ISRO LVM3 Rocket Launch: అపూర్వ విజయం
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:06 AM
కొత్త సంవత్సరంలోకి భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) రెట్టించిన ఉత్సాహంతో అడుగుపెడుతోంది. బుధవారంనాటి ప్రయోగం ఇస్రోకు మరింత శక్తినీ, దూకుడునీ ఇస్తుంది. విదేశీ ఉపగ్రహాలను...
కొత్త సంవత్సరంలోకి భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) రెట్టించిన ఉత్సాహంతో అడుగుపెడుతోంది. బుధవారంనాటి ప్రయోగం ఇస్రోకు మరింత శక్తినీ, దూకుడునీ ఇస్తుంది. విదేశీ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టి నాలుగురాళ్ళు సంపాదించుకోవడం ఇస్రో ఎప్పటినుంచో చేస్తోంది. ముపైనాలుగుదేశాలకు చెందిన నాలుగువందల ముప్పైనాలుగు ఉపగ్రహాలను వాణిజ్యప్రాతిపదికన ప్రయోగించిన ఇస్రోకు ఇది అలవాటైన విద్య. కానీ, ఆరున్నరలక్షల కిలోల బాహుబలి రాకెట్, ఆరువేలకేజీల భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన మొన్నటి దృశ్యం అపూర్వమైనది. ఇస్రో చరిత్రలో ఇది అత్యంత సాహసోపేతమైన ప్రయోగం. ఆరుటన్నులకు మించిన ఉపగ్రహాలను కూడా అతిసునాయాసంగా పంపగలిగే ఇస్రో సమర్థతను మిగతా ప్రపంచానికి చాటిచెప్పిన ఘట్టం ఇది. సాంకేతిక పరిజ్ఞానంలోనూ, సమర్థతలోనూ ఇస్రో ప్రపంచస్థాయి అంతరిక్ష సంస్థలకు ఏమాత్రం తీసిపోదని రుజువుచేసిన ప్రయోగం.
కేవలం 52రోజుల్లో ఇస్రో చేసిన మరో సాహసం ఇది. గత నెల 2వ తేదీన అప్పటికి అత్యంత బరువైన 4,400 కిలోల స్వదేశీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టి ఇస్రో రికార్డు సృష్టించింది. ఇప్పుడు ప్రయోగించిన విదేశీ ఉపగ్రహం బరువు మరో 1700 కేజీలు అదనం. ఇలా రెండు భారీ ఉపగ్రహాలను ఇంత స్వల్పవ్యవధిలో ప్రయోగించడానికి ఇస్రో తనను తాను సమాయత్తం చేసుకోవడమే కాక, ఒక ఉపగ్రహాన్ని భూమికి ముప్పైఆరువేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న జియో సింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి, ఇప్పటి అమెరికా ఉపగ్రహాన్ని నిమ్నభూకక్ష్యలోకి చేర్చడం ద్వారా ఎటువంటి విన్యాసానికైనా తాను సిద్ధమని నిరూపించుకుంది. తాజా ప్రయోగంలో 43.5మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్‌ఎంవి౩–ఎం6 రాకెట్ పావుగంటలో బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని కక్ష్యలో ఉంచి, బాహుబలి పేరును మరోమారు సార్థకం చేసుకుంది. ఎప్పటికప్పుడు అదనపు శక్తిని సంతరించుకుంటూ బలోపేతం అవుతున్న ఎల్‌విఎం–3 రాకెట్ ఇస్రో అమితంగా విశ్వసించే జవనాశ్వం. అరడజనుసార్లు అప్పగించిన పనిని అద్భుతంగా నెరవేర్చి పేరు సార్థకం చేసుకుంది. మూడు వాణిజ్య ప్రయోగాలను ఫలప్రదం చేసి అంతర్జాతీయ మార్కెట్‌లో ఇస్రో కీర్తిప్రతిష్ఠలను పెంచింది. చంద్రయాన్–2, చంద్రయాన్–3 ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన ఈ రాకెట్ 2027 ఆరంభంలో జరగబోయే గగనయానానికీ, ఆ ఏడాది చివరన సంకల్పించిన చంద్రయాన్–4కు కూడా అండగా ఉండబోతోంది. మరోపదేళ్ళలో స్వంత అంతరిక్షకేంద్రాన్ని నిర్మించుకోవడంలోనూ, ఆ తరువాత మరో ఐదేళ్ళకు చంద్రుడిమీద కాలూనాలన్న ఆశయానికీ మరింత శక్తిని దట్టించిన ఇటువంటి రాకెట్ అవసరం. 2028లో మొదలుపెట్టి పదేసి టన్నుల చొప్పున దశలవారీగా సామగ్రిని తరలించి యాభైరెండు టన్నుల అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం బాహుబలి రాకెట్లతోనే సాధ్యం. ఆ తరువాత చంద్రుడిమీద కాలూనడం సహా పలు మానవయాత్రలకు భారత అంతరిక్ష కేంద్రం వేదికగా, చోదకశక్తిగా ఉపకరిస్తుంది.
అంతరిక్షవాణిజ్యంలో ఇస్రో ప్రయాణం నెమ్మదిగా సాగుతున్నా, అడుగులు గట్టిగా పడుతున్నాయి. తనను తాను మెరుగుపరుకుంటూ, వైఫల్యాలకు దూరంగా ఉంటూ చవుకగా వ్యాపారం చేస్తోంది. మరోపదేళ్ళలోగా గ్లోబల్ మార్కెట్‌లో 8–10శాతం వాటా సాధించగలదని ఓ అంచనా. ఇస్రో ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది అసాధారణ విజయం. ఐదేళ్ళక్రితం అంతరిక్షరంగాన్ని కూడా ప్రభుత్వం ప్రైవేటుసంస్థలకు తెరిచిన నేపథ్యంలో, ఇస్రో పునాదిబలం వాటికీ ఉపకరిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ ఏడాది ఆరంభంలో అంతరిక్షంలో రెండుఉపగ్రహాలను అనుసంధానించి, మళ్ళీ విడదీసిన స్పేడెక్స్ ప్రయోగం సాంకేతిక అద్భుతమే కాదు, అంతరిక్ష కేంద్రం నిర్మాణం కలను సాకారం చేయడంలో మరో అడుగు. ఎడ్లబండి మీద ఉపగ్రహాన్ని తీసుకుపోయిన కాలంనుంచి ఈ భారీ ఉపగ్రహ ప్రయోగంవరకూ సాగిన ‘ఇస్రో’ ప్రస్థానం మనసు పులకింపచేస్తుంది. బడ్జెట్ కేటాయింపుల్లో పాలకులు చిన్నచూపు చూసినా తనపనితాను చేసుకుపోతోంది. ఒకేమారు వంద ఉపగ్రహాలను విభిన్న కక్ష్యల్లోకి వెదజల్లగలిగే సమర్థతని పెంచుకుంది. శతాధిక రాకెట్ ప్రయోగాలతో ఐదువందల యాభైకుపైగా ఉపగ్రహాలను నింగిలోకి చేర్చింది. ఆంగ్లచిత్రాలకంటే తక్కువ ఖర్చుతో అంతరిక్షయాత్రలు చేస్తోంది. గగనయానాలు, చంద్రయానాలు, అంగారక అధ్యయనాలతో ఆశ్చర్యపరుస్తోంది. ప్రతీ ఏటా నిర్దిష్టమైన లక్ష్యాలతో తాను వేగంగా ఎదుగుతూ దేశాన్ని స్పేస్ సూపర్‌పవర్‌గా తీర్చిదిద్దుతోంది.
ఇవి కూడా చదవండి
2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..