Share News

Inspiration : పని, జీవితం.. సమతుల్యత ఎలా?

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:30 AM

ఆలోచించేలా నన్ను ప్రేరేపించే లేదా రెచ్చగొట్టే వాళ్లను నేను అభిమానిస్తాను. వారి అభిప్రాయాలలో కొన్నిటిని నేను అంగీకరించకపోవచ్చు గాని అవి నన్ను నా ఆలోచనల నుంచి విరామం తీసుకుని

Inspiration : పని, జీవితం.. సమతుల్యత ఎలా?

ఆలోచించేలా నన్ను ప్రేరేపించే లేదా రెచ్చగొట్టే వాళ్లను నేను అభిమానిస్తాను. వారి అభిప్రాయాలలో కొన్నిటిని నేను అంగీకరించకపోవచ్చు గాని అవి నన్ను నా ఆలోచనల నుంచి విరామం తీసుకుని మననశీలమయ్యేలా, పునరాలోచించేలా చేసినందుకు నేను సంతోషపడతాను. అలా ఆలోచనలు పురిగొల్పే వాళ్లు మన దరిదాపుల్లో ఎంతో మంది ఉండరు. ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి (ఎన్‌ఆర్‌ఎన్‌), ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌) లాంటి విజ్ఞులు ఉన్నందుకు వారికి మనం కృతజ్ఞతాబద్ధులమవాలి. మన సమాజంలో, విశాల ప్రపంచంలో తమ సమున్నత స్థానాలను సొంతంగా సముపార్జించుకున్న వివేక శీలురు వారు. తమ సుదీర్ఘ, విలక్షణ వృత్తి జీవితాలలో తమ మనసులోని మాటలను సూటిగా చెప్పడాన్ని అలవరచుకున్న సుజనులు వారు. ఎన్‌ఆర్‌ఎన్‌‌, ఎస్‌ఎన్‌ఎస్‌‌ ఎప్పుడు ఏమి చెప్పినా ప్రజలు శ్రద్ధగా వింటారు, ప్రతిస్పందిస్తారు– కొందరు కలహశీలంగా!

ఎన్‌ఆర్‌ఎన్‌‌, ఎస్‌ఎన్‌ఎస్‌‌ ఇరువురూ సంపదను వారసత్వంగా పొంద లేదు. అలా అని కూలీ లేదా వేతన భత్యాలు పొందే ఉద్యోగులు/ పారిశ్రామిక కార్మికులూ కాదు. సమగ్ర, సమర్థ యోగ్యతలు ఉన్న వృత్తి నిపుణులు వారు. ఇంజినీర్లుగా జీవితాలను ప్రారంభించి మొదటి తరం వ్యవస్థాపకులుగా ఎదిగిన వారు. తమ తమ సంస్థల లాభాలలో వాటాలు ఉన్నవారు. ఆ వాటాలకు పూర్తిగా అర్హులైన వారు. వారి ప్రపంచ దృక్పథం ‘వారసుల’, ‘ఉద్యోగుల’ ప్రపంచ దృక్పథాలకు భిన్నమైనవి. పర్యవసానంగా పని – జీవితం సమ తౌల్యతపై వారి దృక్పథం కూడా భిన్నమైనది.


వారసులు అనేవారు అత్యున్నత స్థాయికి చేరేందుకు క్రింది స్థాయి నుంచి కష్టపడి పని చేయనక్కర లేదు. వారికి తెలుసు, అలాగే వ్యాపార జగత్తులోని ప్రతి ఒక్కరికీ తెలుసు– వారసులు ఏదో ఒక రోజున తమ సంస్థలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారని. చాలా మంది వారసులు, పాత తరానికి చెందిన ఒక డజన్‌ కుటుంబాల వారు మినహా, సంపదనుగానీ, వ్యాపార విలువలను గానీ సృష్టించనివారేనని నేను భావిస్తున్నాను. దురదృష్టవశాత్తు అటువంటి వారసులలో కొంత మంది సమున్నత వ్యాపార విలువలు, సంపదను ధ్వంసం చేసినవారే. 1991కి పూర్వమూ, ఆ తరువాత అగ్రగామి పది దిగ్గజ వ్యాపార కుటుంబాల జాబితాలను పోల్చి చూడండి. మొదటి తరం వ్యవస్థాపకులలో అత్యధికులు అపూర్వ సంపద స్రష్టలే. ఇక కార్మికులు, ఉద్యోగుల విషయానికి వస్తే వారిలో అత్యధికులు నెలా నెలా వేతనభత్యాలు అందుకోవడం పట్ల సంతృప్తి చెందే వారే. వారి ప్రస్తుత హోదాను మించి ఉన్నత అంతస్థుకు చేరుకోవాలన్న ప్రగాఢ ఆకాంక్ష, ఆవశ్యక నైపుణ్యాలు లేనివారే. ఒక ఉద్యోగి ఒక వారంలో ఎన్ని గంటలపాటు పనిచేయాలన్న విషయమై ఎన్‌ఆర్‌ఎన్‌‌, ఎస్‌ఎన్‌ఎస్‌‌ వ్యాఖ్యలను విమర్శించినవారు చాలవరకు వారసులు, ఉద్యోగులుగా నేను గమనించాను.

వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఎన్‌ఆర్‌ఎన్‌‌ అన్నారు. వారానికి 90 గంటల పాటు పనిచేయాలని ఎస్‌ఎన్‌ఎస్‌‌ అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఆ అభిప్రాయాలు వారి వారి దృక్పథాల నుంచి సరైనవేనని నేను భావిస్తున్నాను. ఎన్‌ఆర్‌ఎన్‌‌ ఇలా అన్నారు: ‘‘భారతదేశ ఉత్పాదక సామర్థ్యం ప్రపంచంలోనే చాలా తక్కువ.. కనుక మన యువజనులు ‘ఇది నా దేశం, వారానికి 70 గంటలు పని చేయదలుచుకున్నాను అని తమకు తాము చెప్పుకోవాలి, సంకల్పించుకోవాలి’. నారాయణ మూర్తి వ్యాఖ్యలపై చాలా చర్చ జరిగింది. తీవ్ర విమర్శలు చెలరేగాయి. అయితే ఆయన వెనక్కి తగ్గ లేదు. ఒక ఎస్‌ఎన్‌ఎస్‌‌, ఎప్పుడు రికార్డు అయిందో తెలియని ఒక వీడియోలో ఇలా అన్నారు: ‘ఆదివారాలూ కూడా మీ చేత పనిచేయించలేక పోతున్నందుకు నేను నిజంగా విచారిస్తున్నాను. అలా ఆదివారాలు కూడా మీ చేత పనిచేయించగలిగితే నేను చాలా సంతోషిస్తాను. నేను ఆదివారాలూ పని చేస్తుంటాను’.

పారిశ్రామిక కార్మికులకు 8 గంటల పనిదినం తొలుత జర్మనీలో 1918లో చట్టబద్ధమయింది. దరిమిలా 8 గంటలు శ్రమ, 8 గంటలు వినోదాలు (రిక్రియేషన్‌), 8 గంటలు విశ్రాంతి అన్నది ఒక విశ్వజనీన నియమయింది. వినోదాలకు రోజూ 8 గంటల సమయాన్ని వెచ్చించే వ్యక్తి ఒక్కరినీ నేను చూడలేదు. ‘ఆహారం భుజించడం, బట్టలు ఉతుక్కోవడం, వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం, సినిమాలు చూడడం, వార్తాపత్రికలు, పుస్తకాలు చదవడం, షాపింగ్‌ చేయడం, ఉబుసుపోక కబర్లు చెప్పుకోవడం మొదలైనవన్నీ రిక్రియేషన్‌ కిందకు వస్తాయా? ఆ విధంగా చూస్తే రిక్రియేషన్‌కు 8 గంటలు సరిపోవేమో!

పారిశ్రామిక కార్మికులలో చాలా మంది చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే కొత్త నైపుణ్యాలు నేర్చుకుని మరింత సంక్లిష్ట పనులు చేసే అర్హతలు సంపాదించుకుంటారు. డెస్క్‌ ఉద్యోగాలు ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు 8–8–8 నియమాన్నే అనుసరించడం ఆరంభమయింది. డెస్క్‌ ఉద్యోగులలో చాలా మంది చేసేవి కూడా పునరుక్తమవుతుండేవి. ఈ దృష్ట్యా కార్మికులు/ ఉద్యోగులలో అత్యధికులకు 8–8–8 నియమం బాగా ఆమోదయోగ్యమయింది. ఆటోమేషన్‌, రోబోలు, కృత్రిమ మేధ (ఏఐ) వచ్చిన దరిమిలా ఆ నియమం కొద్ది గంటలుగా మారింది. కార్మికులు/ ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయవలసిన అవసరం లేకపోయింది. అయితే ఉత్పాదక సామర్థ్యం పెంచుకునేందుకు కొత్త పరికరాలు, సాంకేతికతలు, యంత్ర వ్యవస్థలు అవసరమయ్యాయి. ఎన్‌ఆర్‌ఎన్‌‌, ఎస్‌ఎన్‌ఎస్‌ల వ్యాఖ్యలు ఇటువంటి కార్మికులు/ ఉద్యోగుల నుద్దేశించి చేసినవి కావని నేను భావిస్తున్నాను.

కార్మికులు/ఉద్యోగులకు భిన్నంగా రైతులు 8–8–8 నియమాన్ని అనుసరించారు. వ్యవసాయంలో మొదటి 8 గంటల వ్యవధి 10 నుంచి 12 గంటలకు పొడిగింపబడుతుంది. ఆ అదనపు గంటల్లో కూడా పూర్తిగా పనిచేస్తేనే మొదటి 8 గంటల్లో జరగాల్సినవి జరుగుతాయి. అదేవిధంగా డాక్టర్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, వాస్తుశిల్పులు, శాస్త్రవేత్తలు, నటీనటులు మొదలైన వృత్తి నిపుణులు రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని చేయరు. రోజుకు 12 గంటలు, అంతకంటే ఎక్కువ సమయం పనిచేసే వృత్తి నిపుణులు నాకు తెలుసు. అలాగే శని, ఆదివారాలు కూడా మామూలు రోజుల్లో మాదిరిగానే పనిచేసే వృత్తి నిపుణులు ఎంతో మంది ఉన్నారు. విజయాలు సాధించిన వృత్తి నిపుణులు సుదీర్ఘ పనిగంటలు గురించి ఫిర్యాదు చేయరు. వారు ఇష్టపూర్వకంగానే ఎక్కువ గంటల పాటు పనిచేస్తారు. కనుక 8–8–8 నియమం అనేది మానవులు అందరికీ ఒక విధంగా వర్తించదు.

