Share News

Davos Summit : దావోస్‌లో ఏపీ బ్రాండ్‌ ధగ ధగ!

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:43 AM

రాష్ట్రం అపారమైన అవకాశాలకు గని అని, సుదూర తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, విమాన సదుపాయాలు, పోర్టులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని దావోస్‌ సదస్సులో చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ఇటీవల తీసుకొచ్చిన పది పాలసీలను ఆయన తెలియజేసారు.

Davos Summit : దావోస్‌లో ఏపీ బ్రాండ్‌ ధగ ధగ!

రాష్ట్రం అపారమైన అవకాశాలకు గని అని, సుదూర తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, విమాన సదుపాయాలు, పోర్టులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని దావోస్‌ సదస్సులో చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ఇటీవల తీసుకొచ్చిన పది పాలసీలను ఆయన తెలియజేసారు.

ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపార దిగ్గజాలు, వివిధ దేశాల అధినేతలు పాల్గొనే దావోస్‌ ఆర్థిక సదస్సు పెట్టుబడులు ఆకర్షించేందుకు అద్భుతమైన అవకాశమున్న చోటు. ఇది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను ప్రపంచానికి ప్రమోట్ చేసే అద్భుతమైన వేదిక కూడా. మేధావులు, సామాజిక కార్యకర్తలు, ఆర్థిక నిపుణులు, పాత్రికేయులు పాల్గొనే అతి కీలకమైన సమావేశం అది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం రాష్ట్రంలో పెట్టుబడులు సాధనే లక్ష్యంగా దావోస్‌లో వివిధ వ్యాపార దిగ్గజాలతో వరుస భేటీలయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి వీలైనన్ని పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను ప్రపంచానికి ప్రమోట్ చేసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. భారీ పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికీకరణను కొత్త పుంతలు తొక్కించేందుకు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలను ఒప్పించి రాష్ట్రానికి రప్పించడానికి భగీరథ ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్.

రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రదేశమని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ ఆర్థిక ఫోరాన్ని చంద్రబాబు వేదికగా చేసుకున్నారు. ఏపీ అపారమైన అవకాశాల గని అని, వ్యవసాయ ఉత్పత్తులు, 1,053 కిలోమీటర్ల సుదూర తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, విమాన సదుపాయాలు, పోర్టులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, దేశంలో మరెక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేస్తామని పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇటీవల తీసుకొచ్చిన పది పాలసీలను దావోస్ వేదికగా ఆయన తెలియజేసారు. 74 ఏళ్ల వయస్సులో దావోస్‌లో గడ్డ కట్టే చలిలోనూ పర్యటించి దేశాధినేతలతోను, బిల్‌గేట్స్‌ నుంచి టాటా గ్రూపు చంద్రశేఖరన్‌, తదితర వ్యాపార దిగ్గజాలతో సమావేశమవుతూ ఐటీ నుంచి ఏఐ వరకు, విస్తృతంగా పెట్టుబడుల వేట సాగించారు చంద్రబాబు.


మాజీ సీఎం జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో దావోస్‌ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్ గల్లంతు అయి రాష్ట్రం నుంచి దావోస్‌లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం మాట దేవుడెరుగు. ఉన్న కంపెనీలను వెళ్లగొట్టడమే పనిగా జగన్‌ ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ విధానాలు, కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దూరం చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి దావోస్‌ సదస్సులో మళ్లీ ఏపీ బ్రాండ్‌ ధగ ధగ లాడింది. రాష్ట్రానికి పెట్టుబడులను, కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో దావోస్‌ పెవిలియన్లలో వరస సమావేశాలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విరామం లేకుండా గడిపారు. గ్రీన్‌, క్లీన్‌ ఎనర్జీకి ఏపీ గమ్యస్థానంగా మారిన తీరును దిగ్గజ కంపెనీలకు చెప్పి, సానుకూల స్పందనను రాబట్టారు. హైడ్రోజన్‌ హబ్‌, డేటా సెంటర్లు, గూగుల్‌ క్లౌడ్‌ విస్తరణ, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు పరిశ్రమ హోదా, ఇలా రాష్ట్రాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్న విధానాన్ని దావోస్‌ వేదికపై ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేశారు. స్విస్‌మెన్‌, ఓర్లికాన్‌, ఆంగ్స్‌ ఫిస్టర్‌, స్విస్‌ టెక్స్‌టైల్స్‌ యాజమాన్యాలతో చంద్రబాబు బృందం వరుస సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో రీసెర్చి సెంటర్‌ ఏర్పాటుకు స్విస్‌మెన్‌ సంస్థ ముందుకొచ్చింది. ఇన్నోవేషన్‌ హబ్‌లు, ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అడ్వాన్స్‌డ్‌ కోటింగ్‌ సొల్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఓర్లికాన్‌ మొగ్గుచూపింది. ఏఐ సెంటర్ల ఏర్పాటుపైనా ఆసక్తిని చూపింది.

