Share News

Aadhaar Gets Approval as Voter ID: ఆధార్‌కు ఆమోదం

ABN , Publish Date - Sep 12 , 2025 | 06:08 AM

బిహార్‌లో సమగ్ర ప్రత్యేక సవరణ (సర్‌)కు ఎన్నికల సంఘం ఉపక్రమించిన 77రోజుల తరువాత, ఓటర్ల జాబితాలో 65 లక్షల ఓట్లు తొలగించిన అనంతరం, చెల్లుబాటయ్యే ఒక గుర్తింపుగా ఆధార్‌ను పరిగణనలోకి...

Aadhaar Gets Approval as Voter ID: ఆధార్‌కు ఆమోదం

బిహార్‌లో సమగ్ర ప్రత్యేక సవరణ (సర్‌)కు ఎన్నికల సంఘం ఉపక్రమించిన 77రోజుల తరువాత, ఓటర్ల జాబితాలో 65 లక్షల ఓట్లు తొలగించిన అనంతరం, చెల్లుబాటయ్యే ఒక గుర్తింపుగా ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల సంఘం ఎట్టకేలకు, అయిష్టంగానే ఆమోదించింది. ఇకమీదట, ఆధార్‌ను కూడా ఓ ఆధారంగా స్వీకరించండి అంటూ బిహార్‌లో ఉన్న తన ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఒక తీవ్ర సమస్యను సుప్రీంకోర్టు ఇలా పరిష్కరిస్తూనే ఆధార్‌ పౌరసత్వ ధ్రువీకరణ కాదన్న ఎన్నికల సంఘం వాదననే పునరుద్ఘాటించింది. అంతేకాదు, బిహార్‌ అక్రమవలసదారులకు నిలయం అంటూ ఎన్నికల సంఘం పదేపదే కోర్టును హెచ్చరిస్తూ వచ్చిన నేపథ్యంలో, ఒక పౌరుడి ఆధార్‌ అసలైనదో, నకిలీదో నిర్ధారించే అధికారాన్ని కూడా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికే ఇచ్చింది. ఈ దేశంలో పుట్టిన ప్రతీవ్యక్తి ఉనికినీ, మనుగడను నిర్ధారిస్తున్న, ప్రతీ అవసరాన్నీ తీరుస్తున్న ఆధార్‌ను ‘సర్‌’లో మాత్రం సర్వోన్నత న్యాయస్థానం పన్నెండో స్థానంలో ఉంచింది. ఒక వ్యక్తిని ఓటరు లిస్టులో చేర్చడానికీ లేదా తొలగించడానికి ఎన్నికలసంఘం గుర్తించిన ధ్రువీకరణ పత్రాల జాబితాలో ఆధార్‌ ఎట్టకేలకు అడుగున చేరింది.

