Reimagining Indian Socialism: సమ్మిళిత సమతా సమాజ స్వాప్నికులు
ABN , Publish Date - Sep 30 , 2025 | 02:44 AM
‘ఈ సమావేశానికి ఒక యువకుడు అధ్యక్షత వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని సునీతాతాయి అన్నారు. పూణేలో సమాజ్‌వాది ఏక్‌జుతాత సమ్మేళన్‌లో ఒక సమావేశానికి అధ్యక్షత వహించేందుకు...
‘ఈ సమావేశానికి ఒక యువకుడు అధ్యక్షత వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని సునీతాతాయి అన్నారు. పూణేలో సమాజ్‌వాది ఏక్‌జుతాత సమ్మేళన్‌లో ఒక సమావేశానికి అధ్యక్షత వహించేందుకు అవినాష్ పాటిల్‌ను ఆహ్వానిస్తూ ఆమె అన్న మాటలవి. ‘నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. నేను ఎలా యువకుడిని అవుతాను?’ అంటూ అవినాష్ విస్మయ పడ్డారు. ‘సోషలిస్టులు ఎవరైనాసరే అరవై సంవత్సరాల వయసు లోపు వారు యువకులే, అదే గాంధేయవాదులు అయితే 75 ఏళ్ల వరకు వారు యువకులే సుమా’ అని నేను చమత్కరించాను. ఇదలా ఉంచితే భారతదేశంలో సోషలిస్టు ఉద్యమానికి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూణేలో జరిగిన సమ్మేళన్‌లో దేశం నలుమూలల నుంచి వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు.
నా చమత్కారపూరిత వ్యాఖ్య ఒక బాధాకరమైన సత్యాన్ని కప్పిపుచ్చింది. భారతీయ సోషలిస్టు ఉద్యమ వారసత్వం క్షీణించి పోతోంది. వర్తమాన భారతదేశంలో మనకు ఆ స్ఫూర్తిదాయక భావజాలం అవసరం అమితంగా ఉన్నది. హిందీ భాషా రాష్ట్రాలలో విద్వేష రాజకీయాలను సమర్థంగా సవాల్ చేసిన ఆ రాజకీయ భావజాల చైతన్యం తగ్గిపోయింది. నకిలీ జాతీయవాదాన్ని చీల్చి చెండాడేందుకు అవసరమైన మేధా అస్త్రాలు నేటి యువ ప్రతిఘటనకారులకు అందుబాటులో లేకుండా పోయాయి. పాతకాలంలో తమ స్ఫూర్తిదాయక పోరాటాలను జ్ఞాపకం చేసుకుంటూ కాలం అంచున ఉన్న సోషలిస్టులకే కాదు, జాతికే ఇదొక పెద్ద విషాదం. పూరించుకోలేని మహానష్టమది.
మన జాతీయ జీవితంలో సోషలిస్టు ఉద్యమ చరిత్ర విస్మృతి అగాథాల్లోకి జారిపోయింది. భారతీయ సోషలిస్టుల గురించి ఎవరైనా ఒక యువకుడిని అడగండి. సమాధానం ఇవ్వలేక తెల్లమొహం వేస్తాడు. ఒక సోషలిస్టు, ఒక కమ్యూనిస్టు, అజ్ఞాత జీవితంలో ఉన్న ఒక మావోయిస్టు మధ్య ఉన్న తేడాలు ఏమిటో నేటి యువతలో ఎంత మందికి తెలుసు? నవయువ భారతీయుల దృష్టిలో వారందరూ ‘వామపక్షీయులే’. గడిచిన కాలం, సాగిపోయిన చరిత్ర అవశేషాలు మాత్రమే సుమా! మీరు ములాయం సింగ్ యాదవ్ గురించి వినే ఉంటారు. ఆయనేమీ ఆదర్శ సోషలిస్టు రాజకీయవేత్త కాకపోయినా జనప్రియ సోషలిస్టు నేతలలో ఒకరు. పాతకాలం పాత్రికేయులు కాంగ్రెస్ పాలకులపై నిత్యం నిప్పులు చెరిగే జార్జి ఫెర్నాండెజ్, విడ్డూరంగా ప్రవర్తించే రాజ్ నారాయణ్‌ను గుర్తు చేసుకుంటారుగానీ కర్పూరీ ఠాకూర్, మధు లిమాయే, ఎస్‌ఎమ్ జోషీ, రబీ రే, మృణాల్ గోరే, కిషన్ పట్నాయక్‌ల గురించిన జ్ఞాపకాల ముద్ర వారి మనసుల నుంచి తొలగి పోయిందనే చెప్పాలి. సోషలిస్టు ఉద్యమ తొలి తరంలో బొంబాయి మేయర్‌గా విశేష పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన యూసఫ్ మెహరాలీ, ఆధ్యాత్మిక సోషలిస్టు అచ్యుత్ పట్వర్థన్‌లు బహుశా ఎవరి స్మృతిపథంలోనూ లేరేమో?!
