నదీ జలాలపై రాజకీయ కుప్పిగంతులు
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:14 AM
‘పోలవరం–బనకచర్ల (పీబీ) అనుసంధానం వల్ల ఎగువ రాష్ట్రాలకు ఏమీ నష్టం లేదు. సముద్రంలో కలిసిపోతున్న జలాల్లో 200 టీఎంసీలనే దుర్భిక్ష రాయలసీమకు తరలిస్తాం. వరద జలాలను వాడుకునే హక్కు చివరి రాష్ట్రమైన...
‘పోలవరం–బనకచర్ల (పీబీ) అనుసంధానం వల్ల ఎగువ రాష్ట్రాలకు ఏమీ నష్టం లేదు. సముద్రంలో కలిసిపోతున్న జలాల్లో 200 టీఎంసీలనే దుర్భిక్ష రాయలసీమకు తరలిస్తాం. వరద జలాలను వాడుకునే హక్కు చివరి రాష్ట్రమైన ఏపీకి ఉంది. ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు, నీటి అవసరాలు తీరిన తరువాతే మిగులు జలాలను మేం ఈ ప్రాజెక్టుకు వాడుకుంటాం’... ఇవి ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పిన మాటలు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని పదేపదే చెపుతున్నా తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఈ ప్రాజెక్టుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుందనే విషబీజాలు ఆ ప్రాంత రైతాంగంలో నాటుతున్నారు. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.
ఒకవేళ గోదావరి నీటిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీల వినియోగానికి ఏపీ ప్రభుత్వం బ్లాంకెట్ ఎన్ఓసీ ఇస్తే పీబీ ప్రాజెక్టుకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు మరొక మెట్టు ఎక్కి ‘మనకి గోదావరిలో ఇప్పటికే 960 టీఎంసీలకు హక్కు ఉంది. దానికి అదనంగా 1950 టీఎంసీలు కేటాయించాలి. అలాగే కృష్ణాలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం మనకు 299 టీఎంసీలే వచ్చినా, 750 టీఎంసీల నీళ్ళు కావాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదించాం. అటువంటిది రేవంత్‌రెడ్డి గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి బనకచర్ల ప్రాజెక్టు కట్టుకోండి అనడం అజ్ఞానం’ అంటూ విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన చంద్రబాబు ‘పీబీ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదు. గోదావరి నదిలో నీటి లభ్యత ఉంది కాబట్టి మీరు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ ఉంది కాబట్టి ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారమే నడుచుకుందాం’ అంటూ సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపారు.
అయితే, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు, నిపుణులు చంద్రబాబు సూచనను ఆహ్వానిస్తూనే బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించడం విడ్డూరం. గోదావరి జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు 65:35 నిష్పత్తిలో నీటిని పంచుకుంటున్నాయి కాబట్టి, వరద జలాల్లో కూడా అదే నిష్పత్తిలో వాటా కావాలని, పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తీసుకువెళుతున్నారు కాబట్టి నాగార్జునసాగర్ పైన ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల వాటా తమకు కూడా ఇవ్వాలని తెలంగాణ వాదిస్తోంది. అంటే, ఈ సమస్యను పరిష్కరించే బదులు దీన్ని ఒక అవకాశంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని తెలంగాణ ప్రాంత అధికార, ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. ఈ పీబీ ప్రాజెక్టులో కృష్ణాజలాల ప్రస్తావన లేకపోయినా తెలంగాణ లాయర్లు ‘కృష్ణాజలాలు లేకున్నా ఏపీకి ఏమీ ఇబ్బంది లేదని, కృష్ణానది నీటిపైన మొత్తం 811 టీఎంసీలలో 71శాతం నీళ్లు కేటాయించాలని’ అసంబద్ధ కోరిక వెలిబుచ్చారు. దీనిని బట్టి గోదావరి, కృష్ణానదీ జలాల వివాదాలు, పరిష్కార మార్గాలు వేర్వేరు అయినా రెంటినీ కలిపి మాట్లాడడం వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు.
బచావత్ ట్రిబ్యునల్ వినియోగ ప్రాతిపదికపై ప్రాజెక్టుల వారీగా కృష్ణానది నీటిని కేటాయించింది. పర్యవసానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు వచ్చాయి. జూరాల, రాజోలిబండ మళ్లింపు పథకం, కేసీ కెనాల్, తుంగభద్ర ఎగువ–దిగువ కాలువలు, నాగార్జునసాగర్ కుడి–ఎడమ కాలువలు, కృష్ణా డెల్టాకు విస్పష్టంగా నీటిని కేటాయించింది. దాన్ని వక్రీకరించడానికి, ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించలేదని అడ్డగోలుగా తెలంగాణ వాదిస్తోంది.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై ఏపీ, తెలంగాణలు సుప్రీంకోర్టులో వేసిన కేసు తేలే వరకు వీటితో పాటు పైనున్న మహారాష్ట్ర, కర్ణాటక కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి ఆధారంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయడం సరికాదు. అయినా... కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నాయి. దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. విభజన చట్టంలో తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏపీలో తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులను మాత్రమే పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్కొన్నారు. ఆ జాబితాలో లేని, జూరాల నుంచి ప్రతిపాదించబడిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా శ్రీశైలం జలాశయం నుంచి 800 అడుగుల నీటిమట్టం నుంచి నీటిని తోడే పథకం అక్రమ ప్రాజెక్టు కాక, సక్రమ ప్రాజెక్టు ఎలా అవుతుందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి.
ఏదిఏమైనా ఉభయ రాష్ట్రాలు సమన్వయంతో చర్చించుకోవడమే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ముందుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలులో ఉన్న విభజన చట్టానికి కట్టుబడి ఉండాలి. ప్రస్తుతం అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పులను గౌరవించాలి. ఆ ట్రిబ్యునల్ గడువు ముగిసిపోయిన తర్వాత ఏర్పడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యం త్వరితగతిన తీర్పు వచ్చేలా ఉభయ రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టాలి. ఆ తీర్పును తక్షణం నోటిఫై చేసి అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలకు పరిష్కారం సులభమవుతుంది. గోదావరి నీటి విషయంలో కూడా రాజకీయ, న్యాయ పోరాటాల కంటే సుహృద్భావ వాతావరణంలో, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి. ‘మాకు నష్టం లేకపోయినా, ఇతరులు లాభ పడకూడదు’ అనే ధోరణి విడనాడాలి.
u కూసంపూడి శ్రీనివాస్
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
ఇవి కూడా చదవండి..
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి