Share News

పుస్తక పఠనంతోనే విద్యావికాసం

ABN , Publish Date - May 07 , 2025 | 04:58 AM

తెలుగు ప్రజలారా దయచేసి ఈ విషయాలను శ్రద్ధగా వినండి, ఆలోచించండి, చర్చించండి, ఉద్యమించండి. మనుషులందరినీ మాయ మబ్బులు కమ్మేశాయి. సెల్ ఫోన్ చీకటి కమ్మేసింది. చదువుల దుఃఖం మింగేసింది. వాట్సప్ మబ్బులు కమ్ముకున్నాయి. సోషల్ మీడియా...

పుస్తక పఠనంతోనే విద్యావికాసం

తెలుగు ప్రజలారా దయచేసి ఈ విషయాలను శ్రద్ధగా వినండి, ఆలోచించండి, చర్చించండి, ఉద్యమించండి. మనుషులందరినీ మాయ మబ్బులు కమ్మేశాయి. సెల్ ఫోన్ చీకటి కమ్మేసింది. చదువుల దుఃఖం మింగేసింది. వాట్సప్ మబ్బులు కమ్ముకున్నాయి. సోషల్ మీడియా అందరినీ ఊబిలోకి నెట్టేస్తోంది. దీనివల్ల మంచి మాట మాట్లాడుకునే పరిస్థితి లేదు. మంచి కథ చదువుకో బుద్ధి కాదు. మంచి పుస్తకం దరిచేరదు. జీవితం ఆనందమయమైన కళలు, సాహిత్యం నుంచి దూరమైపోయింది.

మాతృభాషను పరిరక్షించుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాలు అథమ స్థాయికి దిగజారిపోయాయి. తమిళనాడు వంటి రాష్ట్రాలు మాతృభాషను పరిరక్షించుకుంటూ పాఠశాలల్లో తప్పనిసరిగా తమ భాషను నేర్పుకుంటూ, హిందీని వదిలించుకొని ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నాయి. మాతృభాషలో ప్రాథమిక విద్యను తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉందని భాషాశాస్త్రవేత్తలు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలు మాతృభాషలో బోధనను పక్కన పెట్టేసి, ఆంగ్ల భాషా మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టడం వల్ల సగం మంది పిల్లలు ఇంగ్లీషు చదవలేకపోతున్నారు. కాస్తో కూస్తో చదివే పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనితో విద్యార్థులు బడికి రావడం మానేస్తున్నారు. ఫలితంగా చదువుల వల్ల పిల్లలు ఆనందాన్ని కోల్పోతున్నారు. ఆలోచనను, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతున్నారు. యాంత్రికంగా బట్టీ చదువుల మాయలో కొట్టుమిట్టాడుతున్నారు.

క్రమశిక్షణ లేని విద్య నిరర్థకం. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ అలవాటు చెయ్యాలి. అది విద్యార్థిని చదువుల వైపు ప్రేరేపిస్తుంది. నైతిక విలువలపై నిరంతరం అభ్యాసం జరుగుతూ ఉండాలి. క్రమశిక్షణకు విలువల విద్య తోడైతే పిల్లలు మరింతగా రాణిస్తారు. పాఠశాలల్లోనే క్రమశిక్షణ, నైతిక విలువలకు సంబంధించిన బోధన జరగాలి.

తెలివైన పిల్లలకు చదువుకోవడానికి సమయం ఉండడం లేదు. విద్యావ్యవస్థలో ప్రధాన లోపాలలో గైడ్స్‌ వినియోగం ముఖ్యమైనది. ప్రతి తరగతిలోనూ గైళ్లను వాడుతున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పాఠశాలల్లో గైళ్లను ఉపయోగించకూడదు. ప్రైవేట్ స్కూళ్లలో మెటీరియల్ ఇచ్చి చదివిస్తారు. కాబట్టి గైళ్ళ నుంచి రాసే చాకిరీ తప్పి పిల్లలకు చదువుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. అక్కడ ఎక్కువమంది పిల్లలు ఉత్తీర్ణులవుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో గైళ్ళలో ఉన్న విషయాన్ని యథాతథంగా ఎత్తి నోట్సులో రాయించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సరిగా చదవడం రాని పిల్లలకు గైళ్ళు చూసి రాయడం ఎంతో ఇబ్బంది. దీంతో నోట్సులు రాయలేక, భయంతో చాలామంది పిల్లలు బడి మానేస్తున్నారు.


పదవ తరగతి పరీక్షలు పెద్ద ప్రహసనం. పిల్లల్ని పదవ తరగతి పాస్ చేయించడానికి సమాజంలో ప్రతి ఒక్కరు శతవిధాలా ప్రయత్నం చేస్తారు. పదవ తరగతి, ఇంటర్ రెండు సంవత్సరాలు ఎలాగోలా గట్టెక్కి ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చినా, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రభుత్వమే ఫీజులు కట్టి కొందరిని ఉచితంగా చదివిస్తుంది. అలా ఇంజనీరింగ్ అయిపోయిన తరువాత బయటపడిన విద్యార్థికి ఏ పనీ చెయ్యడం చేతకాదు, దాంతో ఏ ఉద్యోగమూ రాదు. పిల్లలు రెంటికీ చెడ్డ రేవడిగా తయారవుతున్నారు. వీళ్లు సమాజంపై కసి పెంచుకుని విద్రోహులుగా మారుతున్నారు. తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు.

పాఠశాల–కళాశాల గ్రంథాలయాల్లో పిల్లలకు చదవడంపై ఇష్టం పెరగాలన్నా, చదివింది అవగాహన చేసుకోవాలన్నా, సాహిత్యం పరిచయం కావాలన్నా, స్వీయ అభ్యసనం పెరగాలన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి కావాలన్నా గ్రంథాలయాల అభివృద్ధి తప్పనిసరి. పుస్తకాల పఠనం తప్పనిసరి చెయ్యాలి. దీంతో పిల్లలు చదువుపై ఇష్టం పెంచుకుంటారు. చదవడం వచ్చిన పిల్లలు అవగాహన పెంచుకుంటారు. స్వీయ రచనా సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచనాశక్తి పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడతారు. పుస్తక పఠనానికి పాఠశాల, కళాశాలలే ముఖ్య కేంద్రాలు. పాఠశాల గేటు దాటితే పిల్లల చేతుల్లోకి సెల్‌ఫోన్లు వస్తున్నాయి. దాంతో వారికి ఎవరి మాటా వినబడదు.

పాఠశాలలో గ్రంథాలయాల నిర్వహణకు ప్రత్యేకంగా ఒక టీచర్ లేదా వాలంటీర్ ఉంటే ఆ గ్రంథాలయం సక్రమంగా నిర్వహించబడుతుంది. గ్రంథాలయంలోని పుస్తకాలు చదివితే పిల్లల్లో క్రమశిక్షణ విలువలు, విద్యావికాసం పెంపొందుతాయి. ఉపాధ్యాయులు చెయ్యలేని పనిని గ్రంథాలయం చెయ్యగలుగుతుంది. పుస్తకం ఇచ్చే చైతన్యం వెలకట్టలేనిది. చదవడం రాని పిల్లల్ని సైతం కథల పుస్తకాలు ప్రేరణ కలిగించి, చదువు నేర్చుకునేలా చేస్తాయి, ప్రాపంచిక జ్ఞానాన్ని పెంపొందిస్తాయి.

పాఠశాలల్లో చదువు నేర్పడంలో ఇబ్బందులుంటే విద్యార్థులు ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అన్ని స్థాయిల్లో అధికారులు పాఠశాలలను సందర్శించాలి. విద్యార్థుల చదువుల తీరును గమనించాలి. వాస్తవ స్థితిని తెలుసుకోవాలి. పాఠశాలల్లో విధానాలు ఎంత అధ్వానంగా ఉన్నాయి, విద్యావ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉంది. దీనిని ఏ విధంగా సరిచేసుకోవాలి అనే విషయాలపై మేధావులు, నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులతో చర్చ జరగాలి. మార్పు కోసం అందరూ ప్రయత్నించాలి. నెమ్మదిగా శిథిలమైపోయిన వ్యవస్థను పునర్నిర్మించుకోవాలి. రెండు రాష్ట్రాలలో అనేక జిల్లాల్లో అద్భుతమైన పనితీరు ప్రదర్శించే పాఠశాలలు ఉన్నాయి. నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇలాంటి పాఠశాలల్ని, ఉపాధ్యాయుల్ని గుర్తించి వాళ్ళను ప్రోత్సహించాలి. వారు అమలు చేస్తున్న విధానాలను గుర్తించి, అన్ని పాఠశాలలకు ఆ విధానాలను విస్తరించాలి. ప్రతి విషయానికి ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రజలు కూడా సమస్యలను పట్టించుకోవాలి. మేధావులు, విద్యావంతులు, సాహిత్యవేత్తలు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సినిమా పరిశ్రమ, ఎన్ఆర్ఐలు సమాజంలో జరిగే అనర్థాలను పట్టించుకోవాలి.


ఈ సమస్యల పరిష్కారానికి మరో గ్రంథాలయ ఉద్యమం రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరూ తమ వంతుగా తాము చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలి. తమ గ్రామంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడానికి సన్నద్ధం కావాలి.

మంచికంటి

కథా రచయిత

ఇవి కూడా చదవండి..

సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం

India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన

Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - May 07 , 2025 | 04:58 AM