Share News

సామాన్యులూ సంపన్నులూ

ABN , Publish Date - Jan 23 , 2025 | 05:43 AM

ఆర్థిక అసమానతలు మూడు విధాలుగా కనిపిస్తాయి: భిన్న ఖండాలు, వేర్వేరు దేశాలలోని సమాజాల మధ్య వ్యత్యాసాలు; ఒక దేశం లేదా ఒక రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల మధ్య తేడాలు; ఒక సామాజిక సమూహంలోని...

సామాన్యులూ సంపన్నులూ

ఆర్థిక అసమానతలు మూడు విధాలుగా కనిపిస్తాయి: భిన్న ఖండాలు, వేర్వేరు దేశాలలోని సమాజాల మధ్య వ్యత్యాసాలు; ఒక దేశం లేదా ఒక రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల మధ్య తేడాలు; ఒక సామాజిక సమూహంలోని అత్యధికులు అయిన పేదలు, స్వల్ప సంఖ్యలో ఉండే ధనికుల మధ్య అంతరాలు. మానవాళి ప్రస్థానాన్ని పరిశీలిస్తే మూడోరీతి అసమానతలు నాగరికత ప్రభవించిన నాటి నుంచే ఆరంభమయ్యాయని, అవి కాలక్రమేణా పెరిగాయని, ఇప్పటికీ తీవ్రమవుతూనే ఉన్నాయని అర్థమవుతుంది. మరి మొదటి తరహా అసమానతలకు వలసవాద పాలన కారణమన్న భావన సబబైనదేనని ఆర్థికవేత్తలు, చరిత్రకారులు అంటున్నారు. వలసవాద పాలన నుంచి లబ్ధి పొందినవి పాశ్చాత్య దేశాలు, నష్టపోయినవి ప్రాచ్య దేశాలు. ఆసియా, ఆఫ్రికా దేశాలపై యూరోపియన్‌ రాజ్యాల వలసవాద ఆధిపత్యమే అవి సంపద్వంతం కావడానికి విశేషంగా దోహదం చేసింది. శతాబ్దాల పాటు ఆ పాశ్చాత్య దేశాలు ప్రాచ్య దేశాలను అన్ని విధాల దోపిడీ చేసి అణచివేశాయి. స్పెయిన్‌, పోర్చుగీస్‌, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం, జర్మనీ, రష్యా మొదలైన యూరోపియన్‌ దేశాలేకాక, ఆధునిక యుగంలో తొలుత వలసవాద పాలనకు గురైన అమెరికా సైతం ఈ ధరిత్రిపై ఏదో ఒక ప్రాంతాన్ని దురాక్రమించాయి. 1765–1900 సంవత్సరాల మధ్య మన దేశం నుంచి బ్రిటన్‌ 64.82 ట్రిలియన్‌ పౌండ్ల విలువైన ఆస్తులను తరలించుకుపోయింది. ఇందులో 38.8 ట్రిలియన్‌ పౌండ్ల మేరకు ఆ దేశంలోని పదిశాతం సంపన్నులు లబ్ధి పొందారు. మన దేశంలో కొల్లగొట్టిన ధనరాశులే ఇంగ్లాండ్‌ను సంపద్వంతం చేశాయి.


