Share News

కొత్త పాలనలోకి...

ABN , Publish Date - Jan 21 , 2025 | 05:47 AM

అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణం చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఓ వంద ఆదేశాలతో మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ తన పాలనలో తీసుకున్న పలునిర్ణయాలను తిరగదోడబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు...

కొత్త పాలనలోకి...

అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణం చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఓ వంద ఆదేశాలతో మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ తన పాలనలో తీసుకున్న పలునిర్ణయాలను తిరగదోడబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలకు అనుగుణంగానూ, ఇంధనం, పర్యావరణమార్పు, వలసలు, పరిపాలన ఇత్యాది అంశాలతోనూ ముడివడిన ఈ ఆదేశాలకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం అవసరం లేదు. మరోపక్క, తాను అధికారంలోకి రాగానే శత్రుసంహారం తథ్యమని, తనకు వ్యతిరేకంగా వ్యవహరించినవారి సంగతితేల్చేస్తానని కొత్త అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో, పదవిదిగే కొద్దిగంటలముందు కూడా జోబైడెన్‌ తన విశేషాధికారాలను వినియోగించి ట్రంప్‌ వ్యతిరేకులు కొందరికి ముందస్తు క్షమాభిక్షలు ప్రకటించారు. కొవిడ్‌ కల్లోలకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలబడిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వీరిలో ఒకరు. అజ్ఞానంతోనో, అహంకారంతోనో కరోనాకాలంలో ట్రంప్‌ చేసిన పలువ్యాఖ్యలు, ప్రతిపాదనలకు బుద్ధిగా తలాడించకుండా ధైర్యంగా ఎదురునిలిచి, ట్రంప్‌ వ్యతిరేకశక్తులకు ఈయన కేంద్రబిందువైన విషయం తెలిసిందే. ట్రంప్‌ ప్రతీకారంనుంచి బైడెన్‌ ముందస్తుభద్రతను ప్రసాదించినవారిలో క్యాపిటల్‌హిల్‌ దాడులపై విచారణ జరిపిన హౌస్‌ కమిటీ సభ్యులు, వారిముందు సాక్ష్యం చెప్పిన కొందరు అధికారులు కూడా ఉన్నారు. కొత్త అధ్యక్షుడి మలిరాకడను మిగతాప్రపంచం కూడా అమితాసక్తితో, భయభక్తులతో గమనిస్తోంది.


ట్రంప్‌ ఏలుబడిలో అమెరికాకు అపారమైన నష్టం జరగబోతున్నదని, కుబేరులు, కులీనులు కట్టగట్టుకొని దేశాన్ని దోచేసుకుంటారని బైడెన్‌ తన వీడ్కోలు ప్రసంగంలో చాలా హెచ్చరికలే చేశారు. అమెరికాలో సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోందని, అతికొద్దిమంది కుబేరుల చేతుల్లోకి అధికారం పోయి, ఏ మాత్రం జవాబుదారీతనం లేని పాలనలో సామాన్య జనం గోసపడతారని ఆయన మాచెడ్డ బాధపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యకథనాలను వండివారుస్తారని, అమెరికా ప్రజలు తప్పుడుప్రచారాలకు బలి కావాల్సివస్తుందని, పత్రికాస్వేచ్ఛ క్షీణిస్తుందని హెచ్చరించారు. అడ్డుపడడం, ప్రశ్నించడం మరిచిపోకండన్న ఆయన హితవును అమెరికన్లు చెవినపెడతారో లేదో చూడాలి. ట్రంప్‌ అరాచకాలనుంచి దేశాన్ని రక్షించగలడని, మరోమారు డెమోక్రాటిక్‌ పార్టీని విజయపథంలో నడిపించగలడనీ నాలుగేళ్ళక్రితం జనం నమ్మి ఓటేసిన బైడెన్‌ ఇప్పుడు బలహీనుడుగా ముద్రపడి నిష్క్రమించాల్సి వస్తున్నది. ట్రంప్‌ పునరాగమనం ఒక సునామీలాగా ఉంటుందని ఈయన ఊహించివుండడు. కమలాహ్యారిస్‌ను కాదని తానే పోటీచేసివుంటే అద్భుతంగా గెలిచేవాడినని గొప్పలకు పోతున్న బైడెన్‌కు ట్రంప్‌కు ఈ ఘనవిజయాన్ని చేజేతులా అందించింది తానేనని తెలియకపోదు. సమకాలికులు తనను కాదన్నప్పటికీ, చరిత్ర కచ్చితంగా తనకు జేజేలుపలుకుతుందని బైడెన్‌ చెప్పుకుంటున్నారు. అమెరికాను ఆయన ఏమేరకు ఉద్ధరించారో అక్కడి ప్రజలకు సంబంధించిన విషయం. కానీ, మిగతా ప్రపంచంతో ముడివడిన వ్యవహారాలమీద కూడా ఆయన తెలివైన నిర్ణయాలు చేసినట్టుగా కనబడదు. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబాన్‌కు అప్పగించడం, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపలేకపోవడం, గాజాలో నెతన్యాహూ మారణకాండకు వత్తాసు పలకడం వంటి తప్పుడు పనులు ఆయన ఖాతాలో అనేకం ఉన్నాయి.


భారతదేశానికి సంబంధించినంతవరకూ బైడెన్‌ తన పదవీకాలంలో సానుకూలంగా ఉన్నమాట వాస్తవం. ట్రంప్‌తో మోదీ ఆలింగనాలు కానీ, ఆయన పక్షాన అమెరికాలో ఎన్నికల ప్రచారాలు కానీ బైడెన్‌ను ప్రభావితం చేయలేదు. ఉభయదేశాల భాగస్వామ్యం మరింత బలపడి విస్తరించింది. అనేక అంతర్జాతీయ కూటముల్లోనూ, వేదికల్లో‍నూ అమెరికా సరసన భారత్‌కు చోటు దక్కింది. బైడెన్‌ అంతటి భారత్‌ అనుకూల అమెరికా అధ్యక్షుడు ఇటీవలి కాలంలో ఎవరూలేరని విశ్లేషకులు అంటారు. అడపాదడపా గిల్లికజ్జాల అనుమానాలు ఉన్నప్పటికీ ట్రంప్‌ పునరాగమనం భారత్‌కు మేలుచేసేదే. ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ట్రంప్‌ వ్యవహరించినపక్షంలో సుంకాల పోరు, వీసాల బాధలు మనకు తప్పకపోవచ్చును. బైడెన్‌ మాదిరిగా చైనాతో కక్షగట్టి ట్రంప్‌ వ్యవహరించకపోవచ్చును కనుక, ఆ ప్రభావం కొంతమేరకు మనమీద పడవచ్చు. భారత్‌–అమెరికా సంబంధాలు అతివేగంగా అన్ని రంగాలకు విస్తరించి, ఆయుధవ్యాపారం నుంచి ఆలింగనాలవరకూ ఎదిగాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు పాలకుడైనా భారత్‌ను కాదనగలిగే స్థితిలో ఆ అగ్రరాజ్యం లేదు.

Updated Date - Jan 21 , 2025 | 05:47 AM