US Politics : అమెరికాలో ‘చెత్త’ రాజకీయాలు !
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:26 AM
అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కార్మికవర్గాన్ని ఆకర్షించబోయే శకటం ఒకటి ఇప్పుడు వార్తాంశం అయ్యింది. అది చెత్త సేకరించే వాహనం. చెత్త వాహనానికీ, దేశాధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికీ

అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కార్మికవర్గాన్ని ఆకర్షించబోయే శకటం ఒకటి ఇప్పుడు వార్తాంశం అయ్యింది. అది చెత్త సేకరించే వాహనం. చెత్త వాహనానికీ, దేశాధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికీ మధ్య విడదీయరాని ఎన్నికల ప్రచార బంధమే పెనవేసుకుని ఉంది. దేశాధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ని, ఆయన మద్దతుదారులనీ తక్కువ చేసి చూపే ఉద్దేశంతో అంతా ‘చెత్త’ అని అభివర్ణించారు. ట్రంప్‌ని తక్కువ చేయాలని చూసిన బైడెన్ వ్యూహం బెడిసికొట్టింది. చెత్త అనే మాటని పట్టుకుని, ట్రంప్ వెంటనే చెత్త సేకరించే ఓ వాహనాన్ని నడుపుతూ తన ఎన్నికల ప్రచారానికి వినూతన ఒరవడి పెట్టారు. ఈ దృశ్యం కార్మిక వర్గాన్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మిషిగన్, పెన్సిల్వేనియాలో చెత్త నినాదం బ్రహ్మాండంగా పేలింది. ట్రంప్ విజయంలో ఈ రెండూ చాలా కీలకం. ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆనాడు ఆయన నడిపిన చెత్త వాహనం డిట్రాయిట్ నుంచి వస్తోంది.
సరే, మరి మూడు రోజులలో గృహోన్ముఖం పట్టవలసిన అధ్యక్షుడు జో బైడెన్ నిజంగానే కొన్ని చెత్త మాటలు మాట్లాడారు. పోటీలో కొనసాగినట్టయితే తానే తప్పక విజేతగా నిలిచేవాడినన్నది ఆయన తాజాగా చేసిన ప్రకటన! ఇది ఎవ్వరూ ఊహించనిది! హర్షించనిదీ! చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే మరి. అవతల కాలిఫోర్నియా కార్చిచ్చుకు తగలబడుతుంటే ఈ పిచ్చి ప్రేలాపన ఏమిటో?! ఈ పైత్యానికి కొనసాగింపుగా డెమొక్రటిక్ పార్టీలో సమైక్యతను కాపాడడానికే పెద్దలు చెప్పడంతో తాను పోటీ నుంచి తప్పుకున్నట్టు బైడెన్ మరో ప్రకటన చేశారు. ఇంతకీ ఎవరా పెద్దలు? ఆ పెద్దలు నడిపిన చెత్త రాజకీయం ఏమిటి? తమకోసం ఏమీ చేయలేదని నల్లవారి శాపనార్థాలు మూటకట్టుకున్న ఒబామా ఒక పెద్ద అయితే, ఈ రోజు కాకపోతే రేపైనా తన జీవిత సహచరిణి అమెరికా అధ్యక్షురాలు కాకపోతుందా అని ఆశగా ఎదురుచూసిన బిల్ క్లింటన్ మరో పెద్ద! నిజమే, ఈ పెద్దలు అతిగా జోక్యం చేసుకోకపోతే ఆ పార్టీకి ఇన్ని కష్టాలు ఉండేవి కావేమో! ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ పెద్దలు తమ పెద్దరికాన్ని పార్టీ మీద రుద్ది, పార్టీ మనుగడని బలహీనపరిచారు. వర్తమాన రాజకీయ చిత్రాన్నే ఉదాహరణగా తీసుకుంటే పార్టీ అభ్యర్థిగా జో బైడెన్‌ను ఎంపిక చేయడానికి ముందు ఆయనతో పోటీ పడిన వ్యక్తి బెర్నీ సాండర్స్. కార్మిక వర్గంలో మంచి పట్టున్న నాయకుడు. బెర్నీ ఎక్కడకు వెళ్లినా మావాడు మంచివాడు అనే పేరు సంపాదించుకున్నాడు. విద్యార్థి దశలో ఉద్యమాలలో పాల్గొని, ఆ తర్వాత కార్మిక వర్గంతో మమేకమై కార్మిక వర్గ పక్షపాతిగా పేరు తెచ్చుకున్నాడు. వెర్మాంట్ సెనెటర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. 2016లో హిల్లరీ క్లింటన్‌పై, మళ్లీ 2020లో జో బైడెన్‌పై అమెరికా అధ్యక్ష పదవికి తలపడ్డారు. అన్ని విధాలా డెమొక్రటిక్ పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తుకు బంగారుబాట వేయగలిగిన సాండర్స్‌ను ఈ రెండు సందర్భాలలోనూ ఒబామా, క్లింటన్ ద్వయం బరి నుంచి ఉపసంహరించుకునేట్టు చెత్త యంత్రాంగం నడిపారు. సాండర్స్ నాయకత్వ లక్షణాలను కీర్తిస్తూనే ఆయనలోని ప్రగతిశీల భావజాలాన్ని ఒబామా, క్లింటన్ తిరస్కరించారు. సరే పెద్దలు చెబుతున్నారు కదా అని సాండర్స్ వెనుదిరిగారు. మరి హిల్లరీ క్లింటన్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా అంటే అదీ లేదు. ఎన్నికల ప్రచారంలో చాలా సందర్భాలలో అవాకులు చెవాకులు మామూలైపోయాయి. రిపబ్లికన్లు అంటేనే దేశానికి అరిష్టం అన్నట్టు ఆమె మాట్లాడేవారు. వెళ్లిన ప్రతిచోటా డాబూ దర్పం ప్రదర్శించడం ఆమె విజయావకాశాలను బాగా దెబ్బ తీసింది. డెమొక్రటిక్ పార్టీకి పట్టం కడితే తమ ఉపాధి అవకాశాలపైన తామే నీళ్లు పోసుకున్నట్టు అవుతుందని యువత భావించడం, మరొక పక్క డోనాల్డ్ ట్రంప్ అరచేతిలో వైకుంఠం చూపించడంతో ట్రంప్ విజయం నల్లేరుపై నడకే అయ్యింది. కాని అంత అద్భుతమైన విజయం దరిమిలా మరోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా చాలా తేలికగా గెలవవలసి ఉంది. కాని అలా జరగలేదు. 2020లో జరిగిన ఎన్నికలు జో బైడెన్‌ను అధికార పీఠంపై కూర్చోపెడితే, ఎన్నికల వ్యవస్థనే కూల్చే విఫలయత్నం ట్రంప్ చేశారు. ఆయన ఎంత బుకాయించినా, ఆయన పిలుపు మేరకే ఆయన మద్దతుదారులు వాషింగ్టన్ డి.సి.లోని కేపిటల్‌పై దాడి చేయడం మాయని మచ్చే. తన నడవడికతో, అతి వాచాలత్వంతో తన గొయ్యి తానే తవ్వుకునే పరిస్థితిని ట్రంప్ సృష్టించుకున్నాడు. అంతటితో అమెరికా చరిత్రలో ఆయన శకం ముగిసినట్టు అనిపించింది.