ప్రతి రోజూ సాధారణ సమయం కంటే ఎక్కువ గంటల పాటు పని చేయడం నాకు సంతోషంగాను, సంతృప్తికరంగాను ఉంటుంది. ‘పని’కి నా నిర్వచనంలో న్యాయవాదం (ప్రాక్టీసింగ్‌లా) పార్లమెంటరీ కార్యకలాపాలు, చదవడం, రాయడం, ప్రసంగించడం, ప్రజలు చెప్పే విషయాలు వినడం, పార్టీ కార్యకర్తలతో చర్చలు జరపడం, వివాహాలు, పుట్టినరోజు వేడుకలు లేదా పుస్తకావిష్కరణలు మొదలైన సామాజిక కార్యక్రమాలకు హాజరవడం మొదలైనవన్నీ చేరతాయి. నేను నిద్రపోకుండా ఉన్న సమయమంతటినీ ‘పని చేసే సమయం’ గానే పరిగణిస్తాను పని–జీవితం సమతౌల్యత అనేది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి సొంతంగా, స్వతంత్రంగా సాధించుకోవల్సినది అని నేను విశ్వసిస్తున్నాను. పని–జీవితం మధ్య నేను ఒక సమతౌల్యతను పాటించగలుగుతున్నానని చెప్పేందుకు సంతోషిస్తున్నాను.


ఎన్‌ఆర్‌ఎన్‌‌, ఎస్‌ఎన్‌ఎస్‌లు తమ తమ వృత్తి జీవితాలలో గొప్ప విజయాలు సాధించినవారు. సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని సముపార్జించుకున్నవారు. కనుక భారతీయులు మామూలు కంటే ఎక్కువ గంటలు పనిచేసి తీరాలని చెప్పేందుకు వారు పూర్తిగా అర్హులు. ఈ విషయంలో వారిపై పలువురు చేసిన విమర్శలు, వ్యంగ్య దూషణలు అర్థం లేనివి. భారీ ఆదాయం, అపరిమిత ఆస్తులు ఉన్న స్త్రీ పురుషులు ఎంతో మంది నాకు తెలుసు. అయితే ఆ భాగ్య రాశులేవీ వారిలో ఎలాంటి అతిశయాలకు కారణమవలేదు. వారు చాలా నిరాడంబర జీవితాన్ని గడుపుతారు ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. మంచి దుస్తులు ధరిస్తారు– అయితే మిరుమిట్లు గొల్పేవి కావు. ఎటువంటి పటాటోపాలకు పోకుండా తమను కలిసినవారందరితోనూ నమ్రంగా మాట్లాడతారు.

యువజనులు సుదీర్ఘ గంటల పాటు చేసే ఉత్పాదక కృషే ఒక వర్ధమాన దేశాన్ని నిజంగా సంపద్వంతం చేస్తుందని కోట్లాది ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తుందనే సత్యాన్ని ఆకాంక్షాభరిత యువతరం మనసుల్లో పాదుకొల్పేందుకే ఎన్‌ఆర్‌ఎన్‌‌, ఎస్‌ఎన్‌ఎస్‌లు ఆ విధంగా మాట్లాడారని నేను భావిస్తున్నాను. నిజానికి వారి ఆ వ్యాఖ్యలు నేటి యువతరాన్ని జాతి నిర్మాణానికి పురిగొలిపే పిలుపులు. ఆ వ్యాఖ్యలు ఎంత మాత్రం వివాదాస్పదమైనవి కావు. ప్రజలను ఆలోచించేలా అవి అనుద్దేశపూర్వకంగానే ప్రేరేపిస్తున్నాయి. పని–జీవితం మధ్య సమతౌల్యాన్ని అన్వేషిస్తున్న వారికి అదేమంత చెడ్డ విషయం కాదు కదా.

యువజనులు సుదీర్ఘ గంటల పాటు చేసే ఉత్పాదక కృషే ఒక వర్ధమాన దేశాన్ని సంపద్వంతం చేస్తుందనే సత్యాన్ని యువతరం మనసుల్లో పాదుకొల్పేందుకే వారానికి 70 లేదా 90 గంటలపాటు పనిచేయాలని నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్‌ చెప్పారు. వారి ఆ వ్యాఖ్యలు నేటి యువతరాన్ని జాతి నిర్మాణానికి పురిగొలిపే పిలుపులు.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Jan 18 , 2025 | 04:30 AM