Corporation Revenue Growth: చతికిలబడ్డ సంస్థలనూ సత్సంకల్పంతో సరిదిద్దవచ్చు
ABN , First Publish Date - 2025-05-02T07:01:25+05:30 IST
ఎఫ్‌డీసీ సంస్థలో పాలుపంచుకున్న ఐఎఫ్‌ఎస్ అధికారి సి. సమ్మిరెడ్డి ప్రవేశపెట్టిన శాస్త్రీయ పద్ధతుల వల్ల నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల్లోకి వచ్చింది. ఆయన అభివృద్ధి చేసిన "100 Trees Data" విధానం ద్వారా సంస్థ ఆదాయం మూడు రెట్లు పెరిగింది.
సర్వ సాధారణంగా ప్రభుత్వ కార్పొరేషన్లు నష్టాల బాటలో పయనిస్తుంటాయి, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. వాటిని బాగుచేయడం అసాధ్యమనే నిర్లిప్త ధోరణి కూడా ఆయా శాఖల అధికారుల్లో కనిపిస్తుంది. కానీ అంకితభావం, ఆసక్తి, తాపత్రయం ఉంటే ఆ కార్పొరేషన్లను నష్టాల్లోంచి బయటపడేయటమే కాదు, వాటిని లాభాల బాట పట్టించి ప్రభుత్వానికి ఆసరాగా నిలబడేలాగా చేయవచ్చు. ఉదాహరణకు అటవీ అభివృద్ధి సంస్థనే తీసుకుందాం..
‘కమిషన్ ఆన్ అగ్రికల్చర్’ సిఫారసుల మేరకు 1975 జూన్ 16న ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఏర్పడింది. ఉడ్ ప్లాంటేషన్, అమ్మకాలే ప్రధాన లక్ష్యంగా 75 లక్షల రూపాయల మూలధనంతో ఇది ఏర్పాటైంది. వెదురు, యూకలిప్టస్, సుబాబులు, టేకు, పైన్స్ వంటి వృక్షాల కలపను అమ్మడం ద్వారా ఈ సంస్థ ఆదాయాన్ని పొందడానికి ప్రయత్నించేది. ఇందులో ప్రధానమైనది పేపర్ ఉత్పత్తికి వాడే పల్ప్‌ఉడ్. ప్రారంభంలో యూకలిప్టస్ ప్లాంటేషన్ల నుంచి వచ్చే పల్ప్‌ఉడ్‌ను మొదట ఉజ్జాయింపుగా (శాంపుల్ ప్లాట్) లెక్కించి, అప్పటి ఉమ్మడి ఏపీలోని పేపర్ మిల్లులకు మాత్రమే టెండర్ల ద్వారా అమ్మేవారు. టెండర్‌కు ధర టన్నుకు ఇంత అన్నట్లుగా టెండర్లు పిలిచేవారు. ఆ మొత్తం చెల్లించాక, ఆ పల్ప్‌ఉడ్ తీసుకుపోవడానికి సదరు టెండర్‌దార్లకు దాదాపు రెండు నెలల సమయం ఇచ్చేవారు. కానీ ఈ ప్రక్రియలో ఓ సమస్య ఉండేది. శాంపిల్ ప్లాట్ విధానంలో 100 హెక్టార్ల ప్లాంటేషన్‌లో దాదాపు ఒక హెక్టారును ఎంచుకుని అందులో ఉన్న మొత్తం చెట్లు నరికి, దాంతో వచ్చిన పల్ఫ్‌ఉడ్ మందాన్ని లెక్కగట్టేవారు. ఇలా కేవలం ఉజ్జాయింపుగా లెక్కించి అమ్మే విధానం ద్వారా పల్ప్‌ఉడ్ లెక్కల్లో దాదాపు 50 శాతం వరకు తేడా వచ్చేది. దీంతో సంస్థకు భారీగానే నష్టాలు వచ్చేవి. పేపర్ మిల్లు వారు ఈ పల్ప్‌ఉడ్‌ను దాదాపు 50 రోజుల వరకు ఎండలోనే ఉంచి, అది పూర్తిగా ఆరాక చివరి పది రోజుల్లో తీసుకెళ్లి ఎఫ్‌డీసీ స్టాఫ్ సమక్షంలో తూకం వేసేవారు. ఈ కారణంగా పల్ప్‌ఉడ్ దాదాపు 30–35శాతం తేడా వచ్చేది.
