Kerala Abduction Case: న్యాయం కోసం
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:19 AM
కేరళలో ఎనిమిదేళ్ళక్రితం ఒక మలయాళ నటి కిడ్నాప్, లైంగికదాడికి సంబంధించిన కేసు ఊహించని మలుపు తిరిగింది. నిందితుల్లో ఒకరైన నటుడు దిలీప్‌ను సోమవారం...
కేరళలో ఎనిమిదేళ్ళక్రితం ఒక మలయాళ నటి కిడ్నాప్, లైంగికదాడికి సంబంధించిన కేసు ఊహించని మలుపు తిరిగింది. నిందితుల్లో ఒకరైన నటుడు దిలీప్‌ను సోమవారం ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది, మరో ముగ్గురికి ఉపశమనం కల్పించింది. మిగతా ఆరుగురికీ న్యాయస్థానం 12వ తేదీన శిక్షలు ఖరారుచేయబోతోంది. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన ఆ నటిని 2017 ఫిబ్రవరి 17 రాత్రి కొందరు దుండగులు అపహరించి, కారులో రెండుగంటలపాటు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో పోలీసులు దిలీప్ సహా పదిమంది మీద కిడ్నాప్, గ్యాంగ్ రేప్ వంటి తీవ్ర అభియోగాలు నమోదుచేశారు. అదే ఏడాది జూలైలో అరెస్టయిన దిలీప్ నాలుగు నెలలు జైలులో ఉండి బెయిల్‌మీద బయటకు వచ్చారు. నటిపై దాడిఘటనలో తన ప్రమేయం లేదని, పోలీసులే తనమీద కక్షకట్టారని ఆరోపించిన దిలీప్, ఒక దశలో ఈ కేసును సీబీఐ విచారించాలంటూ అభ్యర్థించాడు కూడా. దిలీప్‌ను దిగువ కోర్టు వదిలివేసినా, తాము వదిలేది లేదని, తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని పినరాయ్ విజయన్ ప్రభుత్వం ప్రకటించింది.
మలయాళ సినీరంగాన్ని తీవ్రంగా కుదిపేసి, నిలువునా చీల్చేసి, కేరళ సమాజాన్ని అతలాకుతలం చేసిన కేసు ఇది. దర్యాప్తు, విచారణ కొనసాగిన ఈ ఏడేళ్ళ కాలంలో మీడియా తోచింది వార్చింది. దిలీప్ పక్షాన ఉన్నందుకు కొందరు, నటిని వెనకేసుకు వచ్చినందుకు మరికొందరు ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అర్ధరాత్రి నీకేమి పని అంటూ నటిని తప్పుబట్టి, మెప్పుపొందినవారూ లేకపోలేదు. ఈ తీర్పు నేపథ్యంలో ఎవరీ హనీ వర్గీస్ అంటూ ఏడేళ్ళుగా ఈ కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తిమీద మీడియా ప్రత్యేక కథనాలను అందిస్తోంది. తన కేసులో స్పెషల్ జడ్జి కోసం బాధితురాలు చేసిన విజ్ఞప్తి మేరకు వర్గీస్‌కు హైకోర్టు ఈ కేసు అప్పగించడం, ఆ తరువాత బాధితురాలు, రాష్ట్రప్రభుత్వం కూడా జడ్జిని మార్చవలసిందిగా హైకోర్టుకు పోవడం విచిత్రమైన పరిణామాలు. జడ్జినీ, ఆమె భర్తనూ ప్రభావితం చేసేందుకు దిలీప్ ప్రయత్నించినట్టుగా ఆయన ఫోన్‌లో ఒక ఆడియోక్లిప్ దొరకడం దీనికి కారణం. దిలీప్‌తో జడ్జి మెత్తగా వ్యవహరిస్తున్నారని, తనను మాత్రం కన్నీళ్ళుపెట్టిస్తున్నారని కూడా బాధితురాలు ఆరోపించారు. ఇలా కనీసం మూడుసార్లు బాధితురాలు హైకోర్టును ఆశ్రయించినా జడ్జిని మార్చలేదు. కేసు విచారణ త్వరితగతిన పూర్తిచేయాలన్న సుప్రీంకోర్టు కూడా విధిలేక గడువు ఎనిమిదిసార్లు పొడిగించాల్సి వచ్చింది.
