Share News

Political Reality: కార్యకర్తలుండగా హైటెక్‌ సర్వేలు ఎందుకు

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:33 AM

ఇటీవలి కాలంలో ‘‘సర్వే యాపారం’’ బాగా జోరందుకున్నది! అయినదానికీ కానిదానికీ సర్వే ఒక ఫ్యాషనబుల్ వ్యాపకంగా మారింది. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. సిబ్బందితో కూడా పని లేదు. ఒక ఐఐటీ డిగ్రీ, చేతుల్లో...

Political Reality: కార్యకర్తలుండగా హైటెక్‌ సర్వేలు ఎందుకు

ఇటీవలి కాలంలో ‘‘సర్వే యాపారం’’ బాగా జోరందుకున్నది! అయినదానికీ కానిదానికీ సర్వే ఒక ఫ్యాషనబుల్ వ్యాపకంగా మారింది. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. సిబ్బందితో కూడా పని లేదు. ఒక ఐఐటీ డిగ్రీ, చేతుల్లో లాప్‌టాప్‌ ఉంటే చాలు ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు కలిసి సర్వే దుకాణం ఒకటి మొదలుపెట్టేయవచ్చు! నిజానికి ఈ సర్వేలను ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) ఉత్పత్తులను తయారు చేసే/ మార్కెటింగ్ చేసే మల్టీ నేషనల్ కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా ఉపయోగిస్తాయి. ఏ కంపెనీ ఉత్పత్తులను జనం ఎక్కువగా ఉపయోగిస్తున్నారో, అందుకు కారణాలు ఏమిటో సమాధానాలు రాబడితే అందుకు తగినట్టు మార్కెటింగ్ వ్యూహాన్ని వారు రూపొందించుకోవచ్చు. ఇప్పుడు సర్వేల జాడ్యం రాజకీయ పార్టీలకు పాకింది. కానీ ఈ ఆన్‌లైన్ సర్వేల్లో ఎవరూ నిజం చెప్పరన్న నిజాన్ని రాజకీయ నేతలు గ్రహిస్తున్నట్టు లేదు.

రాజకీయ పార్టీల నేతలు తమ గురించి, తమ పాలన గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నారో తెలుసుకొనేందుకు ఆధారపడవలసింది ఈ వ్యాపార హై–టెక్ సర్వేల మీద కాదు; ఆయా పార్టీల క్షేత్రస్థాయి నేతలు, క్రియాశీలక కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరుల మీద. అప్పుడే సరైన వాస్తవాలు తెలుస్తాయి. పైగా ఇందుకోసం ఆయా పార్టీలకు రూపాయి ఖర్చు పెట్టనక్కరలేదు. క్షేత్రస్థాయి బలగాలే సొంత ఖర్చుతో జనంలో తిరిగి జనాభిప్రాయాన్ని సేకరించి పంపుతారు. వాటిని క్రోడీకరించి, విశ్లేషించుకుంటే ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో పాలకులకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రజాభిప్రాయం తెలుసుకోడానికి ఇంతకుమించిన రాజమార్గం లేదు!

ఇక ఈ హైటెక్‌ సర్వే దుకాణాలన్నీ ‘క్యాష్ & క్యారీ’ తరహా వ్యాపార కాన్సెప్ట్‌లు మాత్రమే. వీటిని నిర్వహించే సంస్థలకు ప్రజలతో గానీ, వారి మనోభావాలతో గానీ, రాజకీయ పరిస్థితులతో గానీ, క్షేత్ర స్థాయి వాస్తవాలతో గానీ పరిచయం ఉండదు. ఎక్కడో ఐఐటీనో, ఎంబీఏనో చదువుకుని వచ్చి ఈ ‘సర్వే యాపారం’ మొదలుపెట్టేస్తారంతే!

రాజకీయ నేతలు కూడా (ఓటు అడిగే సందర్భంలో తప్పించి) ప్రజలను వదిలేశారు కాబట్టి, చివరకు ఇలా ఈ సర్వే యాపారులను పట్టుకుని సేద దీరుతున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు ఖర్చయినా రెడీమేడ్ ఫుడ్‌ లాగా సుఖంగా ఉంటుంది కాబట్టి లెక్క చేయటం లేదు. కానీ ఇదొక అసహజ, కృత్రిమ ప్రక్రియ. ఒక జూదం. గత ఎన్నికల ముందు ఈ సర్వే రాయుళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తూ, జనం మనోభావాలతో ఎలా ఆడుకున్నారో మనమంతా చూశాం!


గత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ సర్వేలనే జూదంపై ఆధారపడే చివరకు అన్నీ కోల్పోయారు. మద్దతుదారులను, కార్యకర్తలను, అభిమానులను, నాయకులను, శాసనసభ్యులను పోగొట్టుకున్నారు. జగన్‌ వందలాదిగా సర్వేలు నిర్వహించారని చెబుతారు. ఆ నివేదికల ఆధారంగానే ఆయనకు ‘‘వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్?’’ అనేంత ధైర్యం వచ్చి ఉంటుంది. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు కూడా సర్వే చేయించామని, ఇంతటి ఘోర పరాజయం తాలూకు వాసనలేమీ ఆ సర్వేలో బయటపడలేదని ఆయన ఆ తర్వాత వాపోయారు. ఈ సర్వేల విశ్వసనీయత ఏపాటిదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకే కావాలి! ఈ సర్వేల పైనే ఆధారపడి, సిద్ధం... సిద్ధం అంటూ ఎన్నికల యుద్ధంలోకి దిగారు జగన్‌. చివరకు ఏ సర్వేకూ అందని ప్రజాభిప్రాయం పోలింగ్‌లో వ్యక్తం అయింది.

అందుకే, తెలుగుదేశం పార్టీ వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఈ బయటి సర్వేలపై ఆధారపడటం అనవసరం. కోటిమంది సభ్యులు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం సభ్యులు లేని గ్రామం అంటూ తెలుగునాట ఏదీ బహుశా ఉండకపోవచ్చు. కాబట్టి తెలుగుదేశం (కూటమి) ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలపై ఈ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రజల మధ్యనే నివసించే వారి అభిప్రాయాలకు మించిన సర్వే ఏముంటుంది?

అమరావతి పేరిట మరో 35 వేల ఎకరాల భూమి సేకరణ, గన్నవరం విమానాశ్రయంతోపాటు అమరావతిలో 5 వేల ఎకరాలతో మరో విమానాశ్రయం, గత పాలకుల హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు, పోలవరం–బనకచర్ల లింక్ కాలువలు... తదితర అంశాలపై ప్రజలు ఏమనుకుంటున్నారో నేరుగా తమ కార్యకర్తల ద్వారానే తెలుసుకోవచ్చు. కోటిమంది కార్యకర్తలకూ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. అందువల్ల, నిముషాల్లో వారికి సందేశాలు పంపి, 48 గంటల్లో సమాధానాలు సంపాదించవచ్చు. వాటి ప్రాతిపదికగా పాలనా విధానాలను సవరించుకోవచ్చు.

భోగాది వేంకటరాయుడు

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 04:45 AM