నేను 1995లో ఐఎఫ్‌ఎస్ అధికారిగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ హైదరాబాద్ రీజియన్‌లో ‘రీజనల్ మేనేజర్’గా బాధ్యతలు చేపట్టాను. అప్పటి వరకూ అనుసరిస్తూ వస్తున్న విధానం ద్వారా సంస్థకు నష్టం వస్తుందని గ్రహించాను. నేను బి.టెక్ (కెమికల్ ఇంజనీర్, ఆర్‌ఈసీ వరంగల్ నుంచి) కాబట్టి పేపర్ ఉత్పత్తి కర్ర తేమపై కాకుండా, సెల్యులోజ్ కంటెంట్‌పైనే ఆధారపడి ఉంటుందని నాకు తెలుసు. పేపర్ ఉత్పత్తిలో వాడే పల్ప్‌ఉడ్ సేకరణ విధానం, అమ్మకాల్లో ఎంతో ప్రయోగాత్మక కృషి చేశాను. యూకలిప్టస్‌ను సెల్యులోజ్ ప్రాతిపదికన, వాటి ఘన పరిమాణం(గర్త్) ఆధారంగా అమ్మాలని కోరుతూ నా పై అధికారులకు నివేదికలు పంపాను. ఈ విధానాన్ని 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆమోదించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది ఆచరణలోకి రాలేదు. ఎట్టకేలకు 2004లో అప్పటి ఎఫ్‌డీసీ ఎండీ కేఎస్ రావు చొరవతో నా ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. ఇందులో యూకలిప్టస్‌ను కలపను ఆ చెట్ల జీబీహెచ్ (చెట్టు మొదలు నుంచి ఎంత ఎత్తులో నరకాలో నిర్ణయించే కొలత) గర్త్ నిర్ణయించడం, ప్లాంటేషన్ చేసిన ఏడేళ్ల తర్వాత పల్ప్‌ఉడ్‌ను హార్వెస్టింగ్ చేయడం, నరికిన రెండు రోజుల్లోపే కలపను తూకం వేయడం, పల్ప్‌ఉడ్‌ను వాల్యూమ్ బేసిస్‌లో అమ్మడం వంటి ప్రయోగాత్మక అంశాలున్నాయి. ఈ ప్రతిపాదనల అమలులో కొన్నిసార్లు నేను పై అధికారుల నుంచి ఒత్తిళ్లనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా వెనక్కి తగ్గలేదు.
టేకు చెట్ల హార్వెస్టింగ్‌లోనూ అప్పటి వరకూ ఉన్న విధానాలకు స్వస్తి పలికి, కొత్త విధానాలను తీసుకువచ్చాను. ఈ విధానాల ద్వారా సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూరేలా చేయగలిగాను. అలా ఈ పద్ధతుల ద్వారా 2008 నాటికే గతంతో పోల్చితే దాదాపు మూడు రెట్ల ఆదాయం వచ్చింది. ఈ ఎఫ్‌డీసీ (ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) సంస్థ తనకు సంబంధించిన బ్యాంకు రుణాలన్నింటినీ 2016–17 మధ్య కాలం నాటికి తీర్చేసింది. మొత్తంగా చూస్తే 2003–04లో కేవలం రూ.7 కోట్లుగా ఉన్న ఉమ్మడి రాష్ట్ర ఎఫ్‌డీసీ నికర ఆదాయం 2024–25 నాటికి సుమారు రూ. 700 కోట్లకు చేరింది. ఇందులో 90 శాతం ఆదాయం యూకలిప్టస్ పల్ప్‌ఉడ్ నుంచే వస్తోంది. నా ప్రయోగాత్మక విధానం విజయవంతం కావడంతో, ఆ ప్రక్రియను ప్రస్తుతం తెలంగాణ ఎఫ్‌డీసీలో ‘‘Sammi Reddy’s Method of 100 Trees Data’’ విధానం అంటూ నా పేరుతో పిలుస్తున్నారు.
ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తున్న క్రమంలో 2006 లోనే ప్రధానమంత్రి అవార్డుకు నాటి రాష్ట్ర ప్రభుత్వం నా పేరును సిఫారసు చేసింది. భవిష్యత్తులోనూ అటవీ కార్పొరేషన్ లాభాల బాటలో పయనించాలంటే ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించడంతో పాటు నేటి తరం అటవీ అధికారులు పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అటవీ శాఖ అభివృద్ధికి కృషి చేయాలి.
-సి. సమ్మిరెడ్డి
ఐఎఫ్‌ఎస్, (రిటైర్డ్), 94939 76719