Share News

ప్రభుత్వ విద్యార్థి భవిష్యత్తుకు భరోసా కావాలి

ABN , Publish Date - May 07 , 2025 | 05:12 AM

ప్రభుత్వ బడుల పనితీరుపై ఈ మధ్యకాలంలో సీఎం నుంచి సామాన్య పౌరుడి వరకు చాలా విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇదొక శుభపరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా...

ప్రభుత్వ విద్యార్థి భవిష్యత్తుకు  భరోసా కావాలి

ప్రభుత్వ బడుల పనితీరుపై ఈ మధ్యకాలంలో సీఎం నుంచి సామాన్య పౌరుడి వరకు చాలా విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇదొక శుభపరిణామం. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపితే తాము కూడా తమ పిల్లలను పంపేందుకు సిద్ధమన్నది ఆయా ఉపాధ్యాయులు చెప్పే మాట. ప్రభుత్వ విద్యలో నాణ్యతా ప్రమాణాలు, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి చేపట్టాల్సిన చర్యల కోసం ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం చివరకు వాగ్వివాదాలతో ముగిసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు అంతరాలు లేని నిర్బంధ ఉచిత విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాల విధి. అయినా పేద పిల్లలకు నాణ్యమైన విద్య ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. ఈ నేపథ్యంలో, రోజురోజుకూ సమాజంలో సామాజిక, ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులుగా పేదవారు మరింత పేదవారుగా మారుతున్నారు. ఈ విషవలయాన్ని ఛేదించేది ఒక్క చదువు మాత్రమేనని డా. బీఆర్ అంబేడ్కర్ చెప్పారు.

ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా ఫలితాలు మాత్రం అశించిన స్థాయిలో ఉండడం లేదు. ఒకప్పుడు దాదాపు తొంభై ఐదు శాతానికి పైగా విద్యార్థులకు విద్యనందించిన ప్రభుత్వ పాఠశాలలు నేడు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో 2014–15లో 57.19 శాతం మంది విద్యార్థులు ఉండగా 2024–25 నాటికి 73.50 శాతానికి పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం 42.81 శాతం నుంచి 26.50 శాతానికి పడిపోయింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత విద్యార్థుల సంఖ్య లేదని చెబుతూ 2009, 2011, 2015 సంవత్సరాల్లో రేషనలైజేషన్ పేరుతో వేలాది గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు.

2020 జాతీయ విద్యావిధానం ప్రకారం విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి 35:1గా ఉండాలి. కానీ దేశంలోనే అత్యంత కనిష్టంగా మన యూపీఎస్‌ పాఠశాలల్లో ఈ నిష్పత్తి 13:1 ఉండగా ఉన్నత పాఠశాలల్లో 9:1గా ఉంది. అయినా మరో డీఎస్సీ నిర్వహణ ప్రభుత్వ పరిశీలనలో ఉంది!


‍ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడానికి బడిబాట, మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల లాంటి కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా అడ్మిషన్లు తగ్గుతూనే వస్తున్నాయి. అర్హతలేని వ్యక్తులతో బోధన చేయిస్తున్నా, ఫీజులు భారమైనప్పటికీ తక్కువ స్థాయి, మధ్యతరగతి నుంచి సంపన్నవర్గ తల్లిదండ్రుల వరకు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపుతున్నారు. తమ పిల్లలను ఇంటర్మీడియట్ వరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివించిన తల్లిదండ్రులు.. వృత్తి విద్యలైన మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్ కోసం చూస్తున్నారు. సహజంగానే ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు పోటీపడలేక, వృత్తి విద్య కోర్సుల్లో, ఉద్యోగాల్లో అవకాశాలు రావడం లేదు. ఫలితంగా పేదవారు ఉన్నత విద్యకు, ఉపాధికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వాస్తవాన్ని గ్రహించాలి.

అడ్మిషన్ల లేమితో ప్రాభవం కోల్పోతున్న ప్రభుత్వ పాఠశాలలకు ఉద్దీపన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ బడిలో చదివే పిల్లలకు కళ్లు చెదిరే రంగులతో ఆధునిక భవనాలు కాదు వృత్తివిద్య ఉద్యోగ భరోసా కావాలి. ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ వృత్తి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పించాలి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ప్రచారం లేకున్నా ఊహకు అందనన్ని అడ్మిషన్లు పెరుగుతాయి. క్రమంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, బాధ్యతాయుతమైన బోధన, మూల్యాంకనం జరిగి ఒక నూతన సమాజ నిర్మాణానికి బాటలు ఏర్పడతాయి. రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో ప్రధాన అంశంగా చోటు దక్కి, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుంది.


ప్రభుత్వ పాఠశాలలు సమాజ విశ్వాసం కోల్పోతున్న సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయాలనే ప్రగతిశీల ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, టీచర్ల నియమకాలతో పాటుగా ప్రభుత్వ బడిలో చదివే పిల్లలకు ప్రభుత్వ వృత్తివిద్య కాలేజీల ప్రవేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించే చట్టం చేయడానికి పూనుకోవాలి. అలా కాపాడగలిగితే ప్రభుత్వ విద్యా పరిరక్షణ పితామహుడిగా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలవడం ఖాయం.

మామిడి నారాయణ

సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్

ఇవి కూడా చదవండి..

సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం

India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన

Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - May 07 , 2025 | 05:12 AM