Share News

రాజ్యాంగహితులేనా?

ABN , Publish Date - Feb 13 , 2025 | 06:01 AM

శాసనసభ ఆమోదించిన బిల్లుల మీద ఏ నిర్ణయం తీసుకోకుండా అంతకాలం ఎలా వదిలేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఇటీవల తమిళనాడు గవర్నర్‌ను ప్రశ్నించింది. గవర్నర్లు కేంద్రప్రభుత్వం...

రాజ్యాంగహితులేనా?

శాసనసభ ఆమోదించిన బిల్లుల మీద ఏ నిర్ణయం తీసుకోకుండా అంతకాలం ఎలా వదిలేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఇటీవల తమిళనాడు గవర్నర్‌ను ప్రశ్నించింది. గవర్నర్లు కేంద్రప్రభుత్వం ఏజెంట్లమాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షపాలిత రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆయా కేసుల వాదోపవాదాల సందర్భంగా న్యాయమూర్తులు ఆగ్రహాన్నీ, ఆవేదననూ, నిస్సహాయతనూ వ్యక్తంచేయడం చూస్తూనే ఉన్నాం. బలమైన రాజకీయ శత్రువు ఉన్నచోట గవర్నర్‌ కూడా నాలుగు ఆకులు ఎక్కువ చదివినవారే ఉంటారు. తమ తెలివితేటలనూ, శక్తియుక్తులను సంపూర్ణంగా వినియోగించి, ఆ రాష్ట్రాన్ని ఏలుతున్నవారిని వేధించుకుతింటూ, పాలనసాగనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడుతూంటారు. విస్తృతప్రజామోదంతో నెగ్గివచ్చినా కూడా సదరు పార్టీలు తాము కోరుకున్న చట్టాలు చేసుకోవడానికీ, నిర్ణయాలు తీసుకోవడానికి కొట్టుమిట్టాడాల్సిందే. నిన్నటికి నిన్న ఘోరంగా ఓడిపోయిన ఢిల్లీ కేజ్రీవాల్‌, బెంగాల్‌ మమత, కేరళ విజయన్‌, తమిళనాడు స్టాలిన్‌ వరకూ అందరిదీ ఒకే కథ. విపక్షపాలిత రాష్ట్రాల్లో ఏ గవర్నర్‌ అద్భుతమైన పనితీరు కనబరుస్తారో వారికి ప్రమోషన్‌ ఇచ్చి ఢిల్లీలో దేశ అత్యున్నత పదవులతో అలంకరించే సంప్రదాయం కూడా ఉంది.


తమిళనాడు గవర్నర్‌ ఎన్‌.రవి నిలిపివేసిన పన్నెండు బిల్లుల్లో ఒకటి 2020 జనవరి నాటిది. బిల్లులను సమ్మతించరు, పునఃపరిశీలనకు వెనక్కుపంపరు, రెండోసారి పంపిన బిల్లులను కచ్చితంగా ఆమోదించాలన్న ధర్మాన్ని కూడా పాటించరు అని రాష్ట్రప్రభుత్వం గత రెండేళ్ళుగా సుప్రీంకోర్టులో వాపోతోంది. ప్రభుత్వం పంపిన పన్నెండు బిల్లులను ఎటూతేల్చకుండా మూడేళ్ళు ఆపివేసి, గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టులో జవాబు చెప్పుకోవాల్సి వస్తుందన్న కారణంగా కొన్నింటిని రాష్ట్రపతికి పంపడం వంటి చర్యలు న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచాయి. ఆయన చర్యలు ఆర్టికల్‌ 200కు విరుద్ధమని గుర్తుచేస్తూ, గవర్నర్‌ అధికారాలు, విచక్షణల విస్తృతి గురించి అటార్నీ జనరల్‌ను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణలో భాగంగా పలు చక్కని వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌ అధికారాలను తగ్గించి చెప్పడం లేదని అంటూనే, బిల్లుల్ని ఆలస్యం చేయడంలో ఎన్‌. రవి తన సొంత విధానాన్ని అనుసరిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించి ఈ కేసులో తీర్పును రిజర్వుచేసింది.


అసెంబ్లీ రూపొందించిన అన్ని బిల్లులను గవర్నర్‌ ఆమోదించాల్సిన అవసరం లేదు. నచ్చినవాటికి సరేనని, నచ్చనివి తిప్పికొట్టవచ్చు. అవసరమైతే వివరణలు కోరవచ్చు, అంతిమంగా రాష్ట్రపతికీ నివేదించవచ్చు. ఈ మార్గాలన్నీ కాకుండా ఏళ్ళతరబడి తేల్చకుండా వదిలివేయడమంటే అది మరో రాజకీయపార్టీ మీద కక్షతీర్చుకోవడం కంటే, రాజ్యాంగాన్ని అవమానించడం అవుతుంది. చివరకు ఎటువంటి వ్యాఖ్యలు, వివరణలు లేకుండా బిల్లులు తిప్పికొట్టడం, నిలుపుచేస్తున్నామని చెప్పి, వెనక్కుపంపకపోవడం వంటి విన్యాసాలు కూడా జరిగాయి. ఒక బిల్లు ఉభయసభల్లో రెండోసారి ఆమోదం పొందితే, గవర్నర్‌ చెప్పిన మార్పుచేర్పులు అందులో జరిగినా, లేకున్నా దాని మీద ఆయన సంతకం చేయాల్సిందే తప్ప, తిప్పికొట్టడానికి వీల్లేదని ఆర్టికల్‌ 200 నిర్దేశిస్తోంది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు తన అసంతృప్తిని వెలిబుచ్చింది.


తీర్పులో సైతం బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్‌ అధికారాలూ పరిమితులమీద మరింత నిర్దిష్టమైన వ్యాఖ్యలు చేయవచ్చును. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు రాజ్యాంగేతర శక్తుల్లాగా, రాజకీయపార్టీ అధికారిక ప్రతినిధుల్లాగా వ్యవహరిస్తున్నప్పుడు న్యాయస్థానాలు ఒక పరిధికి మించి చేయగలిగేదేమీ ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల చేతుల్లోనే అధికారాలు ఉండాలి తప్ప, ప్రజలతో ప్రత్యక్షసంబంధం లేని నామమాత్రపు పెద్దల చేతుల్లో కాదు. రాష్ట్ర రాజకీయాల్లో తలదూ ర్చడం, పరోక్షపాలన సాగించడం, అర్థంపర్థంలేని వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వాలను అవమానించడం, రాష్ట్రపతిపాలన విధిస్తామని బెదిరించడం వంటి చేష్టలతో గవర్నర్లు హద్దులు దాటుతున్నారు, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు. గవర్నర్లమీద సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లోనూ, అక్కడ ఏమీ తేలక ప్రజాక్షేత్రంలోనూ విపక్షపార్టీలు పోరాడుతూండటం, ముఖ్యమంత్రులు నిరసనదీక్షల్లో కూర్చోవడం ప్రస్తుత ప్రజాస్వామ్యస్థితికి నిదర్శనం.

Updated Date - Feb 13 , 2025 | 06:01 AM