కాని అధ్యక్ష భవనంలో అడుగుపెట్టిన నాటి నుంచే జో బైడెన్ మతి స్థిమితం లేని మాటలు, చేతలూ కొట్టొచ్చినట్టు కనిపించాయి. బైడెన్ చేష్టలు పార్టీకి చెరుపు చేస్తాయని మొదటి వారంలోనే బెర్నీ సాండర్స్ డెమొక్రటిక్ పార్టీని హెచ్చరించారు. అయినా పెద్దలు కళ్లు తెరవలేదు. ఫలితంగా బైడెన్ ఇప్పుడు అత్యంత నిష్క్రియాశీలిగా అమెరికా చరిత్ర పుటలలో నిలిచిపోతున్నారు. ఆయన క్రిందపడడం, దేశాధినేతలు, దౌత్య ప్రతినిధులూ ఉన్నప్పుడు వారివైపు గాక అటు ఇటు దిక్కులు చూడడం వంటివి వయసుకు సంబంధించిన సమస్యలు కావచ్చు. వాటితో ఒక దేశాధ్యక్షుని పాలనా సామర్థ్యాన్ని అంచనా వేయడం సబబు కాదు గాని, ఈ నాలుగేళ్లూ ఏ విషయంపైనా స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పలేని వ్యక్తిగా అమెరికన్ ప్రజలు భావిస్తున్న మాట మాత్రం నిజం. ఎన్నో అపవాదులను మూటకట్టుకుని కూడా జో బైడెన్ చివరి రోజులలో తన కుమారుని సహా ఎందరికో క్షమాభిక్ష పెట్టడం దుస్సాహసాలలో మహా దుస్సాహసం! 2014 నుంచి 2024 మధ్య కాలంలో కుమారుడు హంటర్ బైడెన్ చేసిన ఎన్నో నేరాలకు తండ్రి క్షమాభిక్ష పెట్టడం చరిత్రలో ఎన్నడూ కనీవినని దృశ్యం. ఇంతకన్నా చెత్త నిర్ణయం మరొకటి ఉండదు. ఇంకా బ్యాంకులను మోసం చేసినవాళ్లకి కూడా జో బైడెన్ పదుల సంఖ్యలో క్షమాభిక్ష పెట్టడం మరో చెత్త నిర్ణయం. ఒక పక్క ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థి వలసలకు అడ్డుకట్ట వేస్తానంటుంటే, మరో పక్క బైడెన్ తీసుకున్న మరో నిర్ణయం చూసి అందరూ భృకుటి ముడుస్తున్నారు. ఎల్ సాల్వడార్ సహా కొన్ని దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చినవారికి సంవత్సరంన్నర పాటు తాత్కాలిక రక్షిత హోదా కల్పిస్తూ చివరి రోజులలో బైడెన్ తీసుకున్న నిర్ణయం కూడా సహజంగానే వివాదాస్పదంగా మారింది.
సరే, వర్తమానానికి కాస్త వెనక్కి వెళ్తే, కమలా హ్యారీస్ ఎంపిక విషయంలో సైతం ఈ పెద్దలు చేసిన జాప్యం ఆక్షేపణీయమే. మళ్ళీ నేనే... మళ్ళీ నేనే... అధ్యక్షుణ్ణి అవుతా... అంటూ బైడెన్ చిన్న పిల్లలు చోకొలేట్ కోసం మారాము చేసినట్టు అంటుంటే, ఇప్పటికే మీ వల్ల పార్టీ పరువు, పదవి పరువూ హుడ్సన్ నదిలో కలిసిపోయాయి, ఇక చాలు, బుద్ధిగా కూర్చొమ్మని చెప్పారా? లేదు. చివరివరకూ బైడెన్ ఆడింది ఆటగా పాడింది పాటగా అనుమతించారు. దేశాధ్యక్ష పదవికి ఒకసారి ఏ పార్టీ వారు ఎన్నికయినా అమెరికన్ ప్రజలు సంప్రదాయబద్ధంగా రెండోసారి కూడా వారినే ఎన్నుకుంటారు -ఎప్పుడో తప్ప! అలాగే తాను కూడా మళ్లీ గెలుస్తానని బైడెన్ ఆశ పడి ఉండవచ్చు. తప్పు లేదు. కాని పరిస్థితిని అంచనా వేయవలసిన పెద్దలకు ఏమైంది? తమ అభ్యర్థి విజయావకాశాలపై పార్టీ పెద్దలకు బ్రహ్మాండమైన విశ్వాసం ఉందా అంటే అటువంటిదేమీ లేదు. అయినా వారెవరూ బైడెన్‌ను కట్టడి చేయలేదు. ఈలోగా ట్రంప్‌పై ఆగంతకుని తూటా పేలడం, అది ఆయన తలను రాసుకుంటూ పక్కనుంచి పోవడం, అంతలోనే ట్రంప్ చేతులు పైకెత్తి నేనున్నాను అంటూ పైకి లేవడం... అంతా లిప్తకాలంలో జరిగిపోయాయి. ఇక ట్రంప్ అప్పటి నుంచి వెనుకకు తిరిగి చూసుకోనవసరం లేకపోయింది. అప్పటి ఎన్నికల ఊపు చూసి డెమొక్రటిక్ పార్టీ శ్రేణులు బెంబేలు ఎత్తిపోయి పార్టీకి ఒక్క పెన్నీ కూడా రాల్చని పరిస్థితి తలెత్తాక గాని పార్టీ పెద్దలు కళ్లు తెరవలేదు. వారికి జ్ఞానోదయం అయ్యేలోగా పరిస్థితి చేజారిపోయింది. అప్పుడు కమలా హ్యారిస్‌ను ఎంపిక చేసి, ఇక నువ్వు ఇంట్లో కూర్చునే సమయం వచ్చిందని బైడెన్‌కు నచ్చజెప్పారు. కమల కష్టపడింది గాని ఉపయోగం లేని పరిస్థితి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం ఏమిటన్నది అర్థం అయ్యేసరికి పుణ్యకాలం కాస్తా గడిచేపోయింది!
ఇప్పుడు, ట్రంప్ మళ్లీ విజయగర్వంతో అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండవసారి అధిరోహించబోతున్నారు. రిపబ్లికన్ పార్టీ శ్రేణులకు ఇంతకు మించిన పండుగ మరొకటి లేదు. ట్రంప్ మళ్ళీ పోటీ అయినా చేయగలరా అన్న అనుమాన దశ నుంచి ఆయన నాలుగేళ్ళ విరామం తరువాత ఏకంగా మళ్ళీ ఆ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. ఆయన వస్తున్నారంటేనే కొందరికి సింహస్వప్నం... మరి కొందరికి ఆక్షేపణీయం. అమెరికా అంటే భూతల స్వర్గం అనుకుని ఏదో రకంగా ఆ గడ్డమీద కాలు పెట్టాలని ఆశ పడేవారికి అది ఇక ముందు అంత తేలిక కాదు. కాని ఆయనపై దాదాపు 4000 పైనే రకరకాల కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులున్న దేశాధ్యక్షుడు మరొకరు లేరు. ఈ మధ్యే కోర్టు ఆయనకు దేశాధ్యక్షునిగా కొన్ని మినహాయింపులు ప్రకటించినా, అవి అధికార పరిధిలో ఆయన తీసుకునే నిర్ణయాలకే తప్ప వ్యక్తిగతంగా గతంలో చేసిన తప్పిదాలకు వర్తించవని కూడా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షులలో రెండుసార్లు అభిశంసనకు గురైన వ్యక్తి ట్రంప్ ఒక్కరే. అయితే రెండుసార్లూ ఆయనను సెనేట్ కాపాడింది. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో? ఆయన గత కాలపు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని పాలిస్తారా? లేక మరింత దూకుడుగా ముందుకు పోతారా?
మరో మూడు రోజులలో గృహోన్ముఖం పడుతున్న జో బైడెన్ అత్యంత నిష్ర్కియాశీలిగా అమెరికా చరిత్ర పుటలలో నిలిచిపోతున్నారు. అమెరికా అధ్యక్షులలో రెండుసార్లు అభిశంసనకు గురైన వ్యక్తి ట్రంప్ ఒక్కరే. ఆయన గత కాలపు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని పాలిస్తారా? లేక మరింత దూకుడుగా ముందుకు పోతారా?
---జగన్
(సీనియర్ జర్నలిస్ట్)