Share News

Reservations In India: సొంత లాభం కొంత మానుకోలేరా

ABN , Publish Date - Dec 21 , 2025 | 04:31 AM

సంపన్నశ్రేణి రిజర్వేషన్ల లబ్ధిదారులు సమాజంలో ఒక మెట్టు ఎక్కిన తరువాత సంతృప్తి చెంది, తమ వెనుక ఉన్నవారి స్థితిని గమనించి, స్వచ్ఛందంగా ‘రిజర్వేషన్లు మాకు అవసరం లేద’ని...

Reservations In India: సొంత లాభం కొంత మానుకోలేరా

సంపన్నశ్రేణి రిజర్వేషన్ల లబ్ధిదారులు సమాజంలో ఒక మెట్టు ఎక్కిన తరువాత సంతృప్తి చెంది, తమ వెనుక ఉన్నవారి స్థితిని గమనించి, స్వచ్ఛందంగా ‘రిజర్వేషన్లు మాకు అవసరం లేద’ని తిరస్కరించవలసింది పోయి, ‘తరతరాలకూ వాటి అమలు నీడనే బతుకులు సాగిస్తాం’ అనడంకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు.

ఎస్సీల్లో ఉన్న రెండు ప్రధాన సామాజిక వర్గాలవారు రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు తామే హక్కుదారులమంటూ నలభై ఏళ్లు పోరాటం చేసి, ఒకరి అభ్యున్నతిని వేరొకరు అడ్డుకుని సభ్య సమాజంలో అవహేళన పాలైన సందర్భాలు అనేకం. వారితో పాటుగా వెనుకబడిన అనేక కులాల వారి స్థితిగతులు నేటికీ ఎంతో దయనీయ స్థితిలో ఉన్నాయి. వీరి వ్యథ ప్రభుత్వాలకు పట్టడం లేదు. పైగా ‘మాకంటే వెనుకబడిన కులాలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదు, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణం’ అంటూ వీరే అనేక బహిరంగ సభల్లో నినదించడం హాస్యాస్పదం. కృపాకర్ మాదిగ తన వ్యాసంలో (‘క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లా?’–నవంబర్‌ 23) చెప్పినట్లు... రిజర్వేషన్ల పుణ్యమా అని తమ చుట్టూ ప్రహరీగోడ కట్టుకుని భద్రజీవితాలకు అలవాటుపడటమే కాదు, ఇంజనీరింగ్, డాక్టర్‌ చదువులు ఎస్సీ కోటాలో పూర్తయిన వారు క్రైస్తవులుగా విదేశాలకు వెళ్లి, మతం, సామాజిక కార్యక్రమాల పేరిట అక్కడి నుంచి నిధులు కొల్లగొట్టే ఎఫ్‌సీఆర్‌ఏలు ఎందరికున్నాయో ఆరాతీయాలి. రెండు వైపులా వీరు ఫలాలను సుష్ఠుగా ఆరగిస్తూ, తరతరాలుగా క్రైస్తవ్యాన్ని నమ్ముకుని ఉన్న బీసీ(సి)ల కడుపు కొడుతున్నారు. ఇది ప్రజలను, ప్రభుత్వాలను మోసగించడం కాదా? రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలకు వ్యతిరేకం కాదా? ఇది ఆ మహనీయుణ్ణి అడ్డంపెట్టి ఆడుతున్న తంతు. వీరి కుమ్ములాట నేపథ్యంలో మిగిలిన వెనుకబడిన కులాలవాళ్లు తమ బాగోగుల విషయం అడగడం మర్చిపోయేలా చేశారు. వాళ్లసలు ఎక్కడ.. రోడ్ల పక్కన పిల్లాజెల్లతో కూటికి, గూడుకు నోచక, ఏ చెట్ల కింద తలదాచుకుంటున్నారో ఆ దేవుడికే ఎరుక. ఈ విషయంలో ఇంతవరకు జరిగిన దారుణమంతా కేవలం రిజర్వేషన్లు సక్రమంగా అమలుకు నోచుకోని కారణంగా కొనసాగుతోందని సహృదయతతో గుర్తించాలి. సొంతలాభం కొంత మానుకోవడానికి సిద్ధపడాలి. తక్షణమే ఈ ఆట కట్టించి, సమాజంలోని అసమానతలను రూపుమాపవలసిన బాధ్యత న్యాయస్థానాలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

కోట శామ్యూల్‌ రవీంద్రనాథ్‌

ఈ వార్తలు కూడా చదవండి:

AP Politics: ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్: మంత్రి సవిత

MLA Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్.. అత్యవసర విచారణకు నో చెప్పిన హైకోర్టు..

Updated Date - Dec 21 , 2025 | 04:31 AM