Preserving Telanganas Cultural Heritage: సాంస్కృతిక అస్తిత్వాన్ని ఎలా నిలబెట్టాలో స్పష్టత ఉన్నది
ABN , Publish Date - Oct 06 , 2025 | 06:13 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన డాక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి కవి, రచయిత, విమర్శకులు, అనువాదకులు. మీర్ లాయక్ అలీ రచన ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ను ‘హైదరాబాదు విషాదం’గాను..
ఉమ్మడి నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన డాక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి కవి, రచయిత, విమర్శకులు, అనువాదకులు. మీర్ లాయక్ అలీ రచన ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ను ‘హైదరాబాదు విషాదం’గాను, వి.పి. మీనన్ రచన ‘ద స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్’ను ‘అసఫ్ జాహీ సంస్థానం విలీన గాథ’గా తెలుగులోకి అనువదించి సెప్టెంబర్ 17 పరిశీలనకు కొత్త కోణాన్ని అందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వీరి ‘మట్టిపాట’, ‘తెలంగాణ రుబాయిలు’ రచనలు సాహిత్యాభిమానుల మనసును చూరగొన్నాయి. 2017లో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నియమితులై ప్రపంచ తెలుగు మహా సభలు విజయవంతమయ్యేందుకు కృషి చేశారు. ఇటీవల తెలంగాణ భాషా సాంస్కృ తిక శాఖ సంచాలకులుగా నియమితులైన సందర్భంగా ఆయనతో సంభాషణ:
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా నియమితులైన సందర్భాన మీకు శుభాకాంక్షలు. మీరు ఈ పదవిలో నియమించబడిన మొదటి పక్షంలోనే తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు రావడం పట్ల మీ స్పందన ఏమిటి?
తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఇదొక అత్యంత ఉత్సాహవంతమైన సందర్భం. 63.11ఫీట్ల ఎత్తు బతుకమ్మకు ఒక గిన్నిస్ రికార్డు, 1500మంది మహిళల బతుకమ్మ ఆటలోని ఏకత్వానికి మరో గిన్నిస్ రికార్డు సాధించాం. తక్కువ వ్యవధిలో సరైన ప్రణాళికతో, పర్యాటక–సాంస్కృతిక శాఖల మధ్య సమన్వయంతో ఇది సాధ్యమైంది.
మీరు గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవం ఇప్పుడు ఈ కొత్త హోదాలో ఉపయోగపడుతుంది అని భావించవచ్చా?
తప్పకుండా! సాహిత్య అకాడమీలో పనిచేసిన పరిజ్ఞానమే గాక, గత ముప్పై ఏళ్ళుగా వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థలతో నాకున్న అనుబంధం, కవులు రచయితలతో వ్యక్తిగత సాన్నిహిత్యం తప్పనిసరిగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా పనిచేయడంలో నాకు ఉపయోగపడుతుంది. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో కవులు రచయితలను మాత్రమే కాకుండా కళాకారులను కూడా చాలా సందర్భాలలో ఇన్వాల్వ్ చేశాము. ఆ సందర్భంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం చేయవలసిన కార్యక్రమాల పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఏర్పడింది.
విద్యావ్యవస్థలో మార్పులతో ఇంగ్లీష్ భాష డామినేట్ చేస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ భాషను కాపాడుకోవడంపై మీ ఆలోచనలు ఏమిటి?
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తెలుగు మాధ్యమం ప్రాథమిక పాఠశాలల స్థాయిలో కూడా లేకుండా పోయింది కాబట్టి ఇంకొక ఇరవై ఏళ్ళ తరువాత వచ్చే యువతకు తెలుగుపట్ల సాధికారత ఉండదనే విషయాన్ని ఒప్పుకుని తీరవలసిందే. తెలుగుని ఒక భాషగానైనా తప్పనిసరిగా నేర్చుకోవలసిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉంది అని తెలుగు భాషా చట్టం 2018 తెలియజేస్తుంది. దీని ప్రకారం ఏ రకమైన యాజమాన్య నిర్వహణలో ఉన్న పాఠశాలల్లోనైనా తెలుగును ఒక అంశంగా చదివి తీరాలి. కాబట్టి తెలుగును ఆసక్తిగా చదివే విద్యార్థులు భవిష్యత్తులో భాషాలో నైపుణ్యాన్ని సాధిస్తారు. ఇక సంస్కృతి విషయానికి వస్తే భాషకు ఉన్నంత డోకా సంస్కృతికి లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బోనాలు, బతుకమ్మ పండగలకి ఆదరణ పెరిగింది. ప్రభుత్వం వైపు నుండి కూడా ఈ పండుగలను ఉత్సాహభరితంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి సంస్కృతి పరిరక్షణ, భాషా పరిరక్షణ కంటే మెరుగ్గా ఉంది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఆటల్లో డీజేలు, దాండియా వచ్చి చేరినవి. తెలంగాణ జీవితం ఉట్టిపడే ఈ పండుగకు పూర్వకళ తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు?
బతుకమ్మ పాటలు ఏ కర్తృత్వం లేకుండా, మౌఖికంగా తరం నుండి తరానికి వస్తున్న సాంస్కృతిక సంపద. ఇవి ఒకప్పటి కుటుంబ సంబంధాలకు, ఆ సామాజిక స్థితికి అద్దం పడతాయి. అయితే మొదటి నుండి తెలంగాణాలో ఎగసిపడిన ఉద్యమాల ప్రభావాలకు బతుకమ్మ పండుగ కూడా లోనయ్యింది. ఇక ముందు ఎలాంటి కృత్రిమత్వం లేకుండా, సహజసిద్ధంగా ఈ పండుగ కొనసాగించే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కూడా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ సారి బతుకమ్మ ఆటలో ఈశ్వరమ్మ అనే ఒక ఆవిడతో బతుకమ్మ పాటలు పాడించాము. ఇకపై బతుకమ్మ సంబరాల్లో భౌతికంగా ఆడే పాడే సాంప్రదాయమే కొనసాగుతుంది తప్ప రికార్డింగ్‌లు, డీజేలు ఉండవు.
