బీరేన్ తరువాత...
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:25 AM
మణిపూర్ మండిపోతున్నప్పుడూ, ఊచకోతలు ఎడతెగకుండా సాగుతున్నప్పుడే బీరేన్ రాజీనామా చేసివుంటే మరింత బాగుండేది. విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో...

మణిపూర్ మండిపోతున్నప్పుడూ, ఊచకోతలు ఎడతెగకుండా సాగుతున్నప్పుడే బీరేన్ రాజీనామా చేసివుంటే మరింత బాగుండేది. విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తమ ముఖ్యమంత్రి ఓడిపోవడం ఖాయమన్న భయంతో బీజేపీ పెద్దలు ముందే ఆయనను గద్దెదింపేశారు. అధిష్ఠానం ఆశీస్సులు ఏమాత్రం ఉన్నా తిమ్మినిబమ్మిని చేసి అధికారంలో కొనసాగగల సమర్థత బీరేన్‌కు లేకపోలేదు. కానీ, స్పీకర్ కేంద్రంగా సొంతపార్టీలో అసమ్మతి రాజుకుంటున్నప్పుడు ఎత్తులు వేయగల, ఎవరినీ నమ్మగల స్థితిలో పార్టీ అధిష్ఠానమే లేదు. మీతీలను ఆయుధాలు దోచుకోనివ్వండి, లూటీలు చేయనివ్వండి అని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించింది నిజమేనని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదిక తేల్చిన తరువాత కూడా ఆయనను కొనసాగనివ్వడానికి చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. విపక్షంతో చేతులు కలిపి, వారంతా బీరేన్‌ను దింపివేసినపక్షంలో పార్టీ పెద్దలకు అంతకంటే అవమానం ఇంకేమీ ఉండదు. తెగలమధ్య తగవులుపెట్టి 650రోజులపాటు రాష్ట్రాన్ని రగల్చిన బీరేన్ సింగ్ చివరకు హోంమంత్రి దర్శనం కరువై, మహాకుంభమేళాలో మునిగి, బలవంతపు రాజీనామాతో నిష్క్రమించాల్సి వచ్చింది.
21నెలల హింసారిరంసల అనంతరం ఆయనను వదల్చుకున్న పార్టీ అధిష్ఠానం తెలివిగా అవిశ్వాస తీర్మానానికి ముందే ఆయనను దింపివేసి, వెనువెంటనే అసెంబ్లీ సమావేశాలనూ రద్దుచేసింది. రెండు సమావేశాల మధ్య గడువు ఆర్నెల్లకంటే ఎక్కువ ఉండకూడదని మీకు తెలియదా? అని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు మణిపూర్ గవర్నర్‌ను ప్రశ్నిస్తున్నారు. సమావేశాల రద్దు రాజ్యాంగ విరుద్ధం కావచ్చునేమో కానీ, బీరేన్ రాజీనామా తరువాత కూడా రాష్ట్రమూ, రాజకీయమూ విపక్షాల చేతుల్లోకి పోకుండా బీజేపీ ఇలా జాగ్రత్తపడింది. బీరేన్ స్థానంలో ఎవరిని నియమించాలో బీజేపీ ఇంకా తేల్చుకోలేదని, సంబిత్ పాత్ర చర్చోపచర్చలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం చేజారిపోకుండా ముందే జాగ్రత్తపడిన అధిష్ఠానం బీరేన్‌స్థానంలో ఎవరినీ కూచోబెట్టబోవడం లేదని, అంతిమంగా రాష్ట్రపతిపాలన విధించడం ద్వారా ఈ నాటకాన్ని రక్తికట్టిస్తారని వినికిడి.
సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న టేపుల్లో బీరేన్ గొంతు 93శాతం సరిపోలిందని ట్రూత్ ల్యాబ్స్ నిర్థారించిన ఐదురోజుల్లోనే ఆయన తప్పుకున్నారు. అది ప్రైవేటు సంస్థ కనుక, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్) లో పరీక్షచేయించాలని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు చెప్పుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరి కాస్తంత సమయం సంపాదించిపెట్టారు. కానీ, జస్టిస్ ఖన్నా ఇచ్చింది మూడువారాల గడువే కనుక, సదరు ప్రభుత్వ సంస్థనుంచి ఇందుకు పూర్తివిరుద్ధమైన నివేదిక వస్తే తప్ప సుప్రీంకోర్టు నుంచి బీరేన్‌ను కాపాడటం అసాధ్యం. ఆయన ఆదివాసీ వ్యతిరేక, మీతీ అనుకూల వైఖరులు, విధానాలు పూర్తిగా ఆయన సొంతం కాదని, ఢిల్లీపెద్దల రక్షణల మధ్య ఆయన చెలరేగిపోయారని అందరికీ తెలుసు. పోలీసుల సహకారంతో, వారు అందించిన, వారినుంచి దోచుకున్న ఆయుధాలతో వారి వాహనాల్లోనే ప్రయాణిస్తూ మీతీ మిలిటెంట్ గ్రూపులు కుకీలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలను ఈ ఆడియోటేపులు నిజమని నిర్థారిస్తున్న నేపథ్యంలో, రేపు సర్వోన్నత న్యాయస్థానంలో బీరేన్ ఇరుక్కోవడం ఖాయం. కేంద్రప్రభుత్వ ప్రతినిధులకు, కమిటీలకు ఈ టేపులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో, కుకీ హ్యూమన్‌రైట్స్ ఆర్గనైజేషన్ (కోహుర్) సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. మణిపూర్‌లో 21 నెలలుగా జరుగుతున్నదేమిటో ఈ టేపులు తేల్చేశాయి. బీరేన్‌కు అండగా ఉంటున్న బీజేపీ పెద్దలను కూడా బోనులో నిలబెట్టాయి. సుప్రీంకోర్టు చొరవ లేనిదే ఈ పరిణామాలు ఉండేవి కావు.
బీరేన్ తప్పుకోవాలని ఆదివాసీ తెగలు ఎప్పటినుంచో డిమాండ్‌చేస్తున్నందున, ఇప్పుడు వాళ్ళు కాస్తంత శాంతపడవచ్చు. ఒకపక్క బర్మాలో సాగుతున్న అంతర్యుద్ధం మణిపూర్‌ను మరింత రాజేస్తుంటే, ఈ రాష్ట్రం కారణంగా ఈశాన్యమంతా ప్రమాదకరంగా తయారైందని అధ్యయనాలు చెబుతున్నాయి. వేలాదిమంది కేంద్రబలగాలతో ఇంతకాలం సాధించలేనిది బీరేన్ నిష్క్రమణతో మొదలుకావచ్చును. కేవలం హింస ఆగినంతమాత్రాన శాంతి నెలకొన్నట్టు కాదు. బీరేన్ కారణంగా నిలువుగా చీలిపోయిన సమాజం ఒక్కటికావాలి. వారూ వీరూ తేడా లేకుండా ప్రతీ మిలిటెంట్ గ్రూపునుంచీ ఆయుధాల స్వాధీనం జరగాలి. గాలివార్తలకు గ్రామాలు తగలబడుతూ, అనుమానాలు, భయాల మధ్య పరస్పర అవిశ్వాసంతో ఎవరికివారుగా ఉంటున్న అన్ని తెగలూ, జాతులూ సొంతిళ్ళకు చేరి, సయోధ్యతో జీవించగలగాలి. బీరేన్ వారసుడిగా ఓ కుకీని నియమించినా, గవర్నర్ ఏలుబడి సాగినా మణిపూర్‌కు కేంద్రప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్దడం అంత సులభం కాదు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For Telangana News And Telugu News