Share News

Bangladesh Politics: బంగ్లాకు మరో ఆయుధం

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:53 AM

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా మరణశిక్షకు అర్హురాలని నిర్ణయించడానికి అక్కడి ట్రిబ్యునల్‌కు నూటముప్పైరోజులు సరిపోయింది. నూటముప్పైఐదు పేజీల చార్జిషీటు చేతధరించి ముగ్గురు సభ్యుల ఈ ట్రిబ్యునల్‌ ఆమె ఎన్నిదుర్మార్గాలకు...

Bangladesh Politics: బంగ్లాకు మరో ఆయుధం

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా మరణశిక్షకు అర్హురాలని నిర్ణయించడానికి అక్కడి ట్రిబ్యునల్‌కు నూటముప్పైరోజులు సరిపోయింది. నూటముప్పైఐదు పేజీల చార్జిషీటు చేతధరించి ముగ్గురు సభ్యుల ఈ ట్రిబ్యునల్‌ ఆమె ఎన్నిదుర్మార్గాలకు పాల్పడిందో ఏకరువుపెట్టింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిని కాల్చిపారేయమని ఆమె ఆదేశించారని, డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించి మరీ నిరసనకారులపై మారణాయుధాలతో విరుచుకుపడమని భద్రతాబలగాలను ఒత్తిడిచేశారని న్యాయమూర్తులు తేల్చారు. అధికారంలో కొనసాగడానికి అత్యంత అమానుషంగా ప్రవర్తించారంటూ, తీవ్రంగా గాయపడిన నిరసనకారులను సకాలంలో ఆస్పత్రికి తరలించడానికి కూడా భద్రతాదళాలు నిరాకరించాయని న్యాయమూర్తులు బాధపడ్డారు. తీర్పు ఇవ్వడంలో జాప్యం జరిగినందుకు క్షమించమని కూడా ఒక న్యాయమూర్తి అన్నారు. తీర్పు వెలువడగానే, యూనిస్‌ ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించమని డిమాండ్‌ చేయడం, మన దేశం పొరుగుదేశాన్ని పొగుడుతూనే, అసలు విషయాన్ని నాన్చివేయడం చూస్తూనే ఉన్నాం.

ట్రిబ్యునల్‌ తీర్పు ఎలా రాబోతున్నదో ఊహకు అందనిదేమీ కాదు అని హసీనా కుమారుడు గతంలోనే వ్యాఖ్యానించారు. ట్రిబ్యునల్ విధించబోయేది మరణశిక్ష అని కూడా అన్నారు. హసీనా సైతం తీర్పుకు ముందు ఓ సందేశాన్ని విడుదలచేస్తూ, తీర్పు ఎలా ఉన్నా బాధపడవద్దని తన అవామీలీగ్‌ కార్యకర్తలను కోరారు. ఆ మాట అంటూనే, తనకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్‌ ఇవ్వబోయే ఏకపక్ష, అప్రజాస్వామిక తీర్పును నిరసించమని కూడా ఆమె ఆదేశించినమేరకు బంగ్లాదేశ్‌లో ఎంత నియంత్రించినా హింస జరిగింది. సరిగ్గా యాభైయేళ్ళక్రితం జరిగిన సైనిక కుట్రలో తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులను కోల్పోయి, ఆరేళ్ళపాటు భారత్‌లో ఇందిర నీడన తలదాచుకొని, తిరిగి స్వదేశంలో కాలూని అధికారాన్ని చేజిక్కించుకున్న హసీనా గతం ఇప్పుడు అందరికీ గుర్తుకువస్తోంది. జియావుర్‌ రహ్మాన్‌ భార్య ఖలీదాజియామీద అలుపెరగని, సాహసోపేత పోరాటాలు చేశారు. ఇద్దరు బేగంల మధ్య సాగిన ఆధిపత్య పోరాటంలో ముజబూర్‌ రహ్మాన్‌ కుమార్తె పైచేయి సాధించారు. గద్దెనెక్కిన ఐదేళ్ళలో మళ్ళీ దిగవలసి వచ్చింది కానీ, ఆ తరువాత అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం ఎలాగో ఆమెకు తెలిసొచ్చింది. ఖలీదా సహా బీఎన్పీ అధినాయకుల నిర్బంధాలు, ఆ పార్టీకి అండగా ఉన్న జమాతే వంటే ఇస్లామిక్‌ ఛాందసశక్తులను అధికారికంగానూ, అనధికారికగానూ హసీనా చీల్చిచెండాడారు. హసీనా పాలనలో బంగ్లాదేశ్‌ వేగంగా వృద్ధిచెందింది. మౌలికసదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి, పేదరిక నిర్మూలనలోనూ మంచిపేరుతెచ్చుకుంది. కానీ, అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆమె అనుసరించిన అనైతిక విధానాల మీద విమర్శలు కాదనలేనివి.