బిహార్‌లో దాదాపుగా ప్రజలందరి దగ్గరా ఉన్న ఒక గుర్తింపు పత్రాన్ని తాను గుర్తించేది లేదంటూ ఎన్నికల సంఘం తీవ్రంగా పోరాడింది. అభ్యంతరం ఏమిటంటూ సుప్రీంకోర్టు కూడా పలుమార్లు ప్రశ్నించింది. గుర్తించి తీరాల్సిందేనంటూ మొన్న విస్పష్టమైన ఆదేశాలు జారీచేసేలోగా కనీసం మూడుసార్లు న్యాయస్థానం ఆధార్‌ను చేర్చమంటూ ఈసీని కోరింది. ఒక లబ్ధిదారుగా ప్రయోజనాలు పొందడానికి అది పనికొస్తుందేమో కానీ, పౌరసత్వ ధ్రువీకరణ పత్రం కాబోదని ఈసీ వాదన. శాశ్వత నివాసం, కులం, పాస్‌పోర్టు సహా ఎన్నికల సంఘం ప్రకటించిన పదకొండు డాక్యుమెంట్లనూ పొందడానికి మూలాధారంగా ఉపకరిస్తున్న ఆధార్‌, ఓటుహక్కుకు ఎందుకు పనికిరాకుండా పోయిందన్నది అసలు ప్రశ్న. తాను స్వయంగా జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డును కూడా ఎన్నికల సంఘం కాదంటూ వచ్చింది. జాబితాలో చేర్పులు జరగాలి కానీ, మూకుమ్మడి తొలగింపులు కాదు అంటూ ఒక దశలో న్యాయస్థానం చిరాకుపడి, ఆధార్‌, ఓటరు కార్డు విషయంలో మరింత ఒత్తిడి తీసుకువచ్చింది కూడా. 65లక్షల మంది ఓటర్లను తొలగించిన ముసాయిదాను బహిరంగపరచాలన్న కోర్టు సూచనను కూడా, ఇది ఉపకారం కంటే అపకారమే చేస్తుందంటూ ఎన్నికల సంఘం తిరస్కరించింది. అయితే, అభ్యంతరాలు తెలియచేయడానికి అప్పటివరకూ ఉన్న సెప్టెంబరు 1 గడువును పొడిగించడానికి మాత్రం ఒప్పుకుంది. చివరకు కోర్టు కూడా ఆధార్‌ చట్టం ప్రకారం అది సిటిజెన్‌షిప్‌ ప్రూఫ్‌ కాదంటూనే, ఐడీప్రూఫ్‌గా వాడవలసిందేనంటూ వివాదాన్ని ముగించింది. ఎన్నిసార్లు చెప్పినా వినని ఎన్నికల సంఘం కూడా అయిష్టంగానే సరేనంది.


అక్రమ వలసదారులను జాబితాలో చేర్చాలని ఎవరూ కోరుకోరు, అంతమాత్రాన అసలుసిసలు పౌరులకు ఏదో ఒక డాక్యుమెంట్‌ లేదన్న కారణంగా అన్యాయం జరగకూడదు, అనర్హుడుగా మిగిలిపోకూడదు అంటూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఎంతో ఉన్నతమైనది. ఇప్పటివరకూ ఓటరు జాబితాలో ఉంటూ, దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలను అధికారంలో కూచోబెట్టిన లక్షలాది ఓటర్ల పేర్లు ఈ సమూల ప్రక్షాళన కార్యక్రమంలో గల్లంతైన మాట నిజం. ఆధార్‌ను ఆమోదించాలన్న కోర్టు ఆదేశాలతో ఎంతోమందికి న్యాయం జరిగే అవకాశాలు ఇప్పుడు పెరిగాయి. ఇక, నకిలీ ఆధార్‌లు ఉంటాయనీ, వాటిని నిగ్గుతేల్చవచ్చునంటూ న్యాయస్థానమే అధికారాలు అప్పగించిన నేపథ్యంలో, ఏ మాత్రం తేడాపాడాలున్నా అధికారులకు కాదుపొమ్మనే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ప్రతీ 1500మంది స్థానంలో ఇప్పుడు 1200మందికి ఓ పోలింగ్‌బూత్‌ కేటాయిస్తున్నందున వాటిసంఖ్య 77వేల నుంచి 91వేలకు పెరిగిందనీ, బూత్‌లకు కొత్తనెంబర్లు వచ్చాయనీ, ఆధార్‌ ఆధారంగా తిరిగి జాబితాలో చేరాలనుకుంటున్నవారు కొత్త బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌వో)తో వ్యవహరించవలసి ఉంటుందని వార్తలు వింటున్నాం. అత్యధిక నిరక్షరాస్యత ఉన్న బిహార్‌లో మరో పదిహేనురోజుల్లోగా ఈ పనంతా ఎంత సవ్యంగా పూర్తవుతుందో తెలియదు. ఆధార్‌ను గుర్తించాలంటూ పోరాడుతున్నవారంతా అక్రమవలసదారుల పక్షాన ఉన్నట్టేనని కోర్టులో బలంగా వాదించిన ఎన్నికల సంఘం, సుప్రీం ఆదేశాలను ఎంత సమర్థంగా అమలు చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?

మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

Updated Date - Sep 12 , 2025 | 06:08 AM