Share News

యూరప్‌ హెచ్చరిక!

ABN , Publish Date - Jan 10 , 2025 | 06:00 AM

‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ అని ట్రంప్‌ నినదించడం వెనుక అంతరార్థాలు, అంతిమలక్ష్యాలు ఏమిటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఉన్న అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కంటే దురాక్రమణలతో...

యూరప్‌ హెచ్చరిక!

‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ అని ట్రంప్‌ నినదించడం వెనుక అంతరార్థాలు, అంతిమలక్ష్యాలు ఏమిటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఉన్న అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కంటే దురాక్రమణలతో ఆయన ఈ విడత మిగతా దేశాలను భయపెట్టబోతున్నాడని అర్థమవుతోంది. పనామా కాలువ మీదా, గ్రీన్‌ల్యాండ్స్‌ మీదా కన్నేసిన ఆయనను విలేఖరులు మంగళవారం ఓ కీలకమైన ప్రశ్నవేశారు. వాటిని సొంతం చేసుకోవడానికి సైన్యాన్ని వాడతారా? అన్నది ఆ ప్రశ్న. మరోమరో నాయకుడైతే ఈ ప్రశ్నకు తత్తరపడేవారేమో. డోనాల్డ్‌ ట్రంప్‌ తన సమాధానంలో సైనికదాడి అవకాశాన్ని తోసిపుచ్చలేదు. అమెరికా ఆర్థిక, రక్షణపరమైన ప్రయోజనాల పరిరక్షణకు ఆ కాలువ, ఆ మంచుఖండమూ అత్యంత ముఖ్యమని ఆయన మరోమారు ఉద్ఘాటించారు. అతిజాగ్రత్తగా మాట్లాడాలన్న తాపత్రయం ట్రంప్‌లో ఉండదు కనుక, ఆయన ఎజెండా స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్థికంతో తెగనప్పుడు, ఆయుధాల వాడకానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. అమెరికా పుట్టుకకు ముందే నామకరణం జరిగిపోయిన గల్ఫ్‌ ఆఫ్‌ మెగ్జికోను తాను గద్దెనెక్కగానే గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మార్చేస్తానని ప్రకటించే సాహసం ట్రంప్‌ మాత్రమే చేయగలరు. వందలాది సంవత్సరాలకు ముందు మొత్తం ఉత్తర అమెరికా అసలు పేరు మెగ్జికన్‌ అమెరికా గనుక అలా పిలుచుకుంటే మరింత తియ్యగా ఉంటుందని ఆ దేశాధినేత ట్రంప్‌కు కాస్తంత వెటకారంగా సమాధానం ఇచ్చారు.


గ్రీన్‌ల్యాండ్‌కోసం సైనికశక్తిని ఉపయోగించడం మీద నిర్దిష్టంగా ఏ హామీ ఇవ్వబోనని మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్షపదవిలో కూచోబోతున్న వ్యక్తి వ్యాఖ్యానించిన తరువాత కూడా మాట్లాడకపోతే యూరప్‌కు అప్రదిష్టే. ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని సవాలు చేసే ప్రయత్నాలను సహించేది లేదని ఫ్రాన్స్‌ వ్యాఖ్యానించింది. డెన్మార్క్‌లో ఆరువందలేళ్ళుగా అంతర్భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా దురాక్రమించుకుంటుందంటే నమ్మడం కష్టం, కానీ, కాలానుగుణంగా మనమూ మారినప్పుడే ఇటువంటి విపత్తులను తట్టుకొని నిలబడగలం అని ఫ్రాన్స్‌ విదేశాంగమంత్రి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. గ్రీన్‌ల్యాండ్‌ యూరప్‌ భూభాగం, దానిజోలికి ఎవరు వచ్చినా ఊరుకొనేది లేదు, దాడికి ఎంతపెద్ద దేశం ప్రయత్నించినా వదిలేది లేదు అని ఘాటుగా సమాధానం ఇచ్చారాయన. ట్రంప్‌ యుద్ధకండూతిని తప్పుబడుతూ, యూరోపియన్‌ యూనియన్‌ ఒక్కటిగా నిలవాలి, బలోపేతం కావాలన్నారు ఆయన. జర్మన్‌ చాన్సలర్‌ కూడా గట్టిగానే సమాధానం చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలు ఈయూ నేతలందరిలోనూ ఆందోళన కలిగించాయని, మనమంతా ఐకమత్యంగా ఉండాలని అన్నారాయన. గ్రీన్‌ల్యాండ్‌ జోలికి వస్తే పరస్పర రక్షణ సహకార ఒప్పందాన్ని అమలుచేయాల్సివస్తుందని యూరోపియన్‌ కమిషన్‌ కూడా గుర్తుచేసింది. ట్రంప్‌ దెబ్బకు జస్టిన్‌ ట్రూడోను సాగనంపిన కెనడా నేతలు కూడా ఆయన పలుమార్లు యాభైఒకటవ రాష్ట్రంగా తమదేశాన్ని అభివర్ణించడం భరించలేకపోతున్నారు. మీ జోకులు ఆపకుంటే ఊరుకొనేది లేదు అని గట్టిగా విరుచుకుపడుతున్నారు. అమెరికాలో విలీనమైతే కెనడాకు ఆర్థికంగానూ, భద్రతాపరంగానో ఎంత లాభమో వివరిస్తూ, కెనడాను స్వాధీనం చేసుకోవడం ఖాయమంటూ ఆయన ఇటీవలే మరోమారు ఉద్ఘాటించారు. మిగతా దురాక్రమణలకు ఆయుధాలనీ, సైన్యాన్ని వాడతానని అంటున్న అమెరికా అధ్యక్షుడు కెనడా విషయంలో మాత్రం ఆర్థికశక్తిని ప్రయోగిస్తానని కాస్తంత మినహాయింపు ఇచ్చారు.


సుంకాలను ఆయుధంగా మార్చి ట్రంప్‌ మిగతావారిని బెదిరిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను ఇవ్వకపోతే అత్యధిక సుంకాలతో డెన్మార్క్‌ను దెబ్బతీస్తానని, ఆయుధ ప్రయోగంతో దానిని స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. పనామా కాలువ, గ్రీన్‌ల్యాండ్‌, కెనడా వంటివి ఉపరితలంలో కనిపిస్తున్నాయి కానీ, తనకు గిట్టని, దారికి తేవాలనుకుంటున్న దేశాలన్నింటిపైనా ఆయన ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఒత్తిడి విధానాలు ఇంతకంటే బలంగా అమలవుతాయనడంలో సందేహం అక్కరలేదు. చిన్నాచితకా దేశాలను, దీవులను, మంచుఖండాలను కలిపేసుకుంటే ఆర్థికంగానూ, సైనికపరంగానూ బలపడవచ్చునని, రాయితీలు, మినహాయింపులు ఇస్తున్న దేశాలను మోయడం కంటే విలీనం చేసుకోవడం ఉత్తమమని ట్రంప్‌ ఆలోచన. ఆయన ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ ఈ మారు ఆధిపత్య, విస్తరణవాదాలతో మరింత ప్రమాదకరంగా పరిణమించబోతున్నది.

Updated Date - Jan 10 , 2025 | 06:24 AM