Nuclear Power Privatization: ‘అణు’ ప్రైవేటీకరణ దేశద్రోహమే
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:11 AM
అణుశక్తి రంగం ఒక సాధారణ పరిశ్రమ కాదు. ఇది దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి, మానవ జాతి భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అత్యంత వ్యూహాత్మక రంగం. ఇలాంటి రంగాన్ని...
అణుశక్తి రంగం ఒక సాధారణ పరిశ్రమ కాదు. ఇది దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి, మానవ జాతి భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అత్యంత వ్యూహాత్మక రంగం. ఇలాంటి రంగాన్ని ప్రభుత్వ నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ లాభాలే లక్ష్యంగా ఈ రంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక పొరపాటు మాత్రమే కాదు, దేశద్రోహానికి సమానమైన నిర్ణయం. అణుశక్తి అనేది అత్యంత ప్రమాదకరమైన శక్తి. ఇందులో చిన్న నిర్లక్ష్యం కూడా లక్షలాది ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి ముప్పు కలిగిస్తుంది.
అణుశక్తి రంగాన్ని ప్రైవేటీకరిస్తే– 1) వేల సంవత్సరాలు ప్రమాదకరంగా రేడియోధార్మిక వ్యర్థాలు వెలువడతాయి. 2) చెర్నోబిల్, ఫుకుషిమా లాంటి ప్రమాదాల ముప్పు. 3) నిర్మాణం, నిర్వహణ, మూసివేతకు వేల కోట్ల వ్యయం. 4) నిర్మాణానికి దశాబ్దాల కాలం పడుతుంది. 5) అణువ్యాప్తి ప్రమాదం.. ఆయుధాల తయారీకి దారి తీసే అవకాశం. 6) యురేనియం పరిమిత వనరు.. పునరుత్పత్తి కానిది. 7) అధిక నీటి వినియోగం. 8) భూతాప పెరుగుదలతో జల, జీవ వ్యవస్థల వినాశనం. 9) క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు. 10) యురేనియం గనులతో రాడాన్, ఆర్సెనిక్ వంటి విషపదార్థాల ప్రభావం. 11) వ్యర్థాల రవాణాతో ప్రమాదాలు, లీకేజీలు. 12) ఉగ్రవాద ముప్పు. 13) నిర్మాణ వ్యయాన్ని మించే మూసివేత వ్యయం. 14) వ్యర్థాల శాశ్వత పరిష్కారానికి ప్రపంచ వ్యాప్తంగా అంగీకారం లేదు. 15) కఠిన నిబంధనలతో నిర్వహణ క్లిష్టత. 16) ప్రజా వ్యతిరేకత. 17) సంక్లిష్ట సరఫరా వ్యవస్థ.. అంతర్జాతీయంగా ఆధారపడటం. 18) పునరుత్పాదక శక్తితో అసమతుల్యత. 19) భవిష్యత్ తరాలపై ఎనలేని భారం పడే ప్రమాదం.. వంటివి సంభవిస్తాయి.
స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో కీలక రంగాలను జాతీయీకరించడం వల్లే నేడు, పురోగమిస్తున్న భారతదేశం సాధ్యమైంది. 14 ప్రధాన బ్యాంకుల జాతీయీకరణతో రైతులు, చిన్న వ్యాపారులకు రుణాలు. కోల్ ఇండియా(1973) – ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు సంస్థ. ఓఎన్‌జీసీ, ఐఓసీ, బీపీసీఎల్– లాభదాయక ప్రభుత్వ సంస్థలు. ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, సెయిల్, హాల్, బీహెచ్ఈఎల్ – పారిశ్రామిక మౌలిక వసతులు. ఎయిర్ ఇండియా– సంక్షోభ కాలంలో దేశ సేవ.
అణుశక్తి ప్రైవేటీకరణ ఎందుకు అత్యంత ప్రమాదకరమంటే– ఏ రాష్ట్రం, ఏ జిల్లా అణు కేంద్రాన్ని అంగీకరించదు. ఒక్క కేంద్రానికి 13 బిలియన్ డాలర్లకు పైగా వ్యయం. భద్రత, పారదర్శకత ప్రైవేటులో అసాధ్యం. రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణలో లాభాల కోసం నిర్లక్ష్యం. భూగర్భ జలాలు, చెరువులు కలుషితం. వ్యర్థాలను భూమిలో దాచడం కూడా సురక్షితం కాదు.
ప్రపంచంలోని చాలా దేశాల్లో అణుశక్తి రంగం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. భారతదేశం యురేనియాన్ని– ఆస్ట్రేలియా, కెనడా, ఖజకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. అటువంటి సున్నితమైన రంగాన్ని ప్రైవేటు సంస్థల చేతికి ఇవ్వడం జాతికి వ్యూహాత్మకంగా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అణుశక్తి రంగం ప్రైవేటీకరణ ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా, ఏ కోణంలోనూ సమర్థనీయం కాదు. ఇలాంటి రంగం ప్రైవేటీకరణతో లాభాలు ప్రైవేటుకు, నష్టాలు ప్రజలకు లభిస్తాయి. అణుశక్తి రంగం తప్పనిసరిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి. అదే దేశానికి, ప్రజలకు, భవిష్యత్ తరాలకు ఉపయోగం.
m డా. కె.నారాయణ
చైర్మన్, సెంట్రల్ కంట్రోల్ కమిషన్, సీపీఐ
ఇవి కూడా చదవండి
2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
నేడు కాకపోతే రేపైనా సొంతింటికి వెళ్లాల్సిందే..