Share News

Pakistan Political Crisis,: ధిక్కార ధర్మం

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:07 AM

పాకిస్థాన్‌కు సైనిక పాలకులు కొత్త కాదు. ఆ మాటకొస్తే గతంలో పాకిస్థాన్‌ గడ్డపై విలసిల్లిన రాజ్యాలు చాలవరకు సైనికాధిపత్యంలో ఉత్థాన పతనాలకు లోనైనవేనని పాకిస్థాన్‌ చరిత్రకారుడు ఒకరు పేర్కొన్నారు. ఆ చిన్న రాజ్యాల పాలనా...

Pakistan Political Crisis,: ధిక్కార ధర్మం

పాకిస్థాన్‌కు సైనిక పాలకులు కొత్త కాదు. ఆ మాటకొస్తే గతంలో పాకిస్థాన్‌ గడ్డపై విలసిల్లిన రాజ్యాలు చాలవరకు సైనికాధిపత్యంలో ఉత్థాన పతనాలకు లోనైనవేనని పాకిస్థాన్‌ చరిత్రకారుడు ఒకరు పేర్కొన్నారు. ఆ చిన్న రాజ్యాల పాలనా సంప్రదాయాల వారసత్వం ఆధునిక పాకిస్థాన్‌లో సైతం కొనసాగుతున్న దృష్ట్యా ప్రస్తుత పాక్‌ను ‘ది ఫీల్డ్‌ మార్షల్‌ నేషన్‌’ అనడం సత్యదూరం కాదు.

జనరల్‌ ఆసీమ్‌ మునీర్‌ ఈనాటి పాకిస్థాన్‌ సరికొత్త కథా పురుషుడు. పాకిస్థాన్‌ రాజ్యాంగానికి ఇటీవల జరిగిన 27వ సవరణ ఆయన ‘ఫీల్డ్‌ మార్షల్‌’ హోదాను ఒక రాజ్యాంగబద్ధ పదవిగా మార్చివేసింది. త్రివిధ సాయుధ బలగాలపై ఆయనకు సర్వోన్నత అధికారాలను అప్పగించింది. గత వంద సంవత్సరాల కాలంలో ఏ ఆర్మీ జనరల్‌కు లభించని అపార అధికారాలు ఆయన చేతుల్లో కేంద్రీకృతమయ్యాయి. ఈ అపూర్వ అధికార లబ్ధిని ‘ప్రజాస్వామ్య బద్ధం’గా సాధించుకోవడం మునీర్ ప్రత్యేకత. జనరల్‌ జియా స్వప్నించిన, జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌ సాధించలేకపోయిన– పౌర పాలనపై సంపూర్ణ సైనిక నియంత్రణను సాధించిన ఘనత ఈ ఫీల్డ్‌ మార్షల్‌ది. పాక్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఏ జనరల్‌ కూడా ప్రతిష్ఠాత్మకంగా రంగం నుంచి నిష్క్రమించలేదు. మునీర్ కథ కూడా అప్రతిష్ఠాత్మకంగా పూర్ణ విరామానికి చేరవచ్చు. అయితే ఆ లోగా ఈ కొత్త పాక్‌ సైనిక నియంత నుంచి ఎదురయ్యే హానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ అత్యంత అప్రమత్తంగా ఉండి తీరాలి.

పాక్‌ రాజ్యాంగానికి 27వ సవరణ సర్వోన్నత అధికారాలను సైన్యానికి కట్టబెట్టడమే కాకుండా న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినీ సమాధి చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల స్వరూపస్వభావాలను పూర్తిగా మార్చివేసింది. రాజ్యాంగ సంబంధిత వివాదాలపై విచారణాధికారాలను సుప్రీంకోర్టు పరిధి నుంచి తొలగించారు. ఆ విషయాలపై విచారణకు ప్రత్యేక అధికారాలతో ఫెడరల్‌ కానిస్టిట్యూషనల్‌ కోర్టు అనే ప్రత్యేక సర్వోన్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామంతో హతాశులైన న్యాయవాదులు, న్యాయకోవిదులు ‘ఇలాగే అంత మొందుతుంది ప్రపంచం/ దభేల్మని కాదయ్యా/ కిర్రుమని మూలుగుతూ’ అన్న టి.ఎస్‌.ఎలియట్‌ మాటలను ఉటంకిస్తూ సుప్రీంకోర్టుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు! న్యాయమూర్తుల నియామకాల బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదే అయినప్పటికీ సంబంధిత నిర్ణయాలను నామమాత్ర పౌర ప్రభుత్వం వెనుక సమస్త అధికారాలను చెలాయించే సైనిక పాలకుడే ప్రభావితం చేస్తాడనడంలో సందేహం లేదు.


పాకిస్థాన్‌ సమాజంలో మొదటి నుంచీ సైనిక పాలకులను ధైర్యంగా ధిక్కరించి, ఎదిరించి న్యాయవ్యవస్థ స్వతంత్రతను, పౌర హక్కులను కాపాడిన ప్రశస్త చరిత్ర న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉన్నది. ఆ సమున్నత ధిక్కార సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రస్తుత సందర్భంలోనూ సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ సయ్యద్‌ మన్సూర్‌ అలీ షా, జస్టిస్‌ అథర్‌ మినల్లాలు రాజీనామా చేశారు. ఇంకా వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు కూడా రాజీనామా చేశారు. ముఖ్యంగా సీనియారిటీ దృష్ట్యా చీఫ్‌ జస్టిస్‌ అయ్యే అవకాశమున్న జస్టిస్ మన్సూర్‌ అలీ షా తన రాజీనామా లేఖలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పాక్ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయి. ‘27వ రాజ్యాంగ సవరణ పాకిస్థాన్‌ రాజ్యాంగంపై తీవ్రమైన దాడి. అది సుప్రీంకోర్టు సర్వోన్నత ప్రాధాన్యాన్ని తీసివేసింది. న్యాయవ్యవస్థను కార్యనిర్వాహకవర్గ నియంత్రణలోకి నెట్టివేసింది. మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య హృదయాన్ని చీల్చివేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఔన్నత్యానికీ, అంతిమ నిర్ణయాధికారానికీ విఘాతం కలిగించడం ద్వారా న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, సమగ్రతను కాలరాచివేసి దేశాన్ని దశాబ్దాల వెనక్కి తీసుకువెళ్లింది’ అని జస్టిస్ మన్సూర్‌ అలీ షా గర్హించారు. మన దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఒక కేసులో ‘వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు’ను కాపాడే విషయమై నిర్భయంగా మైనారిటీ తీర్పు వెలువరించి ఇప్పటికీ మన న్యాయవ్యవస్థకు ఒక నైతిక దీపస్తంభంగా వెలుగొందుతున్న జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నాతో జస్టిస్‌ మన్సూర్‌ అలీ షాను పోల్చవచ్చు.

ధిక్కారం నేటి చైతన్య మంత్రం. ప్రపంచవ్యాప్తంగా జెన్‌ జడ్‌ తిరుగుబాట్లు, పాక్‌ న్యాయ వ్యవస్థలో పరిణామాలపై ఉధృతమవుతున్న పోరు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అప్రజాస్వామిక, అమానుష సంకుచితత్వాలు ప్రబలిపోతున్న నేటి ప్రపంచంలో అధికార వ్యవస్థల నిరంకుశపోకడలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం అవ్వాల్సిన కాలమిది. ధర్మాగ్రహం పునాదిగా ఎగసే ధిక్కారం నిర్మాణాత్మకంగా ఉండేలా జాగ్రత్త వహించడం ప్రజలందరి విధి.

ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 20 , 2025 | 05:07 AM