Share News

India China Relations: మళ్ళీ చిగురించిన దోస్తీ

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:49 AM

అమెరికాతో చెడుతున్నకొద్దీ, చైనాతో స్నేహం పెరుగుతోంది. గురువారం చైనా అధికారప్రతినిధి భారత్‌తో సంబంధాలమీద చేసిన వ్యాఖ్యలు వస్తున్న మార్పును స్పష్టంగా సూచిస్తున్నాయి. భారత్‌ అభ్యంతరాలను గుర్తించడం...

India China Relations: మళ్ళీ చిగురించిన దోస్తీ

అమెరికాతో చెడుతున్నకొద్దీ, చైనాతో స్నేహం పెరుగుతోంది. గురువారం చైనా అధికారప్రతినిధి భారత్‌తో సంబంధాలమీద చేసిన వ్యాఖ్యలు వస్తున్న మార్పును స్పష్టంగా సూచిస్తున్నాయి. భారత్‌ అభ్యంతరాలను గుర్తించడం, పొరపాట్లను సరిదిద్దుకోవడం, విశ్వా్సాన్ని పెంచే చర్యలు చేపట్టడం గురించి ఆయన నిర్దిష్టంగా మాట్లాడారు. ఉభయదేశాల మధ్యా సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించేందుకు ఐదేళ్ళ తరువాత ప్రయత్నాలు జరుగుతున్నాయంటేనే, కొత్త ప్రేమలు చిగురిస్తున్నాయని అర్థం. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం పర్వతశ్రేణుల్లో జరగబోతున్న ఈ ప్రయత్నం పరిమాణం రీత్యా పెద్దది కాకున్నా, ఒక సానుకూల పరిణామం. త్వరలోనే చైనా విదేశాంగమంత్రి మనదేశంలో పర్యటించడం కూడా గల్వాన్‌ ఘాతుకం అనంతరం ఉభయదేశాలమధ్యా పెరిగిన దూరాన్ని తగ్గించేందుకు ఉపకరిస్తుంది.

సుంకాల సమ్మెటదెబ్బలతో సరిపెట్టకుండా, ఏవో పాతకక్షలూ కోపతాపాలూ ఉన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు భారత్‌తో వ్యవహరిస్తున్న నేపథ్యంలో, చైనాతో మన దోస్తీ పెరుగుతోంది. ఉభయదేశాలూ గతంలో పరస్పరం విధించుకున్న శిక్షలూ ఆంక్షలను సడలించడమో, తొలగించడమో జరుగుతోంది. బీజింగ్‌నుంచి ఎరువుల సరఫరా తిరిగి మొదలైంది, చైనా పౌరులకు భారత్‌ టూరిస్టు వీసాలు ఇస్తోంది. భారత్‌–చైనా మధ్య నేరుగా విమానసర్వీసులు నడిపే ప్రయత్నం కూడా జోరందుకుంది. ఉభయదేశాల మధ్యా సరిహద్దు వివాదాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నప్పటికీ, ఉన్నతస్థాయిలోనే చేయాల్సిన కొన్ని కీలక నిర్ణయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. చైనా విదేశాంగమంత్రి పర్యటన, భారత భద్రతాసలహాదారు అజిత్‌ దోభాల్‌తో భేటీ ఈ వివాదాల పరిష్కారానికి దోహదపడవచ్చునని ఆశ. ఇక, అక్టోబర్‌లో జరగనున్న షాంఘై సహకార సంఘం సదస్సుకు హాజరుకావాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించుకున్నందుకు చైనా సంతోషిస్తోంది. చైనా దినపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తన సంపాదకీయంలో మోదీని ప్రశంసిస్తూ, హిందీ చీనీ భాయిభాయి తరహాలో అనేక మంచిమాటలు రాసింది.


భారత్‌–చైనా మధ్య ఐదేళ్ళపాటు కొనసాగిన ఎడబాటు ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దయవల్ల, క్రమంగా తొలగిపోతోంది. భారత్‌ను తప్పుబట్టిన చైనానోటినుంచే ఇప్పుడు ప్రశంసలు వింటున్నాం. చైనాకు పోటీగా ఈ ప్రాంతంలో భారత్‌ను నిలబెట్టి, బలోపేతం చేసి, చైనా ఎదుగుదలనూ, విస్తరణవాదాన్నీ నియంత్రించాలన్న దశాబ్దాల అమెరికా వ్యూహాన్ని ట్రంప్‌ అతివేగంగా, స్వల్పకాలంలోనే తలకిందులు చేసేశారు. ట్రంప్‌ తొలివిడత ఏలుబడిలో మోదీతో పెరిగిన సాన్నిహిత్యం, భారత్‌మీద ఆయన కురిపించిన ప్రత్యేక ప్రేమలూ విస్మరించలేనివి. ట్రంప్‌ ‘మగా’, భారత్‌ ‘మిగా’ కలసి ‘మెగా’ అయిందంటూ మోదీ మొన్న ఫిబ్రవరిలో చేసిన ప్రసంగం ఆ దోస్తీకీ అద్దంపట్టింది. కానీ, కొద్దినెలల్లోనే గాలి తిరిగిపోయింది. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపింది నేనేనని ట్రంప్‌ చెప్పుకోవడం, అవును నిజమేనంటూ పాకిస్థాన్‌ ప్రశంసించడం, ఆప్తమిత్రుడు మోదీ మాత్రం దానిని కాదనడం, ముప్పైసార్లు అదేపనిగా చెప్పుకుంటున్నా అవునని తలూపకపోవడం తెలిసిందే. నోబెల్‌శాంతికి నూరుశాతం అర్హుడనని అనుకుంటున్న ట్రంప్‌ అహన్ని దెబ్బతీసిన ఫలితమే ఈ సుంకాలూ భారత్‌కు డెడ్‌ ఎకానమీ అంటూ శాపాలూ అని విశ్లేషకుల వాదన. భారత్‌లాంటి మిత్రదేశాలను ట్రంప్‌ తన దూకుడు నిర్ణయాలతో దూరం చేసుకోవడం సరికాదని నిక్కీ హేలీ వంటివారు హితవులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఒక బలమైన సంఘటిత శక్తిని అమెరికా ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి మాజీ భద్రతాసలహాదారులు భయపడుతున్నారు. పాతస్నేహాలను గాలికొదిలేసి, శత్రువుకంటే అన్యాయంగా ట్రంప్‌ పరిగణిస్తున్న ఫలితంగానే ఇప్పుడు రష్యాతో రాసుకుపూసుకోవడానికీ, చైనాతో చేయి కలపడానికీ భారత్‌కు మరింత వీలుకలిగింది. ఆరేళ్ళ తరువాత మోదీ చైనా పర్యటనకు సిద్ధపడటమే కాక, పుతిన్‌తో టెలిఫోన్‌ సంభాషణ, ఆయన అక్టోబర్‌లో వస్తూండటం మార్పుకు నిదర్శనం. ఈ పరిణామాలన్నీ అంతిమంగా రష్యా–ఇండియా–చైనా (ఆర్‌ఐసి) త్రైపాక్షిక కూటమి పునరుద్ధరణకు మార్గాన్ని సుగమం చేస్తాయని అమెరికా మీద ఆగ్రహంతో ఉన్న విశ్లేషకుల నమ్మకం.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 01:49 AM