Rekka Dasani A Poem on Freedom Love: రెక్క దాసాని
ABN , Publish Date - Dec 29 , 2025 | 05:48 AM
బతుకులోని రవ్వంత మాధుర్యానికి ప్రపంచాన్ని కాలదన్నినవాళ్లు. పచ్చని ఒంటరి ద్వీపాల్లా దాహపు సముద్రాల్లో ఈదులాడేవాళ్లు....
బతుకులోని రవ్వంత మాధుర్యానికి ప్రపంచాన్ని కాలదన్నినవాళ్లు.
పచ్చని ఒంటరి ద్వీపాల్లా దాహపు సముద్రాల్లో ఈదులాడేవాళ్లు.
తామొక అద్భుతమనే ఎరుక లేని అరుదైనవాళ్లు.
మౌనంగా మనలాగే పారదర్శక అదృశ్యాల్లో జీవిస్తుంటారు.
మన అనుభవాలేవీ ఎరుగని నాగరిక సమాజం మనకు అక్కర్లేని దాని అనాగరిక దాంపత్య పాఠాలేవో నేర్పబోతుంది.
మనం ఒకరికొకరం బాధ్యులమో, బానిసలమో, బంధకాలమో కాక, నిత్యం ఒకరినొకరం స్వేచ్ఛగా అనుసరిస్తామని దానికేం తెలుసు..?
మనం దిగంబరులమయ్యే తోటల్లోని వెలుతురు దానికుండదు, దాని వైభవాలు క్రీడించే నీడల్లో మనకు శ్వాస అందదు.
నా రెక్క దాసానీ..
రతికీ మృతికీ మధ్యన కలిసి నిద్రించే వేళ,
నువ్వు పంగచాచి అలల్లోనికి ఆహ్వానం పలుకుతావు..
నేను దెయ్యాన్నై తలకిందులుగా ప్రాణం పోసుకుంటాను..
మన పాప లోకపు ఫలాలన్నీ అనుభవించాక–
కన్నీటితో నా నుదుటిపైన నువ్వు,
కృతజ్ఞతతో నీ ముక్కు చివరన నేనూ,
ముద్దులమై రేపటి జీవితంలోకి మరణిస్తాం.
సొలోమోన్ విజయ్ కుమార్
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..