Share News

Telangana Infrastructure : పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:34 AM

రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, మధ్యలో రేడియల్ రోడ్లు, పారిశ్రామిక క్లస్టర్లు... ఇలా అనేక అంశాలకు సంబంధించి తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రి దావోస్ వేదికగా ఆవిష్కరించారు.

Telangana Infrastructure : పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ

రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, మధ్యలో రేడియల్ రోడ్లు, పారిశ్రామిక క్లస్టర్లు... ఇలా అనేక అంశాలకు సంబంధించి తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రి దావోస్ వేదికగా ఆవిష్కరించారు.

దావోస్ కేంద్రంగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు–2025లో గత ఏడాదితో పోలిస్తే తెలంగాణకు నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడులు పెట్టడానికి వివిధ సంస్థలు ఆసక్తి చూపించాయంటే ఆ ప్రయత్నంలో ప్రభుత్వం భారీ విజయం సాధించినట్టే. నాయకత్వ కృషి ఎంతో ఉంటే తప్ప పెట్టుబడులు రావు. నమ్మకం కలగందే పెట్టుబడులకు సంస్థలు కూడా ముందుకు రావు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ అన్న నినాదంతో అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు దోహదపడ్డాయి. అందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దావోస్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి నిరంతరం శ్రమించింది. పరిమితమైన సమయంలో క్షణం తీరికలేకుండా ప్రపంచ దిగ్గజాలతో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే ‘తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించడం ద్వారా అధిక పెట్టుబడులను ఆకర్షించాం. గత ఏడాది మా ప్రభుత్వం రూపొందించిన అనుకూల విధానాలే దీనికి కారణం’ అన్నారు. ఆయన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు తెలంగాణ పేరు ప్రపంచ వేదికలపై వినిపిస్తోంది. ఏకంగా రూ.1,78,950 కోట్ల విలువ చేసే పెట్టుబడులు తెలంగాణకు రావడమంటే ఆషామాషీ కాదు. వీటితో దాదాపు 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తుంది.

దావోస్‌లో ‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’ అన్న అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన సదస్సులోను, ‘రీఇమేజింగ్ అర్బన్ మొబిలిటీ–ట్రెండ్స్, ఇన్నోవేషన్స్ అండ్ ఆపర్చునిటీస్–2030 అండ్ బియాండ్’ అన్న అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), హెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులోను తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలను ప్రపంచ దిగ్గజాల ముందు ముఖ్యమంత్రి స్పష్టంగా ఆవిష్కరించారు. కమ్యూనికేషన్ రంగంలో శరవేగంగా వచ్చిన మార్పులను అందిపుచ్చుకోవడంలో రాజీవ్‌గాంధీని, సరళీకృత ఆర్థిక విధానాలతో దేశానికి మార్గనిర్దేశకులైన పీవీ నరసింహారావును, అలాగే హైదరాబాద్‌లో ఐటీ రంగ విస్తరణకు చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు, హైదరాబాద్ ఒక మహానగరంగా విస్తరించడానికి విస్తృతమైన మౌలిక సదుపాయాలు కల్పించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి నేతలు చూపిన బాటను కొనసాగిస్తామని, దేశాన్ని ఐదు ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి సంకల్పానికి తెలంగాణ వంతుగా నిలబడతామనీ దావోస్‌లో రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.

మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపైన మాట్లాడిన సందర్భంలో కూడా రేవంత్‌రెడ్డి తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ, అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీపడతామన్నారు. మూడు రాష్ట్రాల నుంచి గలగలా పారే కృష్ణా, గోదావరి నదులతో పోలుస్తూ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మూడు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన నాయకుడు రేవంత్‌రెడ్డి. ఆ మాటలు ప్రపంచ ఆర్థిక సదస్సు మోడరేటర్ సమీర్ శరణ్‌నే కాదు.. ఎంతో మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షించాయి. మూడు రోజుల దావోస్ పర్యటనలో రేవంత్‌రెడ్డి ఇదే ఒరవడిని కొనసాగించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన స్పీడ్ ఒక అసెట్.