ఆదివాసీల కళారూపాలు, జానపదకళలు మొదలుకొని తెలంగాణ నాటకం వరకు మీ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది? సినిమా విషయంలో గతంలో ఉన్న ప్రోత్సాహం ఎలా ఏవిధంగా కొనసాగబోతున్నది?
కోయ, గుస్సాడి, లంబాడి లాంటి ఆదివాసి కళారూపాలు; ఒగ్గుడోలు, బహు రూపులు, పగటి వేషాలు, చిరుతలు, కోలాటం లాంటి జానపద కళారూపాల ప్రదర్శనకు వివిధ సందర్భాలలో అవకాశం దొరుకుతున్నది. ఇదివరకు ఇలాంటి కళా ప్రదర్శనలు చూడని నగర ప్రజలు కూడా వీటిని చూసే అవకాశాలు కలుగుతున్నాయి. ఆధునిక కాలం తీసుకువచ్చిన వేగం వల్ల ఒక్క సినిమాలే గాక టీవీలు, యూట్యూబ్ చానళ్లు, ఇతర మీడియా విస్తరించడంతో ఒక ప్రదర్శన రూపంగా నాటకం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన సమస్య కాదు. అయినప్పటికీ వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాదులో అనేక నాటక సమాజాలు ఉన్నాయి. అవి ప్రదర్శనలు కూడా చేస్తున్నాయి. ఇప్పటికీ పౌరాణిక నాటకాలు కూడా తెలంగాణలో ప్రదర్శించబడుతూనే ఉన్నాయి. రవీంద్రభారతిలో నాటకాలు, జానపద కళలు, ఆదివాసి కళారూపాలు సందర్భానుసారంగా ప్రదర్శించబడుతున్నాయి. సినిమా రంగానికి ప్రోత్సాహం కొనసాగుతుంది. తెలంగాణ భాషలో సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలకు ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వం గద్దర్ అవార్డులను కూడా బహూకరిస్తూ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.
భాషా సాంస్కృతిక శాఖ తరఫున సాహిత్య రంగం విషయంలో మీ దృష్టిలో ఎలాంటి కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలు ఉన్నాయి?
సాహిత్యంలో కృషి చేయడానికి తెలంగాణ సాహిత్య అకాడమీ, సంగీతంలోనూ నాటకంలోనూ కృషి చేయడానికి తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఉన్నాయి. ఈ రెండు సంస్థలతో సమన్వయంతో పని చేస్తూ సాహిత్యాన్ని సంగీత నాటకాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రణాళిక ఉంది. గతంలో సాహిత్య అకాడమీ తరఫున ‘కావ్య పరిమళం’, ‘నవలా స్రవంతి’ అనే రెండు కార్యక్రమాల ద్వారా తెలంగాణ కావ్యాలను, నవలలను విస్తృతంగా పరిచయం చేసి యూట్యూబ్‌లో స్థిరపరిచాం. పుస్తకాలుగా కూడా ప్రచురించాం. ఈ దిశగా భారతీయ సాహిత్య వైవిధ్యాన్ని తెలంగాణ పాఠకులకు తెలియజేయడానికి ఒక్కో భాషకు సంబంధించిన ప్రాతినిధ్య కావ్యాన్ని లేదా గ్రంథాన్ని పరిచయం చేసే ఆలోచన ఉంది. అనంతరం ప్రపంచంలో ప్రసిద్ధ సాహిత్య గ్రంథాలను విశేషజ్ఞుల చేత పాఠాలుగా చెప్పించి అటు దృశ్య రూపంలోనూ ఇటు గ్రంథరూపంలోనూ స్థిరపరిచే ఆలోచన కూడా ఉంది. నాటక సమాజాల దృష్టి కోణం నుండి కాకుండా, దార్శనికతతో కొన్ని నాటకాలను సృజింపజేసి అవి తెలంగాణ ప్రధాన పట్టణాలన్నింటిలోనూ ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన ఉంది.
సాహిత్య కార్యక్రమాలు ఇక ముందు మీ శాఖ నిర్వహిస్తుందా? సాహిత్య అకాడమీ నిర్వహిస్తుందా?
సాహిత్య కార్యక్రమాలను ప్రధానంగా సాహిత్య అకాడమీ నిర్వహిస్తుంది. కానీ సాంస్కృతిక శాఖ కూడా సందర్భావసరాలను బట్టి, సాహిత్య అకాడమీతో సమన్వయం చేసుకుంటూ సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
భాషా సాంస్కృతిక శాఖ తరఫున మీ దృష్టిలో వినూత్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి సాహిత్యాన్ని కళలను ఉపయోగించదలచుకున్నాం. స్త్రీ సాధికారత కోసం, గంజాయి, మాదకద్రవ్యాలులాంటి దుర్వ్యసనాలను నిర్మూలించడం కోసం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి ప్రజలను చైతన్యపరచడం కోసం అవసరమైతే జిల్లా కేంద్రాలకు నియోజకవర్గ కేంద్రాలకు మండల కేంద్రాలకు కూడా భాషా సాంస్కృతిక శాఖ కార్యక్రమాలను విస్తరించాలనుకుంటున్నాం.
ఇంటర్వ్యూ : ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
ఏనుగు నరసింహారెడ్డి
98490 82693
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు