన పాడిపంటలు ఆ ఆదిత్యుని అనుగ్రహాలే.
సంక్రాంతి పంటల పండుగ. ధాన్యరాశులు రైతుల ఇళ్లకు చేరుతాయి, సంక్రాంతి మహోత్సవం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి రోజున పంటల సాగులో తమకు సహాయపడిన వారికి రైతులు సముచిత రీతిలో కృతజ్ఞతలు తెలుపుతారు. సంక్రాంతి మరుసటి రోజు ‘ఇలవేల్పుల’ (పాడి పశువులు అయిన ఆవులు, గేదెలతో పాటు ఎడ్లు, దున్నపోతులు మొదలైన శ్రామిక పశువులు)ను పూజిస్తారు. మకర సంక్రాంతి వేడుకలు భారతావని అంతటా వివిధ పేర్లతో, వేర్వేరు రూపాలలో జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌లో కీచేరిగా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లలో లొహ్రిగా, అసోంలో భోగాలి బిహుగా, బెంగాల్, ఒడిసాలలో మకర్ సంక్రాంతి, రాజస్థాన్‌లలో ఉత్తరాయన్, తమిళనాడులో పొంగల్‌గా జరుపుకోవడం పరిపాటి. ఈ వేడుకల ఉల్లాసోత్సాహాల వెనుక అపారశ్రమ, అంతులేని వేదన ఉన్నాయన్నది కూడా విస్మరించలేని నిజం. సిరులు పండించిన శ్రామికులకు, ఒకటి రెండు రోజులపాటు ఉదార దానధర్మాలు, కృతజ్ఞతా నివేదనలతో న్యాయం జరుగుతుందా?
మకర సంక్రాంతికి ఖగోళ, వ్యవసాయక, సాంస్కృతిక ప్రాధాన్యమే కాకుండా ఆధ్యాత్మిక విశిష్టత కూడా ఉన్నది. ఒక నిర్దిష్ట యోగ ప్రక్రియ నుంచి ఈ పండుగ ఆవిర్భవించిందని యోగి పుంగవులు విశ్వసిస్తారు. భగీరథుడు గంగమ్మను భువిపైకి తీసుకువచ్చింది మకర సంక్రాంతి నాడే అని మన పురాణాలు చెప్తునందున ఈ పర్వదినం నాడు గంగానది, ఇతర నదులలో స్నానం చేయడాన్ని ఒక పుణ్యకార్యంగా ప్రజలు భావిస్తారు. సహస్రాబ్దాలుగా సంఖ్యానేక తరాల వారి ఈ విశ్వాసమే కుంభమేళాలకు నాంది. ముఖ్యంగా ఈ ఏడాది త్రివేణీ సంగమమైన ప్రయాగరాజ్ (అలహాబాద్)లో మహా కుంభమేళ జరుగుతున్నందున (జనవరి 13న ప్రారంభమయిన ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఫిబ్రవరి 26 దాకా కొనసాగనున్నది) ఈ మకర సంక్రాంతి మరింత విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ప్రకృతి పవిత్రత గురించి మానవ అంతరంగాన్ని జాగృతం చేయడమే కుంభమేళాల లక్ష్యం. సామాజిక పరమార్థాన్ని సాధించే ఒక మతాభినివేశ కార్యక్రమం మహా కుంభమేళా. సామాజిక సమ్మిళిత్వానికి దోహదం చేసే ఆధ్యాత్మిక మహోత్సవం.
ఒక శుభ సందర్భంలో గూడుకట్టుకుని ఉన్న విషాదాన్ని గురించి ‘ఆ మానవాననంలో/ ఏదో కించి ద్విషాదం, కించిన్నిరాశ/ కొంచెం విరాగం, కించి దసంతృప్తి/ ఆ మానవ వదనం అందరికీ పరిచితమే/ అతడే నువ్వూ నేనూ అంతమంది వెరసి’ అని శ్రీశ్రీ అన్న మాటలు ప్రస్తుతం ధరిత్రిని కమ్మివేస్తున్న ఒక విలయానికి కూడా వర్తిస్తాయి. అవధులు మీరుతున్న వాతావరణ మార్పే ఆ విషాదం. 2024 పంచాంగ సంవత్సరంలో పారిశ్రామిక యుగానికి పూర్వపు సగటు ఉష్ణోగ్రతల స్థాయి కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ప్రాకృతిక ఉత్పాతాలన్నీ ఈ వాతావరణ మార్పు పర్యవసానాలే. ముంచుకొస్తున్న ఈ ముప్పును నివారించడానికి పరిష్కార మార్గాలను కనుగొనవలసి ఉన్నది. యూపీ సర్కార్ మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో సుస్థిరత, అభివద్ధిపై కుంభ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించడం ముదావహం. కొత్త జీవితాన్ని నిర్మించుకునేందుకు సంకల్పం చెప్పుకునే శుభ దినం కనుక ఈ మకర సంక్రాంతి రోజున ధాత్రీరక్షణకు దోహదం చేసే ఆలోచనలు చేసి వాటిని స్థానికంగా ఆచరణలో పెట్టేందుకు వ్యక్తులు, జన సముదాయాలు, సామాజిక సమూహాలు, ప్రభుత్వాలు పూనుకోవాలి. ఊరు, ఉర్వి శ్రేయస్సు అవిభాజ్యమని గుర్తిస్తేనే ఊరంతా సంక్రాంతి జరుపుకుంటుంది, ఉర్వి జీవన నందనవనం అవుతుంది.