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం గత ఏడాది కాలంలో దూరదృష్టితో అమలు చేస్తున్న ప్రణాళికలు పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగిస్తున్నాయి. కొత్తగా డేటా సెంటర్ల ఏర్పాటు లేదా విస్తరణకు ఆయా సంస్థలు చొరవ చూపడానికి అదీ ఒక కారణమే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను అందరికన్నా ముందుగా అందిపుచ్చుకుని హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి సదస్సును నిర్వహించడమే కాకుండా, ప్రత్యేకంగా ఏఐ సిటీ నిర్మించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆ రంగంలో విస్తరించాలన్న సంస్థల్లో విశ్వాసాన్ని పెంచింది. హైదరాబాద్ కేంద్ర బిందువుగా డేటా సెంటర్లను నెలకొల్పడానికి ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయంటే, అందుకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా నిలుస్తున్న తీరు ఆయా సంస్థలకు నమ్మకం కలిగిస్తున్నది.

ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడం, కాలుష్య కారక వాహనాలను తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. మూసీ ప్రక్షాళన కూడా హైదరాబాద్ నగర భవిష్యత్తుకు ఒక బృహత్తరమైన ప్రణాళిక. కొందరు కావాలని కూల్చివేతలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేసినప్పటికీ మరో వంద సంవత్సరాల పాటు హైదరాబాద్ కాలుష్య రహిత, పర్యావరణ హితమైన నగరంగా విలసిల్లాలని చేపట్టిందే మూసీ పునరుజ్జీవం. కాలుష్య కాసారంగా మారిన మూసీని ప్రక్షాళన చేసి, ఈ మహానగర నీటి అవసరాలను తీర్చడమే కాకుండా, నల్గొండ ప్రజల సాగునీరు వంటి అనేక విషయాలతో ముడిపడిన అంశాలను దావోస్ వేదికగా ముఖ్యమంత్రి వివరించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, మధ్యలో రేడియల్ రోడ్లు, పారిశ్రామిక క్లస్టర్లు... ఇలా అన్ని విషయాలకు సంబంధించి తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రి దావోస్ వేదికగా ఆవిష్కరించారు.


ప్రపంచ వేదికల్లో తెలంగాణ ఇమేజ్‌ని పెంచాలన్న ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో పెట్టుబడులను కొందరు హేళన చేస్తున్నారు. అయితే, రాష్ట్రానికి మంచి చేస్తున్నారా లేక రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నారా అన్నది ప్రజలు గమనిస్తూ ఉంటారు. హైదరాబాద్‌లో ఉన్న కంపెనీతో దావోస్‌లో ఒప్పందమేంటని కొందరు వ్యంగ్య ధోరణులు ప్రదర్శిస్తున్నారు. వారి హయాంలోనూ అదే జరిగినా, మరిచిపోయి నిస్సిగ్గుగా తెరమీదకు వస్తుంటారు. నిజానికి హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ విస్తరణకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసింది. ఆయా ప్రభుత్వాల నుంచి లభించే ప్రోత్సాహకాలు, అవకాశాలు, అపాయింట్‌మెంట్స్... ఒకటేమిటి అనేకానేక అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. వీటన్నింటికీ దావోస్ ఒక వేదికగా నిలుస్తుంది.

తమిళనాడులో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా ఒక సమస్య తెరమీదకొస్తే ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తాయి. తెలంగాణలోనూ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణంలో కలిసి రావాలని, అనుభవంతో కూడిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రతిసారీ అంటుంటారు. ప్రపంచ పటంలో తెలంగాణ, హైదరాబాద్‌లు ఉండాలని అందరూ ఆకాంక్షించాలి. పెట్టుబడులు వస్తున్నాయంటే హర్షించాలి.

‘మా పోటీ... ప్రపంచంతో’– ఈ మాట అనాలంటే ఎంతో దూరదృష్టి, ధైర్యం కావాలి. మార్గనిర్దేశం చేసే శక్తి, సామర్థ్యాలు ఉండాలి. తెలంగాణ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించడానికి జరుగుతున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా స్వాగతిద్దాం. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నందుకు గర్వపడదాం. తెలంగాణ పునర్నిర్మాణానికి అంకితమవుదాం.

n బోరెడ్డి అయోధ్యరెడ్డి

సీపీఆర్ఓ, తెలంగాణ ముఖ్యమంత్రి



Also Read-
Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..

Also Read-IT Raids on Tollywood: ఐటీ నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందేనా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2025 | 04:34 AM