ఎవరికీ పట్టని బర్మా!
ABN , Publish Date - Feb 06 , 2025 | 04:32 AM
ఉక్రెయిన్, గాజా యుద్ధాల గురించి ఆ మాత్రమైనా పట్టించుకున్న మిగతా ప్రపంచం, పేదదేశం కావడంవల్లనేమో మయన్మార్‌లో సైనికపాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజాపోరాటాన్ని...
ఉక్రెయిన్, గాజా యుద్ధాల గురించి ఆ మాత్రమైనా పట్టించుకున్న మిగతా ప్రపంచం, పేదదేశం కావడంవల్లనేమో మయన్మార్‌లో సైనికపాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజాపోరాటాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి, దేశాన్ని సైనికపాలకులు హస్తగతం చేసుకొన్న ఈ నాలుగేళ్ళలో మయన్మార్‌లో పరిస్థితులు బాగా దిగజారాయి. సాగుతున్న అంతర్యుద్ధంలో సైనిక ప్రభుత్వం మరింత బలహీనపడిందన్న వార్తలు వినబడుతున్నా, ఎవరిదో ఒకరిది పైచేయిగా సమీపకాలంలో పోరు ముగిసే సూచనలైతే లేవు.
నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డి) నాయకురాలు ఆంగ్‌సాన్ సూచీ మరోమారు మరింత మెజారిటీ సాధించడం మయన్మార్ సైనికాధికారులు సహించలేకపోయారు. నామమాత్రపు ప్రజాస్వామ్యాన్నీ, పరిమిత అధికారాలనూ ఇచ్చినా ప్రజలు ఆమెకు తిరిగి ఘనంగా పట్టం కట్టడం వారికి నచ్చలేదు. ఆమె మాటకు అడ్డంకొట్టగల, ప్రతీ నిర్ణయాన్నీ సమీక్షించి, నిలిపివేయగల విశేషాధికారాలు వారివద్దనే ఉన్నా, ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకున్న ప్రేమాదరాలతో మలివిడతలోనూ ఆమె బలంగా నెగ్గుకురావడంతో సైనికాధికారులకు బెంగపట్టుకుంది. ఆమె కొనసాగితే తమ ఉనికికి ముప్పువస్తుందని భయపడ్డారు, అర్ధరాత్రి కుట్రతో అధికారంనుంచి దించేసి, తిరిగి నిర్బంధంలోకి నెట్టేశారు. పదవినైతే లాక్కున్నారు కానీ, ఆ తరువాత దేశవ్యాప్తంగా రేగిన పోరాటాలను వారు నియంత్రించలేకపోయారు. దేశం నలుమూలల్లోనూ వేర్వేరు ఆశలూ లక్ష్యాలతో వివిధ సంస్థలు సాగిస్తున్న పోరాటాలతో దేశం కల్లోలంలోకి జారిపోయింది. త్రీ బ్రదర్‌హుడ్ అలయెన్స్ గొడుగుకింద మూడు గ్రూపులు ప్రధానంగా సైన్యంతో పోరాడుతున్నాయి. భారత్–బంగ్లా సరిహద్దుల్లోని రఖైన్ ప్రాంతంమీద అరకన్ ఆర్మీ ఆధిపత్యం సాధించింది. దీనిసాయంతో చిన్ బ్రదర్‌హుడ్ అలయెన్స్ అనే సంస్థ చిన్ రాష్ట్రం మీద పట్టుసాధించింది. రఖైన్–చిన్ ప్రాంతాలు మిజోరం, మణిపూర్‌తో సరిహద్దులు పంచుకుంటున్నందున ఈ అంతర్యుద్ధం ప్రభావాన్ని మనం అనునిత్యం భరిస్తున్నాం. తిరుగుబాటుదారులతో సహా సామాన్యజనం నుంచి సైనికులవరకూ అంతా హద్దులు దాటివస్తున్నారు. వేలాదిమంది చిన్–కుకీలు ఆశ్రయం పొందుతూంటే, పోరాటంలో ఉన్నవారిని వెనక్కునెట్టడం నిత్యకృత్యంగా సాగుతోంది. చైనా సరిహద్దులోని షాన్ ప్రాంతం మరో రెండు సాయుధ సంస్థల చేతుల్లో ఉంది. సైనికపాలన తొలగి, సూచీ నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిస్తున్నవారు సైతం ఆయుధాలు పట్టి ఈ పోరాటంలో భాగస్వాములుగా ఉన్నారు.
ప్రస్తుతం దేశంలోని అధికభాగం తిరుగుబాటుదారుల హస్తగతమైపోయిందని, సైనికపాలకుల చేతిలో ఐదోవంతు కూడా మిగల్లేదని వార్తలు వస్తున్నాయి. ఇది పూర్తిగా నిజమైనా కాకున్నా, చైనా ఆర్థిక, ఆయుధసాయంతో సైనిక ప్రభుత్వం ఆఖరువరకూ తన ఆధిపత్యం నిలబెట్టుకొనే ప్రయత్నంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. తిరుగుబాటుదారులపక్షం వహిస్తున్నారన్న పేరిట గ్రామాలకు గ్రామాలు తగలబెడుతోంది. ఈ అంతర్యుద్ధం కారణంగా నలభైలక్షలమంది నిరాశ్రయులైనారని, సగం జనాభా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నదని అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. రఖైన్ వంటి రాష్ట్రాలు ఆకలితో అల్లాడిపోతున్నాయని, రోహింగ్యాలు అటు సైన్యానికీ, ఇటు అరాకన్ ఆర్మీకీ మధ్య నలిగిపోతున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాన నగరాలు ఇంకా సైన్యం అధీనంలోనే ఉన్నందున, బలవంతపు నియామకాలతో బలాన్ని పెంచుకుంటున్నందునా సమీపకాలంలో యుద్ధం ఆగే సూచనలైతే లేవు. గద్దెదిగడం ఇష్టంలేక, ఓటమిని జీర్ణించుకోలేక ప్రతీకారవాంఛతో రగిలిపోతున్న సైన్యం మరింత అమానవీయంగా ప్రవర్తిస్తోంది. సైనికపాలకుల మధ్య లుకలుకలు ఆరంభమైనాయన్న వార్తల నేపథ్యంలో మిగతా ప్రపంచం మయన్మార్‌మీద దృష్టిసారించాల్సిన తరుణం ఇది. సైనికపాలకులకు కొన్ని రాయితీలు, రక్షణలకు హామీ పడుతూ త్వరితగతిన దారికి తీసుకురావడం అవసరం. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా సైనికపాలకులు ఒక కొత్తనాటకానికి ఈమధ్యనే తెరదీశారు. సామాన్యజనం, తిరుగుబాటుదారులు గత అనుభవాల దృష్ట్యా దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. 82 శాతం సీట్లు గెలుచుకున్న ఆంగ్‌సాన్ సూచీని మూడునెలల్లోనే గద్దెదింపిన సైనికపాలకులు తిరిగి ఎన్నికల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఏ మాత్రం విశ్వసనీయతలేని ఈ ఎన్నికలు జరిగి కూడా ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ ప్రయోజనం ఉండదు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..