వలసవాద ఆధిపత్యం ఒక చారిత్రక దురాగతం మాత్రమే కాదు, అది వర్తమాన ప్రపంచాన్నీ పీడిస్తున్న అధర్మం. ఈ సత్యాన్నే ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ (ప్రపంచ వ్యాప్తంగా పేదరికం నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న 21 స్వతంత్ర ప్రభుత్వేతేర సంస్థల సమాఖ్య) తాజా నివేదిక ‘టేకర్స్‌, నాట్‌ మేకర్స్‌: ద అన్‌జస్ట్‌ పావర్టీ అండ్‌ అన్‌ఎర్న్‌డ్‌ వెల్త్‌ ఆఫ్‌ కలోనియల్‌ ఇన్హెరిటన్స్‌’ విపులంగా విశదీకరించింది. ఆధునిక బహుళజాతి సంస్థలన్నీ ఒకనాడు మన దేశాన్ని పీడించి పాలించిన ఈస్టిండియా కంపెనీ లాంటివేనని ఆ నివేదిక స్పష్టం చేసింది. పేద దేశాల సహజ వనరులను, శ్రమశక్తిని విపరీతంగా దోపీడీ చేయడం వల్లనే వాటి మాతృదేశాలు సిరిసంపదలతో తులతూగుతున్నాయని నివేదిక పేర్కొంది. సామాన్యుల శ్రేయస్సును ఉపేక్షించి, అతి కొద్దిమంది సంపన్నుల ప్రయోజనాలను కాపాడే విధంగా దేశ దేశాల ఆర్థికవ్యవస్థలను అవి ప్రభావితం చేశాయని, చేస్తున్నాయని, తత్కారణంగానే ఆర్థిక అసమానతలు అంతులేని రీతిలో పెచ్చరిల్లిపోతున్నాయని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. 2024లో బిలియనీర్ల ఆస్తులు 2023లో కంటే మూడు రెట్లు పెరిగాయి. ఒక సంవత్సర కాలంలో మహా కుబేరుల మొత్తం ఆస్తులు 2 లక్షల కోట్ల డాలర్లకు పైగా పెరిగాయి. ఇదే కాలంలో 204 మంది కొత్త బిలియనీర్లు ఆవిర్భవించారు. ఈ మహా కుబేరులు ఎలా ప్రభవించారు? వారి అపార ధనరాశులు ఎలా వచ్చాయి? ఆ వేల కోట్ల ఆస్తులు వారు కష్టపడి సంపాదించుకున్నవి కాదని, అవి వారు ఆర్జించని ఆస్తులేనని ఆ నివేదిక పేర్కొంది. వారసత్వం, గుత్తాధిపత్యం, ఆశ్రిత పక్షపాతం ద్వారా వారికి ఆ ఆస్తులు సమకూరాయి. పూర్తిగా అవినీతి మార్గాలలోనే వారు బిలియనీర్లు కావడం జరిగింది. పచ్చి నిజం ఏమిటంటే తమకే పూర్తిగా అనుకూలంగా ఉండేలా రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలను వారు అన్నివిధాల ప్రభావితం చేయగలుగుతున్నారు. ఈ పరిణామాలు సామాన్యులు, సంపన్నుల మధ్య, పేద, ధనిక దేశాల మధ్య ఆర్థిక అసమానతలను పెంచుతున్నాయి. సామాన్యులు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. సంపన్న దేశాలలోని 1 శాతం ధనికులకు పేద దేశాల వారు గంటకు 30 మిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నట్టు పారిస్‌లోని ఇనెక్వాలిటీ ల్యాబ్‌ పరిశోధకులు ధ్రువీకరించినట్టు ఈ నివేదిక పేర్కొంది. సంపన్న దేశాలు చేస్తున్న ప్రతి ఒక డాలర్‌ సహాయానికి పేద దేశాలు నాలుగు డాలర్లు చెల్లిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక అసమానతలు పెరిగిపోకుండా ఎలా ఉంటాయి? కనుకనే రాజకీయ వలసాధిపత్యం నుంచి ఏనాడో విముక్తమైన ఎన్నో దేశాలు నేడు ఆర్థిక వలసాధిపత్యానికి అణగారిపోతున్నాయి.


ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పరిపూర్తి గడువు (2030 సంవత్సరం) సమీపిస్తున్నది. ఆ లక్ష్యాల పరమార్థమైన ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని మానవాళి సాధించుకోగలుగుతుందా? ఒక సమాజంలోని సకల వ్యక్తులు, జనసముదాయాలు తమ ప్రాకృతిక, సామాజిక వనరులను వినియోగించుకోవడంలో సమరీతిలో భాగస్వాములు కావడమే ఆర్థిక ప్రజాస్వామ్యం. ఈ సముదాత్త పరిస్థితిని నెలకొల్పుకునేందుకై తొలుత ఆర్థిక అసమానతలను గణనీయంగా తగ్గించుకునేందుకు అన్ని ప్రభుత్వాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని నివేదిక పేర్కొంది. ఒకనాడు వలసాధిపత్యం చెలాయించిన దేశాలన్నీ తాము చేసిన అన్యాయాలన్నిటికీ బాధిత దేశాలకు క్షమాపణలు చెప్పాలి. చారిత్రక మనస్తాపాలు విస్మరించి అన్ని దేశాలు కలసికట్టుగా సాగడానికి ఈ చర్య ఒక నైతిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. మరింత ముఖ్యంగా, పేద దేశాలు ప్రాంతీయ సహకార సంస్థలుగా ఏర్పడి ధనికదేశాలపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రాధాన్యమివ్వాలని ఆక్స్‌ఫామ్‌ సూచించింది.

Updated Date - Jan 23 , 2025 | 05:43 AM