ఫోన్‌లో సమాచారాన్ని చెరిపివేసినందుకు ప్రయత్నించి దిలీప్ లాయర్లు కూడా అరెస్టయ్యారు. పలుమార్లు ప్రభుత్వ న్యాయవాదులు, దర్యాప్తు అధికారులు మారిపోయారు. నలభైమంది సాక్షులు ఎదురు తిరిగి కేసు బలహీనపడింది. నటితో పాటు దిలీప్ సెలబ్రిటీ స్టేటస్ వల్ల సమాజం, మీడియా ఈ కేసుమీద ఎక్కువ దృష్టిపెట్టడం, ముందస్తు తీర్పులు ఇచ్చేయడం సహజం. ఆ ఒత్తిడికి అతీతంగా నిలవడం కోర్టులకు పెద్దపరీక్ష. దాడికి గురైన నటి ఐదేళ్ళ తరువాత మౌనం వీడి, ఆ ఘోరం గురించీ, తాను అనుభవించిన మానసిక క్షోభ, లైంగికదాడి ప్రభావం నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాల గురించీ మాట్లాడారు. సమాజంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ దూషణలు, వ్యక్తిత్వహననాలు ఎదుర్కొన్నారామె. ఈ దాడి ఘటన అనంతరం ఏర్పాటైన హేమా కమిటీ మలయాళ పరిశ్రమలో మహిళలు వేతనాల నుంచి వేధింపుల వరకూ ఎంతటి వివక్షాపూరిత, దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో బయటపెట్టింది. ఈ రిపోర్టు మొత్తంగా భారతీయ సినీపరిశ్రమను సైతం ప్రభావితం చేసి, సినీరంగంలో మహిళల పక్షాన సమూలమార్పులకు దోహదం చేస్తుందన్న ఆశ ఆశించిన స్థాయిలో నెరవేరలేదు.
నటిని అపహరించి, లైంగికదాడిచేసి, ఆ నేరాన్ని చిత్రీకరించడానికి దిలీప్ ఈ గూండాలను కొన్నాడన్న పోలీసుల మాట కోర్టు నమ్మకుండా, ప్రధాననేరగాడు పల్సర్ సునీల్‌కూ దిలీప్‌కూ పరిచయమే లేదన్న వాదనను విశ్వసించినందున ఈ చోటా నేరగాళ్ళకే రేపటిరోజున కఠిన శిక్షలు పడవచ్చు. ప్రభుత్వమూ, ప్రధానంగా బాధితురాలు అత్యున్నత న్యాయస్థానంవరకూ పోయి పోరాడాలని సంకల్పించినందున ఈ వ్యధ కథ ఇంకా ముగియనట్టే. ఎప్పుడో బయటకు వచ్చేసిన దిలీప్ ఇప్పటికే పాతహోదాలు, గౌరవాలు తిరిగి సంపాదించుకున్నాడు, ఇప్పుడు ఏకంగా ఘనస్వాగతాలు, జేజేలూ అందుకుంటున్నాడు. ఇప్పటికే తన జీవితాన్ని, కెరీర్‌ను కోల్పోయిన ఆమె మాత్రం న్యాయంకోసం ఇంకా పోరాడుతూనే ఉండాలి.
ఇవీ చదవండి:
అమ్మాయితో కలిసి కాలేజ్ నుంచి పారిపోదామనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
థ్రిల్లింగ్ ఫైట్.. పాము ముంగిసల పోరాటంలో విజేత ఎవరో చూడండి..