తనకు వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమంపట్ల హసీనా నిర్దయగా వ్యవహరించారన్నదీ వాస్తవమే. ఆ తరువాత ఆమె దిగివచ్చినా, అప్పటికే పరిస్థితి చేజారింది. రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించుకున్న తరువాత నిజానికి చల్లారినా, స్వల్పకాలంలోనే తిరిగి రాజుకోవడం వెనుక జమాత్‌ ఇస్లామీ, బీఎన్పీ ఉండటంతో ఆమె కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అంటారు. పాకిస్థాన్‌ ఒత్తిడి కారణంగా అమెరికా, దాని మిత్రదేశాలు కొన్ని ఆమెకు పూర్తి వ్యతిరేకంగా వ్యహరించాయి. ఆమె ఢిల్లీ పారిపోయి వచ్చిన తరువాత, బంగ్లాదేశ్‌లో అప్పటినుంచి ఇప్పటివరకూ సాగిన పరిణామాలన్నీ ఆమె పట్ల ఏయే శక్తులు ఏ లక్ష్యాల సాధనకోసం కత్తికట్టాయో తెలియచెబుతాయి. గృహనిర్బంధంలో ఉన్న ఖలీదా విదేశీ చికిత్సతో ఎన్నికలకు సిద్ధపడటం, వేలాదిమంది జమాత్‌ యోధులు జైళ్ళ నుంచి బయటకు రావడం, ముజబూర్‌ రహ్మాన్‌ విగ్రహాలను మాత్రమే కాదు, ఆయన ఆధ్వర్యంలో సాగిన విముక్తి పోరాటాన్ని సైతం చరిత్ర నుంచి చెరిపేసి, అప్పట్లో ఊచకోతకోసిన పాకిస్థాన్‌ను ఘనంగా ఊరేగించడం చూస్తూనే ఉన్నాం.

ట్రిబ్యునల్‌ తీర్పు వరకూ ఆగకుండానే, యూనిస్‌ ప్రభుత్వం ఎప్పుడో ఆమె పార్టీని నిషేధించి ఎన్నికల్లో పాల్గొనకుండా చేసింది. అధికార వ్యవస్థలన్నీ కలసికట్టుగా ఆమెను భౌతికంగా అంతం చేయడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నాయి. దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని ఆయన మాత్రమే తీసుకోగలడు, అప్పటివరకూ ప్రజలకోసం పనిచేస్తాను అని హసీనా తన కార్యకర్తలకు ధైర్యవచనాలు చెబుతున్నారు కానీ, యాభైయేళ్ళ తరువాత, మళ్ళీ మన దేశంలో తలదాచుకున్న ఆమె, తిరిగి బంగ్లాలో కాలూని యుద్ధం చేయగల అవకాశం లేనేలేదు. ఇప్పటికే పలుమార్లు ఆమె అప్పగింత కోరిన యూనిస్ ప్రభుత్వానికి మన మీద ఒత్తిడిపెంచేందుకు ఇప్పుడు మరో ఆయుధం చేతికి అందివచ్చింది అంతే.

ఈ వార్తలు కూడా చదవండి:

Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..

Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Updated Date - Nov 18 , 2025 | 05:57 AM