Share News

India US Tariff War: సుంకాల సమరం

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:28 AM

భారత్‌–అమెరికా సంబంధాలు ఇలా ఉప్పూనిప్పూలాగా తయారవుతాయని అర్నెల్లక్రితం కూడా ఎవరూ ఊహించలేదు. మలివిడత ఆగమనంలో ట్రంప్‌ ఎలా వ్యవహరిస్తారన్న అనుమానాలు లేకపోలేదు కానీ, మోదీ–ట్రంప్‌ మధ్య వ్యవహారం మరీ ఇంత చెడుతుందని అనుకోలేదు...

India US Tariff War: సుంకాల సమరం

భారత్‌–అమెరికా సంబంధాలు ఇలా ఉప్పూనిప్పూలాగా తయారవుతాయని అర్నెల్లక్రితం కూడా ఎవరూ ఊహించలేదు. మలివిడత ఆగమనంలో ట్రంప్‌ ఎలా వ్యవహరిస్తారన్న అనుమానాలు లేకపోలేదు కానీ, మోదీ–ట్రంప్‌ మధ్య వ్యవహారం మరీ ఇంత చెడుతుందని అనుకోలేదు. తొలివిడతలో మాదిరిగానే ట్రంప్‌ అండదండలు బేషరతుగా ఉంటాయన్న నమ్మకంతో పాక్‌మీదకు కాలుదువ్వడం సుంకాల సమరాన్ని మరింతరాజేసిందని మోదీ వ్యతిరేకశక్తుల వాదన. యుద్ధాన్ని నేనే ఆపానని ముప్పైసార్లు ట్రంప్‌ చెప్పుకున్నా, పాకిస్థాన్‌ మాదిరిగా ప్రత్యక్షంగా సాగిలబడకున్నా, పరోక్షంగానైనా తలూపివుంటే ఆ సమరవీరుడు శాంతించి ఉండేవాడని విశ్లేషకుల నమ్మకం. భారతప్రభుత్వం ఏ మాత్రం ప్రతిస్పందించకుండా కొన్నాళ్ళు, ఎవరి ఒత్తిళ్ళూ ఫోన్లూ లేవంటూ మరికొన్నాళ్ళు, అమెరికా ఉపాధ్యక్షుడు ఫోన్‌ చేస్తే గట్టిగా జవాబు ఇచ్చామంటూ దేశీయంగా ఆ తరువాత ఇచ్చిన వివరణలూ కలగలసి ట్రంప్‌కు ఆరని ఆగ్రహం కలిగించాయని వారి వాదన. మోదీ మాజీ మిత్రుడు ఆఖరునిముషంలో దిగివచ్చి, అదనపు పాతికశాతం సుంకాల విషయంలో సడలింపులు ఇస్తాడనుకున్నవారి ఆశ చివరకు నిరాశే అయింది.

ఆగస్టు 25న రావాల్సిన అమెరికా వాణిజ్య చర్చల బృందం తన పర్యటన రద్దుచేసుకోవడం ప్రతిష్ఠంభన తీవ్రంగా ఉందనడానికి సంకేతం. ఉక్రెయిన్‌ యుద్ధం ఆగాలంటే, రష్యానుంచి చమురుకొని అగ్నికీలలను రాజేస్తున్న భారత్‌ను శిక్షించాలన్న వాదనకు అనుగుణంగానే అమెరికా పాలకులూ, అధికారుల వ్యాఖ్యలున్నాయి. చవుకగా రష్యన్‌ క్రూడ్‌ కొని, శుద్ధిచేసి, ఎగుమతి చేస్తూ భారతదేశంలోని కొన్ని కులీన కుటుంబాలు విపరీతంగా బాగుపడ్డాయని, భారత్‌ వందలకోట్లు లబ్ధపొందిందని అమెరికా విమర్శిస్తున్నది. అమెరికా అధ్యక్షుడి వాణిజ్య సలహాదారు ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని మోదీ యుద్ధంగా అభివర్ణించేంతవరకూ పోయారు.


