Share News

ఆశారేఖ...!

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:21 AM

తాను గద్దెదిగేలోగానే ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వారం క్రితం ఆశాభావం వెలిబుచ్చినప్పుడు...

ఆశారేఖ...!

తాను గద్దెదిగేలోగానే ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వారం క్రితం ఆశాభావం వెలిబుచ్చినప్పుడు ఎవరూ దానిని పట్టించుకోలేదు. బందీల అప్పగింతలకు సంబంధించి ఇరుపక్షాలూ తీవ్రమైన అడ్డంకులను అధిగమించాయని బైడెన్‌ అప్పట్లో సూచన ప్రాయంగా అన్నారు. చర్చలు కొలిక్కిరాకుండా హమాస్‌ అడ్డుపడుతోందని బైడెన్‌ అనగానే, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఖతార్‌, ఈజిప్ట్‌ అధికారులు మాత్రం అందుకు నెతన్యాహూ కారకుడన్నారు. వారం క్రితం బైడెన్‌ చెప్పింది ఇప్పుడు నిజమైందనీ, అడ్డంకులూ అభ్యంతరాలూ తొలగి ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని వార్తలు వింటున్నాం. ఈ శుభవార్తతో పాటుగానే, ఇజ్రాయెల్‌ మంత్రివర్గం ఇంకా సదరు ఒప్పందాన్ని ఆమోదించవలసి ఉందని, నెతన్యాహూ పలు వర్రీలూ కొర్రీలతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదావేస్తూ కొత్తకుట్రలకు తెరదీస్తున్నారన్న అనుమానాలు కూడా జోరుగా ప్రచారమవుతున్నాయి.


ఆదివారంనుంచి ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని ఖతార్‌ ప్రధాని షేక్‌ మహ్మద్‌ బిన్‌ అల్‌థానీ సగర్వంగా ప్రకటించిన కొద్దిగంటల్లోనే గాజామీద తీవ్రస్థాయిలో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఒప్పందం అమల్లోకి వచ్చేలోగా మరిన్ని ఊచకోతలు, కూల్చివేతలతో నెతన్యాహూ కక్షతీర్చుకుంటున్నారు. పదిహేను నెలల్లో యాభైవేలమందిని హతమార్చి, గాజాను స్మశానంగా తయారుచేసినా ఆయనకు ఇంకా తృప్తికలగలేదు. అనుకున్నట్టుగా ఆదివారంనుంచి ఒప్పందం అమల్లోకి వచ్చినపక్షంలో ఈ ఊచకోతలకు తాత్కాలికంగానైనా విరామం దక్కుతుంది. ప్రతి దశ ఆరువారాలచొప్పున మూడుదశల్లో అమలయ్యే ఈ ఒప్పందానికి గత ఏడాది మేనెలలో తాను చేసిన ప్రతిపాదనలే ప్రాతిపదికలని బైడెన్‌ అంటున్నారు. తొలి ఆరువారాలు ఇది గనుక సవ్యంగా అమలు జరిగితే, ఇజ్రాయెల్‌ బలగాలు గాజాను కనీసం కొంతమేరకు ఖాళీచేయడం, బందీల అప్పగింత గాడినపడటం మొదలవుతుంది. ప్రతీ ఏడురోజులకూ ఏ పక్షం ఎంతమందిని ఇచ్చిపుచ్చుకోవాలన్నది ఈ ఒప్పందంలో నిర్దిష్టంగా ఉంది. ఒప్పదం అమలులోకి రాగానే సహాయకచర్యలు ఊపందుకుంటాయి, నీరు, ఆహారం, విద్యుత్‌ ఇతరత్రా అవసరాలు తీరడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతాయి.


గత ఏడాదికాలంలో హమాస్‌ పలుమార్లు కాల్పుల విరమణకు దిగిరావడం, దానికి పూర్తి భిన్నంగా నియమనిబంధనల విషయంలో ఇజ్రాయెల్‌ ఏవో అడ్డంకులు పెడుతూండటం తెలిసిందే. బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిపించుకోవడంకంటే హమాస్‌ను దుంపనాశనం చేయడమే తన ప్రథమకర్తవ్యమని ప్రకటించి, యుద్ధాన్ని నెతన్యాహూ ఏడాదిన్నరపాటు కొనసాగించడంతో ఈ సంస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. సర్వశక్తిసంపన్నులనుకున్న దాని నాయకులంతా ఒక్కరొక్కరుగా రాలిపోయి, దాని సమస్తవ్యవస్థలూ కూలిపోయాయి. అప్పట్లో హమాస్‌ అపహరించుకుపోయినవారిలో ఓ అరవైమంది మాత్రమే ఇంకా దానివద్ద మిగిలి ఉన్నారని, వీరికి బదులుగా వందలాదిమంది పాలస్తీనియన్‌ ఖైదీలు విడుదలకాబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. మొదటి ఆరువారాల అనంతరం కూడా కాల్పుల విరమణ కచ్చితంగా కొనసాగించాలన్న లిఖితపూర్వకమైన అవగాహన ఏదీ ఈ ఒప్పందంలో ఇప్పటికైతే లేదట.


ఒప్పందం అమలులోకి వచ్చిన పదహారోరోజున తిరిగి చర్చలకు కూచొని, సమీక్షలతో మలిదశకు పురోగమించాల్సి ఉంటుంది. గత ఏడాది నవంబరులో స్వల్పకాలిక విరామం ఇస్తున్నట్టే ఇచ్చి, నెతన్యాహూ తిరిగి దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఒప్పందాన్ని వమ్ముచేసేందుకు ఆయన దగ్గర సవాలక్ష కారణాలు సిద్ధంగా ఉంటాయి. కాల్పుల విరమణ అన్న మాటకే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఆదినుంచీ బద్ధవ్యతిరేకి. యుద్ధం పూర్తిగా నిలిచిపోయినపక్షంలో తాను గద్దెదిగాల్సివస్తుందని, తన కూటమి ప్రభుత్వం అధికారంనుంచి తప్పుకొని ఎన్నికలకు పోవాల్సి ఉంటుందని ఆయన తెలుసు.

ప్రస్తుతానికి యుద్ధం ముగిసిపోలేదు కానీ, తొలి ఆరువారాలూ ఈ ఒప్పందం సవ్యంగా అమలైనపక్షంలో అందుకు అవకాశమైతే ఏర్పడుతుంది. ఈ ఒప్పందాన్ని కుదిర్చింది బైడెన్‌ కాదు, మరో ఐదురోజుల్లో అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించబోతున్న ట్రంప్‌ హెచ్చరికలతోనే నెతన్యాహూ ఎట్టకేలకు దిగివచ్చాడన్నది నిజమైతే మరీ మంచిది.

Updated Date - Jan 17 , 2025 | 05:59 AM