Share News

8th Budget : ఆర్థిక సర్వే అరణ్య రోదన

ABN , Publish Date - Feb 08 , 2025 | 06:17 AM

నాకు గుర్తు ఉన్నంతవరకు, రాజకీయ లక్ష్యాలతో రూపొందిన నిర్మలా సీతారామన్‌ 8వ బడ్జెట్‌ లాంటిది మరొకటి మరెన్నడూ లేదు. ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో పునర్వ్యవస్థీకరించేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమైన బడ్జెట్‌ మరొకటి లేనేలేదని కచ్చితంగా

 8th Budget : ఆర్థిక సర్వే అరణ్య రోదన

నాకు గుర్తు ఉన్నంతవరకు, రాజకీయ లక్ష్యాలతో రూపొందిన నిర్మలా సీతారామన్‌ 8వ బడ్జెట్‌ లాంటిది మరొకటి మరెన్నడూ లేదు. ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో పునర్వ్యవస్థీకరించేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమైన బడ్జెట్‌ మరొకటి లేనేలేదని కచ్చితంగా చెప్పగలను. తదుపరి దశ ఆర్థిక సంస్కరణలకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అయినా ప్రభుత్వం విఫలయింది. ప్రజలకు తీవ్ర ఆశాభంగం కలిగించింది.

2024లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి సింహావలోకనం చేసుకోండి. భారతీయ జనతా పార్టీకి ప్రజలు వరుసగా మూడోసారి అధికారమిచ్చారు. అయితే ఒక హెచ్చరిక స్పష్టంగా చేశారు. మీకు తగినంత మంది ఎంపీలు ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి మెజారిటీ మీకు లేదు. రాజ్యాంగాన్ని మార్చివేసేందుకు మీరు ప్రయత్నించ కూడదు. ఏకాభిప్రాయ సాధనతో మీరు పరిపాలన చేయాలి. నిరుద్యోగిత, పేదరికం, అసమానతలు, ద్రవ్యోల్బణం, రైతుల దురవస్థ, మౌలిక సదుపాయాల కొరత మొదలైన సమస్యల పరిష్కారానికి మీరు శ్రద్ధ చూపాలి.


సరిగ్గా ఇటువంటి పరిస్థితులనే కాదూ 1991లో ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్‌ మన్హోహన్‌సింగ్ ఎదుర్కొన్నది? కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధానమంత్రి ఆర్థికమంత్రి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని నవ పథనిర్దేశక ఆర్థిక సంస్కరణలు ప్రకటించారు. జూలై 1, 1991న ప్రారంభమైన ఆ సంస్కరణల తొలి దశ ఆగస్టు 15, 1991న ముగిసింది (రూపాయి విలువ తగ్గింపు, వాణిజ్య సంస్కరణలు, ద్రవ్య రంగ సంస్కరణలు, పన్నుల సంస్కరణలు, నూతన పారిశ్రామిక విధానం మొదలైనవి ఆ తొలి దశలో అమలయ్యాయి.

2024 సార్వత్రక ఎన్నికల తరువాత జూలై 23, 2024న నరేంద్ర మోదీ–సీతారామన్‌ ప్రథమ బడ్జెట్‌ను ఎవరినీ ఉత్సాహపరచలేకపోయింది. ఆర్థికాభివృద్ధిని వేగిరపరిచే ప్రభావాన్ని చూపడంలో విఫలమయింది. పాలకులు అందుకు ఎన్నో సాకులు చూపారు. ఆ బడ్జెట్‌ సంవత్సరం ముగిసేలోగా ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగించింది. వేతనాలు స్తంభించిపోయాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోయాయి విదేశీ కంపెనీలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వ్యాపార సంస్థలు, వ్యాపారవేత్తలు సింగపూర్‌, దుబాయి, అమెరికాకు వలస వెళ్లారు. ‘ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఎందుకు పూనుకోవడం లేదు? తక్షణమే పటిష్ఠ చర్యలు చేపట్టాలని పాలకులను గట్టిగా కోరేదెవరు?’ అనే ప్రశ్నలను ప్రతి ఒక్కరూ అడిగారు.

అదృష్టవశాత్తు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) ‘ఆర్థిక సర్వే–2024–25’ మున్నుడిలో ఒక అర్థవంతమైన, కార్యసాధక సలహా ఇచ్చారు. ‘ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలపై నియంత్రణలు ఎత్తివేయాలి’ అన్నది ఆయన సలహా. సముచితమైన సలహా, సందేహం లేదు. ఆర్థిక సర్వేలో 13 అధ్యాయాలు ఉన్నాయి. సీఈఏ సలహాలు, సిఫారసులు ఏమిటి, వాటికి ప్రభుత్వ ప్రతిస్పందన (లేదా స్పందనారాహిత్యం) ఏమిటో వివరించేందుకు నాలుగు అధ్యాయాల గురించి ప్రస్తావిస్తాను మొదటి అధ్యాయం (ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు)లో ఆర్థికాభివృద్ధి మందగతిలోకి జారిపోవడానికి కారణాలను నొక్కి చెప్పారు. పోటీ తత్వాన్ని మెరుగుపరిచేందుకు నియంత్రణలు ఎత్తివేయాలని, సంస్థాగత సంస్కరణలు అమలుపరచాలని సీఈఏ సిఫారసు చేశారు. ఆర్థికమంత్రి ఆ సిఫారసుకు పూర్తిగా విరుద్ధమైన చర్యలు చేట్టారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలకు మరిన్ని నిధులు కేటాయించారు. సరికొత్తగా 7 స్కీమ్‌లు, 8 మిషన్‌లు, 4 ఫండ్స్‌ను ప్రకటించారు! డీరెగ్యులేషన్‌కు నిర్దిష్ట ప్రతిపాదన ఏదీ లేదు. ఏ రంగంలోనూ పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు తోడ్పడే చర్యలు ఏవీ ప్రకటించలేదు.

ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న విషమ సమస్య నిరుద్యోగిత. ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండిపోయిన కుటుంబాల వెతలు మాటల్లో చెప్పలేనవి. 12వ అధ్యాయం (ఉద్యోగిత, నైపుణ్యాల అభివృద్ధి)లో నిరుద్యోగిత రేటు 2023–24లో 3.2 శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి రావడంలో ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)పై ఆర్థిక సర్వే ఆధారపడింది. నిరుద్యోగిత రేటు అంత తక్కువగా ఉంటే దాన్ని పూర్తి ఉద్యోగితగా అర్థశాస్త్ర సిద్ధాంతాల్లో పరిగణిస్తారు. ఆ నిర్ణయంతో ఎదురయ్యే ప్రమాదాన్ని గుర్తించి కాబోలు 2030 సంవత్సరం దాకా వ్యవసాయేతర రంగాలలో ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించవలసిన అవసరమున్నదని ఆర్థిక సర్వే పేర్కొంది. 2030 నాటికి పనిచేసే వయసులో ఉండే జనాభా 96 కోట్లకు పెరుగుతుందని అంచనా.


మరి పీఎల్‌ఎఫ్‌ఎస్‌, ఆర్థిక సర్వేలు వెల్లడించిన విషయాలతో ఆర్థికమంత్రి ఏకీభవిస్తారా? ఆమె మౌనం వహిస్తున్నారు. అంటే ఆ సర్వేలు వెల్లడించిన వాస్తవాలను ఆమె నిరాకరించడమే కాదూ? ‘డి రెగ్యులేషన్‌ డ్రైవ్స్‌ గ్రోత్‌’ అనే శీర్షికన ఒక అధ్యాయానికి అధ్యాయమే (5వ అధ్యాయం) ఉన్నది. ప్రస్తుత పెట్టుబడుల రేటు 31 శాతం కంటే తక్కువగా ఉన్నది. వృద్ధిరేటు 6.5 శాతం కంటే తక్కువగా ఉన్నది. ఈ మదుపుల రేటు, వృద్ధి రేటుతో స్వాతంత్ర్య శతాబ్ది (2047) నాటికి మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆవిర్భవించడం అసాధ్యమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

సరే, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ గురించి ప్రభుత్వం నిర్విరామంగా ఘోషిస్తూనే ఉన్నది. అయినప్పటికీ మన తయారీరంగం పురోగతి గొర్రె తోక బెత్తెడేనన్న రీతిలో ఉన్నది. ఈ రంగం ఎంతకూ సుస్థిరంగా, శీఘ్రగతిన పురోగమించడంలేదు. ఏడవ అధ్యాయం ‘ఇండస్ట్రీ : ఆల్‌ ఎబౌట్‌ బిజినెస్‌ రిఫార్మ్స్‌’ కొన్ని చేదు వాస్తవాలను వెల్లడించింది. ప్రపంచ వస్తూత్పత్తిలో మన వాటా 2.8 శాతం మాత్రమే. మరి చైనా వాటా 28.8 శాతం. దీన్ని బట్టి తయారీరంగంలో మనం ఎంత వెనుకబడి ఉన్నాయో అర్థమవుతుంది. జీవీఏ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌)లో మన తయారీరంగం వాటా 2011–12లో 17.4 శాతం నుంచి 2023–24లో 14.2 శాతానికి తగ్గిపోయింది. తయారీరంగానికి అవసరమైన సమస్త యంత్రాలనూ మనం దిగుమతి చేసుకుంటున్నాం. పరిశోధన అభివృద్ధి రంగంలో మనం చేస్తున్న వ్యయం స్థూల దేశియోత్పత్తిలో 1 శాతం కంటే తక్కువ! ఈ అవరోధాలు అన్నిటినీ అధిగమించి ముందుకు పోవడానికి మార్గం నియంత్రణల ఎత్తివేత, పరిశోధన అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చడం, నవకల్పనలను ఇతోధికంగా ప్రోత్సహించడం, కార్మిక శ్రేణుల నైపుణ్యాలను మెరుగుపరచడమేనని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. మరి ఆర్థిక సర్వేకు బడ్జెట్‌ ఎలా ప్రతిస్పందించింది? సరికొత్త పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించింది! సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. ఒక ప్రభుత్వమున్నది. అయితే పాలన లోపించింది! పాలన వర్తమానంలో జరగాల్సిన వ్యవహారం కదా! ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వివేకవంతమైన సూచనలు చేశారు. తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేపట్టవలసిన చర్యలను నిష్కర్షగా చెప్పారు. మరి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన ఎనిమిదవ వార్షిక బడ్జెట్‌లో వాటికి సమంజసమైన రీతిలో ప్రతిస్పందించారా? లేదు. ఆర్థిక సలహాదారు వివేకవాణి మరో అరణ్యరోదనే అయింది!

సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. ఒక ప్రభుత్వమూ ఉన్నది. అయితే పాలన లోపించింది!. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్థిక సర్వేలో వివేకవంతమైన సూచనలు చేశారు. తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేపట్టవలసిన చర్యలు నిష్కర్షగా చెప్పారు. మరి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన ఎనిమిదవ వార్షిక బడ్జెట్‌లో వాటికి సమంజసమైన రీతిలో ప్రతిస్పందించారా? లేదు.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Feb 08 , 2025 | 06:17 AM