అడ్వాన్స్‌డ్ సీలింగ్‌ సొల్యూషన్‌ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆంగ్స్‌ ఫిస్టర్‌ సంస్థను చంద్రబాబు కోరగా, ఆ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. రీసెర్చి టెక్స్‌టైల్‌ యూనిట్‌ ఏర్పాటుకు స్విస్‌ టెక్స్‌టైల్స్‌ కంపెనీ ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అదిపెద్ద సముద్రయాన రంగ సంస్థ మార్క్స్‌... ఏపీలోని సముద్రతీరం పట్ల ఆసక్తి చూపి త్వరలోనే పర్యటనకు వస్తామని హామీ ఇచ్చింది. విశాఖ, తిరుపతిలో కార్యకలాపాలను ప్రారంభించాలన్న చంద్రబాబు ఆహ్వానానికి సిస్కో సానుకూలంగా స్పందించింది. తిరుపతి, విశాఖలో సెమికండక్టర్‌ యూనిట్లను స్థాపించే విషయమై త్వరలో నిర్ణయం తెలుపుతామని దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్‌ సంస్థ సీఈవో పిన్‌హక్‌ చియోబ్‌ తెలిపారు. కార్ల్స్‌బెర్గ్‌ గ్రూప్‌ రాష్ట్రంలో పండ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సానుకూలత ప్రదర్శించింది. విశాఖ, అమరావతిలో గూగుల్‌ డిజైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా, గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో కురియన్‌ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్ని పెట్రోలియం హబ్‌గా మార్చే దిశలో భాగస్వాములమవుతామని పెట్రోనాస్‌ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో పెప్సికో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చైర్మన్‌ స్టీవెన్‌ కెహో సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆరోగ్య, విద్యారంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ఏపీని కేంద్రంగా మార్చే అంశాన్ని మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను కలిసి చంద్రబాబు చర్చించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌ డయాగ్నోస్టిక్స్‌ను నెలకొల్పేందుకూ, ఏఐ వర్సిటీ ఏర్పాటు చేసేందుకు బిల్‌గేట్స్‌ సమ్మతి తెలిపారు.


యువతకు బంగారు బాటలు వెయ్యాలని దావోస్‌లో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలయ్యారు ఐటీ మంత్రి లోకేష్. యువతకు ఉపాధి అవకాశాల్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో నాలుగు రోజులు విరామం లేకుండా దావోస్‌లో పర్యటించి పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, సీఈఓలతో వరుసగా సమావేశమయ్యారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో మంత్రి లోకేష్ సమావేశం అయి ఏపీని ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగంలో డీప్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం అనే విషయాన్ని స్పష్టం చేశారు. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో 22 లక్షల చదరపు అడుగుల కోవర్కింగ్ స్థలం అందుబాటులో ఉంది. కాగ్నిజెంట్ వృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం లాంటి ద్వితీయశ్రేణి నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించమని లోకేష్ కోరగా, త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు రవికుమార్. సంస్థలో పనిచేస్తున్న 80వేల మంది ఉద్యోగులను టైర్–1, టైర్–2 నగరాలకు మార్చేందుకు ప్రణాళికలు ప్రకటించాం. గ్లోబల్ స్కిల్ ఇనీషియేటివ్‌లో భాగంగా జెనరేటివ్ ఏఐ అధునాతన సాంకేతిక నైపుణ్యాల్లో 10 లక్షల మందికి సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అట్లాగే విద్యారంగంలో ప్రపంచస్థాయి శిక్షణకు సహకరించాలని వరల్డ్ ఎకనమిక్ పోరం న్యూఎకానమీ, సొసైటీ విభాగం ఎంగేజ్‌మెంట్, ఆపరేషన్స్ విభాగాధిపతి రవి గుత్తాను మంత్రి లోకేశ్ కోరారు. ఏపీలో విద్యారంగంలో గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు సహకరించాలని, పరిశ్రమల పరంగా అధునాతన శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేయమని కోరారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఛాంపియన్‌గా నిలపాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు కాలంతో పోటీ పడుతున్నారు.

నీరుకొండ ప్రసాద్



Also Read-
Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..

Also Read-IT Raids on Tollywood: ఐటీ నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందేనా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2025 | 04:43 AM