Share News

2025-26 Budget : నిరుపేదలకు అభయమేదీ?

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:23 AM

మన ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో ఈ పది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో సుగుణాలూ హఠాత్తుగా మాయమైపోతాయి. ఇది సత్యం కాదూ? ఢిల్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలోను, బిహార్‌ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రవేశపెట్టిన 2025–26

2025-26 Budget : నిరుపేదలకు అభయమేదీ?

తమిళ సమాజంలో ఒక సామెత ఉంది: ‘ఆకలి దహించివేస్తే మొత్తం పదీ ఎగిరిపోతాయి’. ఇవీ ఆ పది: గౌరవం, వంశం, విద్య, ఔదార్యం, జ్ఞానం, ఉదారత, తపస్సు, సాధన, ధైర్యం, ప్రార్థన.

మన ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో ఈ పది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో సుగుణాలూ హఠాత్తుగా మాయమైపోతాయి. ఇది సత్యం కాదూ? ఢిల్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలోను, బిహార్‌ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను విలోకిస్తే ఆ సత్యం మీకు మరింతగా విశదమవుతుంది.

అయితే ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో ఇవ్వగలిగినదంతా, ఎన్నికలలో పాలక పక్షం లబ్ధి పొందగలదనే ఆశాభావంతో, కేవలం కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే ఇచ్చిన వార్షిక బడ్జెట్‌ను నేను చాలా చాలా అరుదుగా మాత్రమే చూశాను. గౌరవనీయ ఆర్థిక మంత్రి 2025–26 కేంద్ర బడ్జెట్‌ను కచ్చితంగా ఆ ఆశాభావంతోనే నివేదించారని నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాను.

ప్రజలకు పంపిణీ చేసేందుకు రూ.1,00,000 కోట్ల కాసుల కాణాచి తనకు అందుబాటులో ఉందని లేదా తాను కనుగొనవలసి ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆమె ఆ భారీ ధనరాశిని ‘కనుగొన్నారు’. ఆ సమస్త నిధులను (143 కోట్ల దేశ జనాభాలో) ఆదాయపు పన్ను చెల్లించే 3.2 కోట్ల మందికి ఇచ్చేందుకు ఆమె నిర్ణయించారు. మధ్యతరగతి కుటుంబీకులు, సంపన్నులు, మహా సంపన్నులు, కుబేర సమానులు ఆ 3.2 కోట్ల మందిలో ఉన్నారనేది ఒక అనావశ్యక వివరణ. తమిళ లోకోక్తిని పది సుగుణాలతో పాటు ఆధునిక పరిపాలనా విలువలు అయిన సమ దృష్టి, సామాజిక న్యాయం, సమంజసమైన పంపకం మొదలైన వాటిని కూడా పూర్తిగా గాలికి వదిలివేశారు.


బడ్జెట్‌ రూపకల్పనలో ఉండగా ప్రభుత్వ వార్షికాదాయం తగ్గుదల ఆర్థిక మంత్రిని వేధించింది. కేంద్ర ప్రభుత్వ మొత్తం వసూళ్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ అంచనాల కంటే రూ.60,000 కోట్ల మేరకు తక్కువగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కతేల్చింది. మరీ ముఖ్యంగా 2024–25 ఆర్థిక సంవత్సర ద్రవ్యలోటును ‘మెరుగుపరచాలని’ ఆర్థిక మంత్రి ఆశిస్తే, అందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కనీసం రూ. 43,000 కోట్లను కనుగొనవలసి ఉన్నది. వసూళ్లలో తగ్గుదల భర్తీకి, ద్రవ్యలోటు ‘మెరుగుదల’కు అవసరమైన నిధులకు మొత్తం రూ.1,00,000 కోట్లను సమకూర్చుకోవలసి ఉన్నది. ఇదిలావుండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. ఓటర్లకు భారీ వితరణ చేయదలుచుకుంటే అందుకు అదనపు నిధులు అవసరమవుతాయి. ఆ ‘వితరణ’ ఆదాయపు పన్నులో కోత రూపేణా ఉండాలని ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని ఉంటారు. పన్ను చెల్లింపుదారులలో ఏ వర్గానికి ఆ లబ్ధి చేకూర్చాలి? డొనాల్డ్‌ ట్రంప్‌ మహాశయుడు చేప్పినట్టు ప్రతి ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు తగ్గింపు లబ్ధి పొందాలి! ఇంకేం, వార్షికాదాయం రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా ఉన్న వారందరూ ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,00,000 కోట్ల ఆదాయం తగ్గి పోతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

ఈ నిర్ణయాల పర్యవసానంగా 2024–25 ఆర్థిక సంవత్సర వ్యయాలలో కోత పెట్టడం, 2025–26లో ఇతర వర్గాల పౌరులకు అవసరమైన సహాయాన్ని సమకూర్చడాన్ని నిలిపివేయడం అనివార్యమయింది. దీంతో ఉపాధి హామీ లబ్ధిదారులు (పేదలలో నిరుపేదలు), దినసరి కూలీలు, ఆదాయపు పన్ను చెల్లించని వేతన ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు, ఎమ్‌ఎస్‌ఎమ్ఈలు, గృహిణులు, పెన్షనర్లు, నిరుద్యోగ యువతను పూర్తిగా ఉపేక్షించారు. పెట్టుబడి వ్యయం, రాబడి వ్యయం రెండిటిలోను కోత విధించారు. ఈ నిర్ణయం ఫలితంగా విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, పట్టణాభివృద్ధి మొదలైన మంత్రిత్వ శాఖలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను, రాబోయే ఆర్థిక సంవత్సరాలలోను నిధుల కేటాయింపు గణనీయంగా తగ్గిపోనున్నది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ నికర పన్ను వసూళ్లు 2024–25లో వలే 11 శాతం చొప్పున పెరుగుతాయని ఆర్థిక మంత్రి విశ్వసిస్తున్నారు! వాస్తవమేమిటి? పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం యువతలో నిరుద్యోగిత 10.2 శాతంగా ఉన్నది. పట్టభద్రుల నిరుద్యోగిత 13 శాతంగా ఉన్నది. ఉపాధి కల్పన పథకాల అమలుకు చేసే వ్యయం ఎనిమిది విధాలుగా నిర్ణయించారు. ఉత్పాదకతతో ముడివడి ఉన్న పెట్టుబడి పథకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఉపాధి కల్పన పథకాల అమలుకు అయ్యే వ్యయం రూ.23,318 కోట్లుగా 2024–25 బడ్జెట్‌లో అంచనా వేశారు. సవరించిన అంచనాల ప్రకారం ఆ వ్యయం కేవలం రూ.20,035 కోట్లు మాత్రమే. ఏతవాతా ఉపాధి కల్పనా కార్యక్రమాలు లక్ష్య పరిపూర్తిలో పూర్తిగా విఫలమయ్యాయని చెప్పక తప్పదు.

పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం వేతన ఉద్యోగులలో పురుషుల నెలసరి వేతనం గత ఏడు సంవత్సరాలలో రూ.12,665 నుంచి రూ.11,858కి పడిపోయింది. అలాగే స్వయం ఉపాధి కార్మికులలో పురుషుల నెలసరి ఆదాయం కూడా గత ఏడు సంవత్సరాలలో రూ.9,554 నుంచి రూ.8,591కి పడిపోయింది. మహిళా ఉద్యోగుల, కార్మికుల ఆదాయాలు కూడా ఇదే విధంగా తగ్గి పోయాయి. కుటుంబ వినియోగంపై సర్వే ప్రకారం నెలసరి సగటు తలసరి వినియోగం గ్రామీణ ప్రాంతాలలో రూ.4,226 కాగా పట్టణ ప్రాంతాలలో రూ.6,996గా ఉన్నది. ఈ సగటు దేశ జనాభా మొత్తానికి వర్తిస్తుంది. కిందిస్థాయిలో ఉన్న 50 శాతం మంది నెలవారీ తలసరి వినియోగ వ్యయం తక్కువ స్థాయిలో ఉన్నది. జనాభాలో కింది స్థాయిలో ఉన్న 25 శాతం నెలవారీ తలసరి వినియోగం మరింత తక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


నెలవారీ తలసరి వినియోగం రూ.4,000 నుంచి రూ.7,000 దాకా మాత్రమే ఉంటే, నలుగురు సభ్యులు ఉన్న ఒక కుటుంబం సుఖప్రదంగా ఎలా జీవించగలుగుతుంది? ఈ తలసరి వినియోగ వ్యయంలోనే ఆహారం, విద్యుత్తు, విద్య, ఆరోగ్య భద్రత, అద్దె, రవాణా, అప్పుల చెల్లింపు, వినోద విహారాలు, సామాజిక బాధ్యతలు, అత్యవసర వ్యయాలు మొదలైనవి కూడా భాగంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మనం విస్మరించ కూడదు.

2030 సంవత్సరం దాకా ఏటా 78.5 లక్షల ఉద్యోగాలను వ్యవసాయేతర రంగాలలో సృష్టించవలసిన అవసరమున్నదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. గత పదేళ్లుగా మన తయారీ రంగం స్థితిగతులు క్షీణించి పోతున్నాయి. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో మన తయారీరంగం వాటా 2014లో 15.07 శాతం నుంచి 2023లో 12.93 శాతానికి తగ్గి పోయింది. ప్రపంచ వస్తూత్పత్తుల వాణిజ్యంలో చైనా వాటా 28.8 శాతం కాగా, మన దేశం వాటా కేవలం 2.8 శాతం మాత్రమే! నిరుద్యోగ యువజనులు, దినసరి వేతనకార్మికులు, స్వయం ఉపాధి శ్రామికులు అందరికీ అవసరమైన ఉద్యోగాలను మన తయారీరంగం సృష్టించలేక పోతోంది. ప్రభుత్వం ఘనంగా చెప్పే ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ కూడా లక్ష్య పరిపూర్తిలో విఫలమయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తగినంత వృద్ధిరేటుతో అభివృద్ధి చెందడం లేదు. ప్రభుత్వ విధానాల (ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ఇవి ప్రతి బింబించాయి) ఫలితంగా చాలా కొద్ది మంది సంపన్నులు, మధ్యతరగతి జనాలు (వీరు మహాఅయితే దేశ జనాభాలో 30 శాతంగా ఉంటారు) మాత్రమే జీవనోల్లాసంతో జీవించగలుగుతున్నారు. మిగతా వారి మాటేమిటి? ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న 50 శాతం మంది ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చవలసిన బాధ్యతను ప్రభుత్వం క్రూరంగా వదిలివేసింది.

భారత ఆర్థిక వ్యవస్థ తగినంత వృద్ధిరేటుతో అభివృద్ధి చెందడం లేదు. ప్రభుత్వ విధానాల (ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ఇవి ప్రతిబింబించాయి) ఫలితంగా చాలా కొద్ది మంది సంపన్నులు, మధ్యతరగతి జనాలు (వీరు మహా అయితే దేశ జనాభాలో 30 శాతంగా ఉంటారు) మాత్రమే జీవనోల్లాసంతో జీవించగలుగుతున్నారు. ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న 50 శాతం మంది ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చవలసిన బాధ్యతను ప్రభుత్వం క్రూరంగా వదిలివేసింది.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Feb 15 , 2025 | 05:23 AM