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను సోషలిస్టు ఉద్యమ నాయకుడుగా కాకుండా గాంధేయ సర్వోదయ నాయకుడుగానే నేటి తరం వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. హస్తకళల పునరుద్ధరణకు విశేష కృషి చేసిన ఉదాత్తురాలిగా కమలాదేవి ఛటోపాధ్యాయను, సోషలిస్టు మేధావి, బౌద్ధ పండితుడుగా ఆచార్య నరేంద్ర దేవ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. సువిఖ్యాత మరాఠీ సాహిత్యవేత్తగా సానే గురూజీ, సాంఘిక సంస్కర్తగా బలేశ్వర్ దయాళ్‌ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఓటీటీ సినిమా ‘ఏ వతన్ మేరే వతన్’ పుణ్యమా అంటూ సాహసోపేత స్వాతంత్ర్య యోధురాలుగా ఉషా మెహతా ఇప్పుడు అందరి స్మృతిపథంలో ఉన్నారు. గమనార్హమైన విషయమేమిటంటే వీరిలో ఏ ఒక్కరినీ సోషలిస్టు ఉద్యమ నేతగా జ్ఞాపకం చేసుకోవడం లేదు. రామ్ మనోహర్ లోహియాను ఒక సోషలిస్టుగా ప్రస్తావిస్తున్నారు. అయితే మండల్ పూర్వీకుడుగా మాత్రమే ఆ ప్రస్తావనలు ఉంటున్నాయి. మౌలిక సోషలిస్టు ఆలోచనాశీలిగా, నాయకుడుగా గుర్తు చేసుకోవడమనేది సకృత్తుగా జరుగుతోంది.
విశిష్ట సోషలిస్టు ఉద్యమానికి మూలమైన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ 1934లో భారత జాతీయ కాంగ్రెస్‌లో అంతర్భాగంగా ఏర్పాటయింది. రాజకీయ స్వాతంత్ర్యాన్ని సామాజిక, ఆర్థిక సమానత్వ భావనలతో అనుసంధానించడం ద్వారా వలససాలన వ్యతిరేకోద్యమాన్ని విప్లవీకరించేందుకు సోషలిస్టు పార్టీ కృషి చేసింది. జేపీతో సహా పలువురు నాయకులు తొలుత మార్క్సిస్టు సిద్ధాంత అనుయాయులే అయినప్పటికీ కమ్యూనిస్టుల వలే కాకుండా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా ఉంటూ జాతీయయోద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జయప్రకాశ్ నారాయణ్, లోహియా, ఉషా మెహతా లాంటివారు చరిత్రాత్మక పాత్ర వహించారు. స్వాతంత్ర్యానంతరం సోషలిస్టులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర ప్రస్థానాన్ని ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజాస్వామ్య పార్టీగా ప్రభవించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చట్టసభలకు చెప్పుకోదగిన సంఖ్యలో ఎన్నికైన సోషలిస్టులు హిందీ భాషా రాష్ట్రాలలో వెనుకబడిన కులాలవారిని, పేద ప్రజలను సంఘటిత పరిచారు. భారత గణతంత్ర రాజ్య తొలినాళ్లలో భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠ పరిచేందుకు కమ్యూనిస్టులతో పాటు సోషలిస్టులు అవిస్మరణీయమైన కృషి చేశారు.
ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో పలువురు సోషలిస్టులు నిర్వహించిన పాత్ర భారత సోషలిస్టు ఉద్యమ చరిత్రలో మరొక ప్రతిష్ఠాత్మక అధ్యాయం. చాలా మంది ఆ 19 నెలలూ జైలు జీవితం గడిపారు. విద్యార్థి నాయకుడుగా పేరు పొంది, ఆ తరువాత ప్రొఫెసర్ అయిన రాజ్‌కుమార్ జైన్, సామాజిక క్రియాశీలి విజయ్ ప్రతాప్, ట్రేడ్ యూనియన్ నాయకుడు దలీప్ సింగ్ మొదలైన వారెందెరినో ఈ సందర్భంలో తప్పక ప్రస్తావించుకోవాలి.
ఇంతకూ భారతీయ సోషలిజం ఏమిటి? చాలామంది భావిస్తున్నట్టు యూరోప్ లోని సోషల్ డెమోక్రాటిక్ సంప్రదాయానికి భారతీయ రూపం కానే కాదు. యూరోపియన్ సంప్రదాయం ఎన్నికల ప్రజాస్వామ్యం ద్వారా అసమానతలను పరిమితంగా తగ్గించడమే లక్ష్యంగా ఉన్న రాజకీయ భావజాలం మాత్రమే. భారతీయ సోషలిజంను ప్రశస్తంగా ప్రవచించిన చింతకుడు లోహియా. ఆయన సిద్ధాంతం విభిన్నమైనది. అదొక భావసాహసం. సోషలిస్టు భావ జాల యూరోప్ కేంద్రిత మూలాలను త్యజించి, సమస్త సమాజాలకు ఉపయుక్తమయ్యేలా సోషలిజం భావనకు ఆయన ఒక విలక్షణ రూపునిచ్చారు.