ఎవరి బరిలో వారున్నారు. గీతలు చెరగనిదే, రాజీకి రానిదే, చేయి కలవనిదే సుంకాల యుద్ధం ఆగదు. ఎవరూ రాజీపడే సూచనలు కనిపించడం లేదు. రష్యా క్రూడ్‌ కొనుగోళ్ళు మరింతగా సాగుతూ అక్టోబర్‌ ఆర్డర్లు కూడా వెళ్ళాయి. మరో ఐదేళ్ళలో ఆ దేశంతో రెట్టింపు వాణిజ్యం చేయాలని కూడా భారత్‌ నిర్ణయించుకుంది. రష్యాతో అనాదిగా ఉన్న స్నేహం పునాదిగా అది మనకు ఈ కష్టకాలంలో అండగా నిలుస్తున్నది. నిన్నటిదాకా శత్రువులాగా వ్యవహరించిన చైనా సైతం ఈ సంక్షోభంలో మనకు ఊహకందనంత వేగంగా సన్నిహితమైంది. ఈ రెండుదేశాలతో జరుగుతున్న చర్చలు, సాగుతున్న రాకపోకలు, అత్యున్నతస్థాయి భేటీలు ఎంతో భరోసానిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ధైర్యవచనాలు పలుకుతున్నారు. అమెరికా నుంచి ఎంత ఒత్తిడివచ్చినా తగ్గేది లేదనీ, లొంగేది లేదనీ, మరింత బలోపేతమవుతామని, రైతులు, చిరువ్యాపారులకు నష్టం రానివ్వబోమని మోదీ హామీ ఇస్తున్నారు. ఆయన నోటివెంట మళ్ళీ స్వదేశీ, ఆత్మనిర్భరత ఇత్యాదిమాటలు వింటున్నాం. ఎగుమతులకోసం కొత్త ద్వారాలు తెరుచుకుంటాయనీ, అమెరికా స్థానంలో మనలను ఎవరెవరో ఆదుకుంటారని హామీలు వింటున్నప్పటికీ, ట్రంప్‌ సుంకాల ప్రభావం లక్షలాదిమందికి ఉపాధికల్పిస్తున్న కీలకరంగాలమీద కనిపించడం ఆరంభమైంది.

భారత్‌ కంటే భారీగా రష్యన్‌ క్రూడ్‌ కొంటున్న చైనాను వదిలేసి, మనమీద ట్రంప్‌ విరుచుకుపడటం వెనుక చమురు ఒక్కటే కాక అనేక కారణాలు ఉండవచ్చు. పాతికశాతం చమురుసుంకం అమలులోకి వస్తున్నతరుణంలోనే, ట్రంప్‌ మరోమారు భారత్‌–పాక్‌ యుద్ధం గురించి ప్రస్తావించి, తాను ఇచ్చిన గడువుకంటే బాగాముందే ఐదుగంటల్లోనే యుద్ధం ఆగిపోయిందంటూ ఓ వ్యాఖ్యచేశారు. ఆయన నోబెల్‌శాంతి ఆకాంక్షను పరోక్షంగానైనా బలపరచడంతోపాటు, వాణిజ్య ఒప్పందానికి కూడా మార్గం సుగమం చేసివుంటే ఇంత వీరంగం ఉండేది కాదేమో. ఉభయదేశాలకూ పరస్పరప్రయోజనకారిగా ఉన్న వాణిజ్యాన్ని ట్రంప్‌ తన దుందుడుకుతనంతో ప్రమాదంలోకి నెట్టేశారు. ఆయన ‘మాగా’ (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌) మన ‘మిగా’ కలసి ‘మెగా’ అవుతుందని మోదీ కూడా ఒక దశలో ఆశపడ్డారు. మన సంకల్పబలం మెచ్చదగిందే కానీ, ట్రంప్‌ రక్షణాత్మక చర్యలు ఇంకెన్ని రంగాలకు విస్తారిస్తాయనే భయం తప్పడం లేదు.

ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 05:28 AM