Share News

19th Century Telugu Literature: గురజాడకు ముందే ముత్యాలసరం

ABN , Publish Date - Oct 06 , 2025 | 06:03 AM

19వ శతాబ్దాన్ని క్షీణ యుగంగా తెలుగు సాహిత్య చరిత్రకారులు నిర్ణయించడం కారణంగా– ఆ శతాబ్ది సాహితీ ప్రాభవం అజ్ఞాతమై విస్మరణకు గురైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం...

19th Century Telugu Literature: గురజాడకు ముందే ముత్యాలసరం

19వ శతాబ్దాన్ని క్షీణ యుగంగా తెలుగు సాహిత్య చరిత్రకారులు నిర్ణయించడం కారణంగా– ఆ శతాబ్ది సాహితీ ప్రాభవం అజ్ఞాతమై విస్మరణకు గురైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత పీజీ విద్యార్థులకు వాఙ్మయ పాఠ్య ప్రణాళిక రూపొందించిన సాహితీవేత్తలు కూడా ఇదే అభిప్రాయం కలిగి ఉండటంతో ఈ భావన అలాగే స్థిరపడిపోయింది. 19వ శతాబ్దాన్ని క్షీణయుగంగా నిర్ధారించి నిర్దిష్టఅధ్యయనం, పరిశోధన చేయకపోవటంతో తెలుగు భాష ఎంతో సాహిత్య చరిత్రను కోల్పోయింది.

ఇటీవల ఆధునిక సాహితీవేత్తలు, కవిపండిత విమర్శకులు కొందరు ఆ శతాబ్దిపై దృష్టి సారించారు. వారి కృషి వల్లనే ఆధునిక నవ్యయుగానికి సంబంధించిన బీజాలు 19వ శతాబ్దిలోనే పడ్డాయన్న సత్యం ఎట్టకేలకు వెలుగు చూసింది. ఈ దిశగా తన పరిశోధన ఎక్కుపెట్టిన వారిలో డా. ఆచార్య ఫణీంద్ర ముఖ్యులు. 20వ శతాబ్ది నవ్యకవితా మహావృక్షం ఒక్క మారుగా అవతరించలేదనీ, 19వ శతాబ్దిలో పడిన బీజాలు అంకురించాయనీ ఫణీంద్ర వివిధ దృక్కోణాలలో విస్తృత అధ్యయనం అనంతరం నిరూపించారు. ఆయన ఈ ఇతివృత్తంపై తన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథాన్ని 2008లో సమర్పించారు. ఆ సిద్ధాంత గ్రంథం 2024లో ప్రచురితమై పండితలోకంలో సంచలనం సృష్టించింది.


‘క్షీణయుగం కాదు... ఉషోదయ యుగం (19వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్ర)’ పేరుతో ప్రచురితమైన ఈ గ్రంథంలోని ఆరవ అధ్యాయంలో, 11వ శతాబ్ది నుండి 19వ శతాబ్ది అంతం వరకు సంప్రదాయ పద్య ఛందస్సులతో కొనసాగిన తెలుగు కవిత్వం ఏవిధంగా కొత్త మలుపు తిరిగినదీ ఫణీంద్ర విశ్లేషించారు. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో ఛందో నవ్యతను, నవ్య కవిత్వ యుగారంభంలో దారి ప్రభావాన్ని స్పష్టం చేసారు. రేవణూరి వెంకటార్యుడు 1810ప్రాంతంలో ఇంచుమించుగా ముత్యాలసరం ఛందస్సును తన ‘శ్రీపాద రేణు ప్రభావం’ అన్న కావ్యంలో ప్రయోగించారని, గురజాడ కంటే సుమారు వందేళ్ళకు పూర్వమే ఈ ఛందస్సు వుందని ఆధారాలతో ఫణీంద్ర రుజువు చేసారు.