లోహియా సోషలిస్టు భావజాలంలోని నాలుగు అంశాలకు వర్తమాన భారతదేశంలో విశేష ప్రాసంగికత ఉన్నది. అవి: సమానత్వ భావనను ఆర్థిక దృక్కోణానికి పరిమితం చేయకుండా, కులం, జెండర్, జాతి, జాతీయత మొదలైన అంశాలకు కూడా వర్తింప చేశారు. మహిళా రిజర్వేషన్లు, కుల గణన, ఓబీసీ, ఎస్సీ కోటాలలో ఉపకోటాలకు సంబంధించిన చర్చలలో బహుళ, క్రమబద్ధమైన పొరలతో కూడిన సామాజిక సోపాన క్రమాలను అర్థం చేసుకునేందుకు లోహియా భావన దోహదం చేస్తుంది; సుస్థిర శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ పట్టణ, పారిశ్రామిక టెక్నోక్రాటిక్ అభివృద్ధి నమూనాపై పునరాలోచనకు భారతీయ సోషలిస్టులు పునాదులు వేశారు. వాతావరణ మార్పు పర్యవసానాలు తీవ్రమవుతున్న ప్రస్తుత సందర్భంలో ఈ కొత్త ఆలోచనాపద్ధతికి ప్రాధాన్యమున్నది; సామాజిక పరివర్తన సాధనకు ఎన్నికల ప్రజాస్వామ్యం లేదా రాజకీయ హింసకు ప్రత్యామ్నాయంగా గాంధీ సత్యాగ్రహ తాత్త్వికత, పద్ధతుల స్ఫూర్తిని స్వీకరించడం; మన భాషలు, సంస్కృతి, జాతీయవాదం ప్రగాఢ ఆధారాలుగా ఉన్న సాంస్కృతిక రాజకీయాలకు కొత్త వ్యాకరణాన్ని భారతీయ సోషలిస్టులు రూపొందించారు. సాంస్కృతిక జాతీయవాదం, జనప్రియ వాదాల ప్రాబల్యం, జాతికి ప్రాధాన్యమిచ్చే జాతీయవాద ధోరణుల ఉధృతిని ఎదుర్కొనేందుకు సోషలిస్టుల సాంస్కృతిక రాజకీయాల అవసరం ఎంతైనా ఉన్నది.
కొన్ని దశాబ్దాల క్రితం సోషలిస్టు భావాలతో ప్రమేయం లేకుండా భవిష్యత్తు గురించి ఆలోచించడం అసాధ్యంగా ఉండేది. కాల కెరటం నేడు సోషలిస్టు తీరాన్ని వీడి అవతలి గట్టుకు వెళ్లిపోయింది. సోషలిజం ఒక తిట్టు పదమైపోయింది. అయితే అమానుష అసమానతలు లేని, ప్రతి ఒక్కరికీ శ్రేయోజీవితాన్ని సమకూర్చే ఒక మానవీయ సమాజ నిర్మాణ ఆకాంక్ష స్వతస్సిద్ధమైన స్ఫూర్తినిస్తోంది. అటువంటి సమాజాన్ని నిర్మించేందుకు ఆరాటపడేవారు తమనుతాము సోషలిస్టులమని కాకుండా వేరే విధంగా పిలుచుకోవచ్చు. అయితే 20వ శతాబ్దిలో సోషలిస్టు శ్రేణులలో చీలికలు తెచ్చిన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలను వారు తప్పక ఉపేక్షిస్తారు. మానవీయ సమాజానికై ఈ సరికొత్త అన్వేషణ బహుశా కొత్త రాజకీయ కార్యాచరణలకు దారితీసే అవకాశమున్నది. సోషలిజం స్ఫూర్తిని ఆవాహన చేసుకుని, దానిని పునరుజ్జీవింప చేసినప్పుడు జాతి భవితవ్యాన్ని సముజ్వలంగా నిర్మించేందుకు అదొక కార్యసాధకమైన భావజాల ప్రాతిపదిక అవుతుంది. వంద సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభావ ప్రాబల్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు 90 సంవత్సరాల సోషలిస్టు ఉద్యమ వారసత్వం శక్తిమంతమైన రాజకీయ, మేధో వనరులను మనకు సమకూర్చగలదనే పరిపూర్ణ ఆశాభావంతో పూణే నుంచి నా స్వస్థలానికి వెళ్ళాను.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్