రేవణూరి వేంకటార్యుని ఛందస్సు పేరును తురంగ వృత్తంగా పేర్కొంటూ, రెండు ఛందస్సుల సామ్యాన్ని తన సిద్ధాంత గ్రంథంలో పరిశోధనా దృక్కోణంతో అవలోకింప చేసారు ఫణీంద్ర. ఈ వృత్తం గురజాడ ముత్యాలసరం ఛందస్సుకు ఆద్యరూపంగా పేర్కొన్నారు. గురజాడ కొత్తగా మాత్రా ఛందస్సుకు ముత్యాలసరం సృజించాడనే విషయం పూర్తిగా వాస్తవం కాదని నిరూపించారు.

1831 నాటి ‘ఆంధ్రభారతి’ పత్రికలో ‘మేలుకొలుపు’ అన్న గేయం ముత్యాలసర మిశ్రగతిలో వుందని సి. నారాయణరెడ్డి తన ‘ఆధుని కాంధ్ర కవిత్వం – సంప్రదాయాలు ప్రయోగాలు’ గ్రంథంలో ప్రస్తావించారు. గురజాడ రచన ‘తోకచుక్క’కు ఒక ఏడాది ముందే ‘మేలు కొలుపు’ వచ్చింది. ‘మేలుకొలుపు’ గేయకర్త మంగిపూడి వేంకట కృష్ణ శర్మ అయివుండవచ్చని ‘ఆధునికాంధ్ర గేయకవిత్వం’లో డా. జి. చెన్న కేశవరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఫణీంద్ర పరిశోధన ప్రకారం ‘రేవణూరి’ కవి తురంగ వృత్తకావ్య ప్రభావం తదనంతర శతాబ్దిలోని నవ్యకవితారీతులపై పడి వుండవచ్చునని స్పష్టమవుతోంది.


1862లో జన్మించిన గురజాడ కాలం నాటి స్థితిగతులకు, మత సాహిత్యం వెల్లివిరిసిన రేవణూరి వేంకటార్యుని రోజులకు సంబంధం లేదు. గురజాడ 53ఏళ్ల జీవితకాలంలో గ్రాంథిక భాషావాదుల ప్రతిఘటనను ఎదుర్కొంటూ సంస్కరణాయుత తిరుగుబాటుతో ఎదురీదారు. తేటైన తల్లి నుడి కూర్చుకొని ముత్యాలసరాలు గుచ్చి వాడుక పలుకుబడితో తెలుగు పద్య మణిహారాన్ని గేయంగా అవతరింప చేసారు. ఆయన మాటలలో– ముత్యాలసరము ఒక వితత కవితా ఖని. ఆయన తన ముత్యాలసరం రచనా ప్రక్రియ మూలం గురించి వివరంగా ఎక్కడా చెప్పలేదు. ‘‘ఒక జాతి పార్శీ గజలు యొక్క నడకతో ముత్యాలసరం తెచ్చుటకు ప్రయ త్నించాను’’ అని మాత్రం లక్షణ వ్యాసంలో తెలిపారు. రేవణూరి వెంకటార్యుని అద్భుత సృష్టి తురంగ వృత్తం, ‘వృషభగతి’, ‘హరిణగతి’ ప్రాచీన జానపద గేయాల రగడల ఒరవడిలోనే సాగింది.

గురజాడ అనంతరం తొలిశ్రేణిలో అబ్బూరి, బసవరాజు, దేవులపల్లి, కవికొండల, శ్రీశ్రీ ఎందరో గురజాడ అడుగుజాడలో ఈ ప్రక్రియ అనుసరించి నవ్య కవితా మహోదయాన్ని ఆహ్వానించారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, సంఘ సంస్కరణ ప్రియత్వం, మానవతా విలువలు, జాతీయతా, దేశభక్తి మహదాశయంతో ముత్యాలసరాలు నాంది పలికింది. ఈ అద్భుత ప్రక్రియ సృష్టికర్త రేవణూరి వేంకటార్య కవి తెలుగుజాతికి చిరఃస్మరణీయులు.

జయసూర్య

94406 64610

ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 06 , 2025 | 06:03 AM